'ప్రజాస్వామ్యమంటే ఏకవ్యక్తి పాలన కాదు' అని కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్ గాంధీ గతంలో ఘనంగా ప్రవచించారు. అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరేసి, అధిష్ఠానం అడుగులకు అందరూ మడుగులొత్తాల్సిన పరిస్థితిని స్థిరపరచిన సొంత పార్టీకీ ఆ ప్రమాణం వర్తిస్తుందనే విషయాన్ని ఆయన విస్మరించారు. అవమానాలను తట్టుకోలేకపోతున్నానంటూ తాజాగా రాజీనామా చేసిన పంజాబ్ 'కెప్టెన్' అమరీందర్ సింగ్- అధిష్ఠానం ఒంటెత్తు పోకడలనే వేలెత్తి చూపించారు. వాచాలత్వంలో వాసికెక్కిన సిద్ధును ముద్దు చేస్తున్న పార్టీపెద్దల వైఖరి యావద్దేశానికే ముప్పుగా ఆయన అభివర్ణించారు. అస్మదీయులకూ అందుబాటులో ఉండరనే అపప్రథకు తోడు అధిష్ఠానంతో బెడిసికొట్టిన సంబంధాలు- అమరీందర్ పదవికి పొగపెట్టాయి. పేరుకు పార్టీ పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరిపినా- కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎంపికకు దిల్లీలోని రాహుల్ నివాసమే వేదికైంది.
సీల్డుకవర్ సీఎం..
శాసనసభ్యుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా 'సీల్డుకవర్ సీఎం'లను కొలువు తీర్చే పెడపోకడలకు ఇందిర జమానా పెట్టింది పేరు! ఉత్తర్‌ప్రదేశ్, ఏపీలతో సహా అప్పట్లో ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అలాగే నామినేషన్లపై నడచి వచ్చేవారు. దశాబ్దాలు గడచినా ఆ దుష్ట సంప్రదాయం గతించలేదు సరికదా.. తరతమ భేదాలతో అన్ని పార్టీలూ అదే పద్ధతిని ఆబగా అందిపుచ్చుకొన్నాయి. మితిమీరిన వ్యక్తిపూజ, ఎల్లలు దాటిన ఆశ్రిత పక్షపాతం, అడ్డూఅదుపు లేని అవినీతితో దేశీయంగా దుర్రాజకీయాలకు తల్లివేరైనా కాంగ్రెస్‌లోనైతే ఈ మకిలి సంస్కృతి మరీ అధికం! 'ఇండియా ఒక కంప్యూటర్ అయితే- దానికి డీఫాల్ట్ ప్రోగ్రామ్ కాంగ్రెస్' అని రాహుల్ ఆమధ్య మహాగొప్పగా సెలవిచ్చారు. ఏక కుటుంబాధిపత్యంలో మేటవేసిన అవలక్షణాలతో అదెప్పుడో వైరస్‌గా రూపాంతరం చెందిందన్నది ప్రత్యర్థుల విమర్శే కాదు- జనావళిలో అత్యధికుల అభిప్రాయం! పునాది నుంచి అధినాయకత్వం వరకు అంతర్గత సంస్కరణలతో పార్టీకి కొత్త రక్తం ఎక్కించకపోతే- గత వైభవాల శిథిల చిత్రంగా అది మిగిలిపోవడం తథ్యం!
చర్చలకు ఆస్కారమే లేదు..