తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Population: జనాభా నియంత్రణ బిల్లుతో మరింత ముప్పు! - జనాభా నియంత్రణ బిల్లు ఉత్తర్​ప్రదేశ్

జనాభా స్థిరీకరణ కోసం అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌లు.. జనాభా నియంత్రణ బిల్లును (Population control bill) ప్రతిపాదించాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి జరగడం లేదని బిల్లును ప్రతిపాదించిన ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే దేశంలో ఈ బిల్లుపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

population
జనాభా నియంత్రణ

By

Published : Aug 23, 2021, 6:32 AM IST

జనాభా నియంత్రణ బిల్లుపై (Population control bill) ఇటీవల దేశంలో తీవ్రస్థాయి చర్చలు జరుగుతున్నాయి. జనాభా స్థిరీకరణ కోసం అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌లు బిల్లులను ప్రతిపాదించాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, ఒడిశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల విధానం(Two child policy) అమలులో ఉంది. జనాభా విస్ఫోటం గురించి 2019 పంద్రాగస్టు ప్రసంగంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. జనాభా పెరుగుదలతో (Population control bill) ఎన్నో సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. చిన్న కుటుంబాలు దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాయని ప్రశంసించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి జరగడం లేదని బిల్లును ప్రతిపాదించిన ప్రభుత్వాలు చెబుతున్నాయి. జనాభా నియంత్రణ పరంగా ప్రజలను బలవంతపెడితే ప్రయోజనం ఉండదన్న ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ వ్యాఖ్యలను విస్మరిస్తున్నాయి.

తగ్గిన వృద్ధిరేటు

జనాభా నియంత్రణ బిల్లులో (Population control bill) ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. ఒకరు లేదా ఇద్దరు సంతానంతో సరిపెట్టుకొనే దంపతులకు ఉద్యోగంలో పదోన్నతి, ఆర్థిక సాయం, ఆరోగ్య బీమా వంటి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇద్దరుకన్నా ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రుల విషయంలో కఠినంగానే వ్యవహరించాలని యోచిస్తోంది. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పించాలని, రేషన్‌ కార్డులో లబ్ధిదారుల సంఖ్యను నాలుగుకు పరిమితం చేయాలని నిబంధనల్లో సూచించింది. అలాంటి వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అవకాశం సైతం ఉంది. ఈ చర్యలతో రాష్ట్రంలో జనాభా స్థిరీకరణ జరుగుతుందని, ఫలితంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాకారమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు తీసుకురావడం అత్యావశ్యకమని పేర్కొంటోంది.

దేశ జనాభా 1930-1980 మధ్య కాలంలో భారీస్థాయిలో పెరిగింది. 1931 జనగణనలో దశాబ్దకాల జనాభావృద్ధి రేటు 11శాతం ఉండగా, 1981 నాటికి అది 25శాతానికి పెరిగింది. 1981 తరవాత జనాభా వృద్ధిలో తగ్గుదల కనిపించింది. 2011 జనగణనలో దశాబ్దకాల జనాభా వృద్ధి 17.1శాతంగా నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో గడచిన దశాబ్దంలోనే జనాభావృద్ధిలో క్షీణత కనిపించింది. జనాభా స్థిరీకరణకు ఇది సానుకూల పరిణామం. 2048నాటికి భారత్‌ జనాభా అత్యధికంగా 160కోట్లకు చేరుకొని, 2100నాటికి 109కోట్లకు దిగొస్తుందని లాన్సెట్‌ అధ్యయనం అంచనా వేసింది. 2001 జనగణనలో ఇండియా జనాభా వృద్ధిరేటు 21.54శాతం ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో అది 25.80శాతం.

2011 నాటికి భారత జనాభా వృద్ధిరేటు 17.64శాతానికి తగ్గగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో 20.23శాతానికి పడిపోయింది. నాలుగో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 2015-16) గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్‌) ప్రతి మహిళకు 2.2గా నమోదైంది. 2022 నాటికి అది 1.24కు తగ్గుతుందని అంచనా. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టీఎఫ్‌ఆర్‌ జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. తొలి విడత (1992-93) ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ లెక్కల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో టీఎఫ్‌ఆర్‌ 4.82 ఉండగా, నాలుగో విడత గణాంకాల నాటికి అది 2.7కు పడిపోయింది. అదే సమయంలో 2000లో 83గా ఉన్న శిశు మరణాల రేటు 2016కు 43కు దిగొచ్చింది.

పెరగనున్న భ్రూణ హత్యలు!

దేశంలో గర్భనిరోధక సాధనాల వినియోగం ప్రస్తుతం 53.5శాతంగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో వీటి వినియోగం జాతీయ సగటుకన్నా తక్కువగా ఉండటం గమనార్హం. విద్యాభ్యాసం పెరుగుతున్నకొద్దీ జాతీయ స్థాయిలో, యూపీలో టీఎఫ్‌ఆర్‌లో తగ్గుదల కనిపిస్తోంది. అసలు బడికిపోని మహిళల్లో టీఆర్‌ఎఫ్‌ దేశంలో 3.07, యూపీలో 3.5గా ఉంది. అయిదేళ్లు బడికి వెళ్ళి చదువుకున్న మహిళల్లో ఇది దేశంలో 2.43గా, యూపీలో 3.2గా కనిపిస్తోంది. పన్నెండేళ్ల పాటు చదువుకున్న మహిళల్లో ఇది దేశంలో 1.71శాతం, యూపీలో 1.9శాతంగా నమోదైంది. మహిళల విద్యాభ్యాసం తక్కువగా ఉన్న ఉత్తర-మధ్య యూపీ జిల్లాల్లోనే టీఎఫ్‌ఆర్‌ అధికంగా కనిపిస్తోంది.

మరోవైపు కడుపులోనే ఆడశిశువులను చిదిమేస్తున్న ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనాభా నియంత్రణ బిల్లుతో (Population control bill) పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతానికి దేశంలో లింగ నిష్పత్తిలో మెరుగుదల కనిపిస్తుంది. 2001లో ప్రతి 1000మంది పురుషులకు 898మంది మహిళలుండగా, 2011 నాటికి అది 912కు పెరిగింది. మరోవైపు అదే కాలానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో 0-6ఏళ్ల మధ్య చిన్నారుల లింగ నిష్పత్తి 916 నుంచి 902కు పడిపోయింది. జనాభా నియంత్రణ కోసం తీసుకొనే చర్యలతో ఇది మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కారు వివిధ సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. విద్యావిధానంలో సంస్కరణలు తేవడం, కుటుంబ నియంత్రణ సాధనాలు అందుబాటులో ఉంచడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

-సందీప్ పాండే, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత.

ఇదీ చదవండి:సమాఖ్య స్ఫూర్తికి ఆలంబన.. అధికార వికేంద్రీకరణ

ABOUT THE AUTHOR

...view details