ఒక్క ఇండో- పసిఫిక్ ప్రాంతమనే కాదు, ప్రపంచమంతటా అమెరికాకు చైనా నుంచి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. మున్ముందు ప్రపంచంలో తానే అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనా- హిందూ, పసిఫిక్ మహా సముద్ర జలాల్లో, హిమాలయాల్లో ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది. బీజింగ్‌ను కట్టడి చేయడానికి ఇండో-పసిఫిక్, పశ్చిమాసియా క్వాడ్‌లను అమెరికా ఏర్పరచింది. ఆస్ట్రేలియా, బ్రిటన్‌లతో ఆకస్ సైనిక కూటమిని ప్రారంభించింది.
ప్రస్తుతం గూఢచర్య పరంగానూ కొత్త ఎత్తులు వేస్తోంది. చైనా, రష్యాల నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించడానికి సాటి ప్రజాస్వామ్య దేశాలను భాగస్వాములను చేసుకోవాలని సెప్టెంబరులో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)కు చెందిన గూఢచర్య, ప్రత్యేక కార్యకలాపాల ఉప సంఘం ప్రతిపాదించింది. వచ్చే ఏడాది జాతీయ రక్షణ అధికార చట్టంలో ఈ మేరకు ఒక సవరణ చేయాలని ఉద్దేశిస్తోంది.
అయిదు ఆంగ్లో- శాక్సన్ దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో ఏర్పడిన పంచనేత్ర గూఢచర్య కూటమిలో భారత్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీలనూ కలుపుకోవాలని ఈ ప్రతిపాదన సారాంశం. వాటిలో అమెరికాతో సైనిక పొత్తు లేని దేశం భారత్ ఒక్కటే. అయినా గూఢచర్య సమాచారాన్ని భారత్‌తో పంచుకోవడానికి పంచనేత్ర సిద్ధపడటం ఆసక్తికర పరిణామం. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన రావడం విశేషం.
అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రేగుతున్న రోజుల్లో ఏర్పడిన పంచనేత్ర కూటమిలోని దేశాలు గూఢచర్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొంటాయి. సోవియట్ కార్యకలాపాలపై నిఘా వేసి ఎత్తుకు పైయెత్తు వేయడం పంచ నేత్ర లక్ష్యం. తరవాత ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపైనా పంచనేత్ర దృష్టి సారించింది. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పసిగట్టి వారి కదలికలను కనిపెట్టడంలో ఆరితేరింది. ఆధునిక సాంకేతికత సాయంతో ప్రత్యర్థుల గుట్టుమట్లను కనిపెట్టి వారి ఆటకట్టించడానికి అహర్నిశలూ శ్రమిస్తుంది.
వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్‌లలో ఉగ్రవాదుల సంభాషణలు, సందేశాలను, సంఘ విద్రోహులు సాగించే అక్రమ మానవ రవాణా, లైంగిక అకృత్యాలను కనిపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనివార్యమవుతోంది. అందుకోసం ఆ మాధ్యమాల్లో తమకు ప్రవేశ సౌలభ్యం కల్పించాలని నిరుడు అక్టోబర్‌లో పంచనేత్ర దేశాలు డిమాండ్ చేశాయి. వాటితో భారత్, జపాన్ కూడా గొంతు కలిపాయి. ప్రస్తుతం వాట్సాప్ వంటి మాధ్యమాలు పటిష్ఠ గోప్యత విధానాలను అవలంబిస్తున్నాయి. అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి తామూ ఆ సందేశాలపై నిఘా వేసే వీలు కల్పించాలని పంచనేత్ర, భారత్, జపాన్ సాంకేతిక సంస్థలను కోరాయి.
భారత్, అమెరికాల మధ్య కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం చైనా, పాకిస్థాన్‌ల గురించిన సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకొంటున్నాయి.
భారత్ సాధికారికంగా పంచనేత్రలో చేరితే ఈ సహకారం సుదృఢమవుతుంది. పంచనేత్ర దేశాలు ఉపగ్రహాలతో, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో ప్రపంచమంతటినుంచీ గూఢచర్య సమాచారాన్ని సేకరిస్తుంటాయి. అది భారత్‌కు ఎంతో ఉపయుక్తమవుతుంది. ఉదాహరణకు పాకిస్థాన్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల రాకపోకలపై, కశ్మీర్‌లో వారి కార్యకలాపాలపై, ఉత్తర సరిహద్దులో చైనా కదలికలపై నిఘాకు పంచనేత్ర సమాచారం తోడ్పడుతుంది. గతేడాది భారత్, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన సైనిక వ్యూహ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఒకరి సైనిక స్థావరాలను మరొకరు ఉపయోగించుకోవడానికి, సామగ్రి బట్వాడాలో సహకరించుకోవడానికి వీలు ఏర్పడింది. బ్రిటన్‌తో ఇలాంటి ఒప్పందమే కుదరబోతోంది. రష్యాతోనూ సైనిక వ్యూహ ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ఆశిస్తున్నా, పంచనేత్రలో చేరిన తరవాత అది సాధ్యమవుతుందా అన్నది అనుమానమే.
పంచనేత్ర దేశాలు ప్రధానంగా ఉపగ్రహాలు, ఇంటర్నెట్ వంటి సాంకేతిక సాధనాల ద్వారా గూఢచర్య సమాచారం సేకరిస్తుంటాయి. ఇంటర్నెట్‌లో ఉగ్రవాదులు, నేరగాళ్లు జరుపుకొనే సంభాషణలను ఆలకించి అప్రమత్తం చేయగల సిబ్బందిని నియమిస్తాయి. వీరు పలు భాషల్లో నిష్ణాతులు. ఎలెక్ట్రానిక్ గూఢచర్యంలో వారికి అత్యున్నత శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. తదనుగుణంగా పంచనేత్ర దేశాలు సాంకేతిక వనరులపై భారీ పెట్టుబడులు పెడతాయి. తమ గూఢచార, నేరపరిశోధక సంస్థలకు భారీ బడ్జెట్లు కేటాయిస్తాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ బడ్జెట్ 960 కోట్ల డాలర్లు (దాదాపు రూ.71,000 కోట్లు). 2019-20లో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.2,575 కోట్లు. ఐబీకి 26,867 మంది సిబ్బందిని మంజూరు చేసినా, 8,000 పోస్టులు ఇంకా భర్తీ కాలేదని 2013లో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
ఇల్లలకగానే పండగ కానట్లు పంచనేత్రలో చేరినంత మాత్రాన భారత్ సంబరపడటానికి వీల్లేదు. సిబ్బంది నియామకాలు, శిక్షణ, అధునాతన సాంకేతిక వనరులను సమకూర్చుకోవడానికి భారీగా ఖర్చుపెట్టాలి. అదీకాకుండా, పంచనేత్రలో చేరితే రష్యాకు దూరమయ్యే ప్రమాదం ఉందని భారత్‌కు తెలుసు. అందువల్ల పంచనేత్ర విషయంలో అన్ని అంశాలనూ భారత్ బేరీజు వేసుకుని ముందడుగు వేయవలసి ఉంటుంది.
- ఆర్య