అత్యంత పురాతనమైనవిగా వాసికెక్కిన ఫంగస్‌లు.. నేడు ఆధునిక మానవుడిపై పంజా విసురుతున్నాయి. వేలాది సంవత్సరాలుగా మానవ శరీరంలో చర్మం, గోళ్లు వంటి భాగాల్లో తేలికపాటి రుగ్మతలను కలిగిస్తున్న ఫంగస్ వ్యాధులు- ఇటీవలి కాలంలో తీవ్రంగా విరుచుకుపడుతూ ప్రాణాంతకంగానూ పరిణమించాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల ఫంగస్ జాతులు ఉన్నాయి. అందులో కేవలం మూడు వందల రకాలు మాత్రమే మానవాళికి హాని కలిగించేవి. ఫంగస్‌లపై 1960 వరకు జరిగిన అధ్యయనాలు, పరిశోధనలు వృక్షశాస్త్ర పరిధిలోనే ఉండటంతో వైద్యశాస్త్రంలో ఈ వ్యాధులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిగూఢంగా ఉన్న ఫంగస్ వ్యాధులు అదుపు తప్పి పెచ్చరిల్లడానికి ఎయిడ్స్ వ్యాధి ప్రధాన ప్రేరకంగా పని చేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 1980వ దశకంలో వెలుగు చూసిన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో రోగ నిరోధక శక్తి సన్నగిల్లి కాండిడా, క్రిప్టోకాకస్, న్యూమోసిస్టిస్ వంటి ఫంగస్‌లు విజృంభించాయి. ఆ తరవాత అన్ని ప్రపంచ దేశాల్లోనూ ఫంగస్ వ్యాధుల స్వైరవిహారం అధికమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. క్షయ, ప్లేగు, మలేరియా, పోలియో, డెంగీ వంటి వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఫంగస్ రుగ్మతలను విస్మరించడంతో- ఇవి ప్రజారోగ్య వ్యవస్థలో సుదీర్ఘకాలం పాటు తిష్ఠ వేయగలిగాయని వారు అంటున్నారు.
జీవనశైలి మార్పుతో..
అమెరికాలో ఏటా దాదాపు తొంభై లక్షల మంది ఫంగస్ వ్యాధుల బారిన పడుతున్నారు. సుమారు డెభ్భై వేల మంది ఆస్పత్రుల పాలవుతున్నట్లు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) పేర్కొంటోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రతి లక్ష మంది రోగుల్లో తొమ్మిది మంది రక్తంలో ఫంగస్ (క్యాండిడీమియా), సెప్సిస్(తీవ్ర ఇన్‌ఫెక్షన్)వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు విశ్లేషిస్తోంది. రోగ నిరోధక శక్తి క్షీణించినవారికి ఇది ప్రాణాంతకంగా మారుతున్నట్లు వెల్లడించింది. ఆధునిక మానవుడి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారాయి. మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులు పెచ్చరిల్లుతున్నాయి. ఆసుపత్రుల్లో అధునాతన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో ఆక్సిజన్ గొట్టాలు, వెంటిలేటర్లు తదితర వైద్య పరికరాల ద్వారా హానికర ఫంగస్‌లు మానవుడి శరీరంలోనికి ప్రవేశించి- ప్రమాదకరమైన వ్యాధులకు తలుపు తెరుస్తున్నాయి. ప్రత్యేక రోగ లక్షణాలు లేనందువల్ల వీటి నిర్ధారణలో కాలయాపన జరిగి సమస్య మరింత జటిలమవుతోంది. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికీ ఈ వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. స్టెరాయిడ్లు, యాంటీ మెటబొలైట్ మందులు, ఎక్కువ డోసులో యాంటీ బయాటిక్స్ దీర్ఘకాలం పాటు వాడే రోగుల్లో ఫంగస్‌లు విజృంభిస్తున్నాయి.
కొవిడ్ వ్యాధి సోకి ఆసుపత్రుల పాలైన వారిలో మ్యూకార్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి అనేక దేశాల్లో కోర సాచింది. రోగ నిరోధక శక్తిని నియంత్రించే స్టెరాయిడ్‌లు, టోసిలీజుమాబ్, యాంటీబయాటిక్స్ వంటి మందుల వాడకమూ బ్లాక్‌ఫంగస్ విజృంభణకు కారణమైనట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. పలు దేశాలతో పోలిస్తే మన దేశంలో బ్లాక్ ఫంగస్ 70 రెట్లు అధికంగా వ్యాప్తి చెందినట్లు సీడీసీ విశ్లేషించింది. కరోనా రాకకు ముందు ఇండియాలో వందల సంఖ్యలో మాత్రమే ఉన్న ఫంగస్ కేసులు- కరోనా రెండోదశలో వేలాదిగా పెరిగాయి. ప్రాణంతకంగా పరిణమించిన బ్లాక్‌ఫంగస్ భారత్‌లో భారీయెత్తున పేట్రేగిపోవడానికి డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ప్రధాన కారణం. దాదాపు పది శాతం జనాభా మధుమేహ వ్యాధిగ్రస్తులై ఉండటం మరో ముఖ్య కారణం. ఆక్సిజన్‌ను నిల్వ ఉంచే ట్యాంకుల్లోని మలినాలు, రోగికి ఆక్సిజన్ అందించే గొట్టాల అపరిశుభ్రత వీటికి తోడైంది. భారత్‌లో వైద్యుల సూచనలతో నిమిత్తం లేకుండా ప్రజలు విచ్చలవిడిగా హెచ్చు మోతాదులో స్టెరాయిడ్‌లు, ఇతర మందులను వాడుతున్నట్లు ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది.