కరోనా సృష్టించిన కల్లోలం ఆర్థిక వ్యవస్థలతోపాటు ప్రజలనూ కుంగుబాటుకు గురిచేసింది. ఏదో ఒక రూపంలో ఆసరా అందకపోతుందా, సాధారణ జీవితాన్ని సాగించకపోతామా అని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల 'ఆత్మ నిర్భర్' ప్యాకేజీతో అందరి కళ్లు పెద్దవయ్యాయి. పన్నెండు కేజీల బియ్యం ప్రత్యక్షంగా అందినట్లు, పదిహేనువందల రూపాయలు నేరుగా బ్యాంకు అకౌంట్‌లో పడినట్లు... ఇంకా ఏదో జరుగుతుందని ఎదురుచూస్తున్న సాధారణ బడుగుజీవికి అలాంటి సంకేతాలేవీ అందలేదు. రుణాలు, రాయితీలు, ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడం తప్ప కేంద్ర ఖజానా నుంచి వెంటనే తక్షణ సాయంగా ఇన్ని కోట్లు ఇస్తున్నామన్న హామీ మాత్రం లేదు. వలసకూలీల కష్టాలపై కన్నీరు పెడుతున్నానని చెప్పిన ఆర్థిక మంత్రి వాళ్లకు భోజనాలు పెట్టాలని మాత్రం రాష్ట్రాలకు సూచించారు. వచ్చే రెండు నెలలు వలస కార్మికులకు ఇవ్వనున్న రేషన్ కాస్త కంటితుడుపు చర్యగా కనిపిస్తోంది. సరైన సమన్వయం లేకుండా శ్రామిక్ రైళ్లతో ఇబ్బంది పెట్టినట్లు చేయకపోతే చాలు.
అయిదు స్తంభాల ఆధారంగా ఆర్థికంగా దేశాన్ని నిలబెడతామని ప్రధాని ధైర్యం చెప్పారు. అవి ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, సాంకేతిక వ్యవస్థ, ప్రజలు, డిమాండ్. ఆలోచన పెద్దదిగా చాలా చక్కగా ఉంది. ఆచరణ ఎలా ఉంటుందో గమనించాలి. కరోనాను కట్టడి చేసేద్దాం- ఈ యుద్ధంలో మనం గెలిచి తీరాల్సిందే అనే ఉద్వేగపూరిత ప్రకటనలతో మొదలుపెట్టి కరోనాతో కలిసి జీవించాల్సిందే అంటూ రాజీ ధోరణిలోకి మార్చేశారు. తప్పదు అనుకుందాం. అందుకు తగినట్లుగానే మన నాయకులు మానసికంగా మనల్ని సిద్ధం చేస్తున్నారు. ఎంత ఆలోచించినా అయిదో స్తంభమైన డిమాండ్ మాత్రం ఆశించినంత స్పష్టంగా కనిపించడం లేదు.
బ్రిటన్లో ఉద్యోగులకు భరోసా..
వందశాతం ప్రభుత్వ హామీతో చిన్న వ్యాపార సంస్థలకు మూడు లక్షల కోట్ల రూపాయల రుణ సౌకర్యం బాగుంది. దీంతో 45 లక్షల సంస్థలకు ప్రయోజనం చేకూరడమూ మంచిదే. వీటితో పాటు ఇంకా అనేక వేల కోట్లతో ఇతర ఉద్దీపనలూ ప్రకటించారు. అవన్నీ 'ఆశిస్తున్న ప్రయోజనాల విలువలే' తప్ప కేటాయింపులు కాదని అందరూ గ్రహించాలి. ఆర్థిక అక్షరాస్యత లేకపోతే ఆ భావాలు ఒక పట్టాన అర్థం కావు. ఉద్యోగాలు తీసేయకుండా కార్యకలాపాలను ప్రారంభించమన్నారు. ఉద్యోగులను తొలగించినా ప్రభుత్వం చట్టపరంగా ఏమీ అడిగే అవకాశం లేదు. కానీ, బ్రిటన్ ప్రభుత్వం ఉద్యోగాల రక్షణకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసేయవద్ధు సంస్థలకు 80శాతం జీతం ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. ఇలాంటి ఆలోచనేదీ మన కేంద్రం చేయలేదు.