డియర్ జిందగీ,
పూర్వం కవులు మేఘసందేశం పంపేవారట. అంత స్థోమత లేని వాళ్లు కాకితో కబురంపేవారట. మరికొందరు ఎంచక్కా కపోత సందేశాలు నడిపారేమో. ఇవన్నీ సాదాసీదా వ్యవహారాలు. రాచరిక ప్రాభవం వేరు. రాజు తలచుకుంటే రాయబారులకు కొదవా? పాండవులైతే ఏకంగా శ్రీకృష్ణుడినే దూతగా పంపించారు. ఆపై కలం, కాగితం రాకతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఇప్పుడంతా డిజిటల్ పలకరింపుల శకం. ఇలా లేఖో భిన్న కాలమానస్థితిః!
చరిత్రలో లింకన్ లేఖ ప్రశస్తమైంది. అది బోధనకు దిశానిర్దేశం చేసింది. అంతెందుకు- ఇందిరకు నెహ్రూ రాసిన లేఖలు సైతం పేరెన్నికగన్నవే. అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి సోపానాలు వేశాయి. ప్రపంచయుద్ధ నియంత్రణకై గాంధీజీ, హిట్లరుకు రాసిన ఉత్తరం; అణ్వాయుధాల విషయమై ఐన్‌స్టీన్, రూజ్‌వెల్ట్‌కి రాసిన ఉత్తరం; శాస్త్ర తాత్విక రంగాలను లోతుగా చర్చిస్తూ మార్క్సుకి ఏంగెల్స్ రాసిన లేఖలు... ఇవన్నీ కూడా విశ్వవిఖ్యాతమైనవే. అంతెందుకు, మన విశ్వకవి రవీంద్రుడు సైతం ఆ సర్వేశ్వరుడికి అర్జీ పెట్టుకున్న లేఖలే కదా... గీతాంజలి! ఇలా లేఖల తీరుతెన్నులు ఎన్నెన్నో. లేఖలు కేవలం బంధుమిత్రులు, సన్నిహితులు, అధికారులకేనా? చంద్రుడికో నూలుపోగులా, జీవితానికో లేఖ రాయకూడదా? ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం.
కాలం గమ్మత్తయింది... చిత్రమైంది కూడా. ఎన్నో జ్ఞాపకాల్ని మోసుకొస్తుంది. ఇంకెన్నో స్మృతుల్ని చెరిపేస్తుంది. అది సంజీవనిలా అద్భుతాలు చేయగలదు. వామనపాదమై అధఃపాతాళానికి తొక్కేయనూగలదు. పరుసవేదిలా పసిడిరెక్కల్ని విప్పార్చగలదు. కాలకూట విషమై యమపాశాన్ని విసరనూగలదు. కురుక్షేత్రమై వినాశనం సృష్టించగలదు. గీతాసారమై విశ్వరూప సందర్శనం చేయించనూ గలదు. అంతేనా? ఎంత సారూప్యం. ఇంకెంత వైవిధ్యం. ఎన్ని ఆవిష్కరణలు. ఇంకెన్ని అంతర్ధానాలు. ఎంతటి పురోగతి. ఇంకెంతటి తిరోగమనం. ఇవన్నీ కాలం తాలూకు ఇంద్రజాల మహేంద్రజాలాలే. కరవులు, వరదలు, భూకంపాలు, సునామీలు, మహమ్మారులు, యుద్ధాలు, మారణహోమాలు... ఎన్నెన్నో! ఈ అనంత పరిణామక్రమానికి తిరుగులేని సాక్షీభూతం... కాలచక్రమే.
ఈ కాలగమనంలోనే కరోనా పుట్టుకొచ్చింది. చూస్తుండగానే అప్రతిహతంగా పెరిగిపోయింది. దావానలమై ఖండాల్ని చుట్టబెట్టింది. భూగోళాన్ని లాక్‌డౌన్ చేసింది. ప్రపంచాన్ని క్వారంటైన్ చేసింది. మానవాళిని చిగురుటాకులా వణికిస్తోంది. భౌతికదూరం, సహజీవనం అనే రెండు కొత్త తారకమంత్రాలకు పురుడుపోసింది. మహా మహిమాన్విత కాలగ్రంథంలో కరోనా తనకంటూ ఓ పేజీని కేటాయించుకుంది.