యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల పరీక్షలన్నీ దాదాపుగా హిందీ, ఆంగ్ల భాషల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోని వారు, హిందీయేతర ప్రాంతాల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ జాతీయ స్థాయి ఉద్యోగ పరీక్షలను స్థానిక భాషల్లో నిర్వహించాలంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన, న్యాయమైన అవకాశాలు దక్కాలంటే ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. అంతకు మునుపు ఇదే అంశంపై ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం లేఖ రాశారు.
కొందరికే ప్రయోజనం
కేంద్ర ప్రభుత్వ పరిధిలో 20కు పైగా ఉద్యోగ నియామక సంస్థలున్నాయి. వాటిలో యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్) పరీక్షలకు ఏటా లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అఖిల భారత స్థాయి ఉద్యోగాలకు యూపీఎస్సీ 16 దాకా పరీక్షలు నిర్వహిస్తుంటుంది. సివిల్స్ ప్రాథమిక (ప్రిలిమ్స్) పరీక్షల ప్రశ్నపత్రాలన్నీ ఆంగ్లం, హిందీలోనే ముద్రితమవుతాయి. 2011లో వీటిలో రెండో పేపరుగా సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూట్ టెస్ట్‌ను ప్రవేశపెట్టారు. ఆంగ్ల మాధ్యమం, లెక్కలు, విజ్ఞానశాస్త్ర నేపథ్యం కలిగిన విద్యార్థులకే ఇది ప్రయోజనకరంగా ఉందని తొలినుంచీ నిరసన వ్యక్తమవుతోంది. మెయిన్స్, ముఖాముఖులకు ప్రాంతీయ భాషలకూ అవకాశం కల్పించారు. కానీ, ముఖాముఖిలో మాతృభాషల అభ్యర్థుల కోసం అనువాదకులతో పనిలేకుండా- ఆయా భాషలు తెలిసిన అధికారులతోనే బోర్డులు ఏర్పాటు చేస్తే గరిష్ఠంగా మేలు జరుగుతుందని అభ్యర్థులు కోరుతున్నారు.
యూపీఎస్సీ నిర్వహించే ఫారెస్ట్, ఇంజినీరింగ్, ఎకనామిక్ సర్వీసుల వంటి పరీక్షలన్నీ ఆంగ్లంలోనే ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు, గ్రామీణులతో మమేకమై విధులు నిర్వర్తించే ఫారెస్ట్ సర్వీస్ అధికారుల ఎంపికలో ఆంగ్లానికి మాత్రమే పెద్దపీట వేయడమేమిటనే అభ్యంతరం ఎప్పటి నుంచో ఉంది. అఖిల భారత సర్వీసులంటూ అధికశాతం పరీక్షలను ఆంగ్లం, హిందీల్లోనే నిర్వహించడం వల్ల మాతృభాషల్లో చదువుకుని ఆయా అంశాల మీద మంచి పట్టున్న అభ్యర్థులు నష్టపోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. బ్రిటిష్ కాలం నాటి వలసవాద ఛాయలు వదిలిపోనందువల్లే సివిల్స్ పరీక్షల్లో గ్రామీణ అభ్యర్థులకు సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదన్నది మరో వాదన! ఆయా మంత్రిత్వ శాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో గ్రూప్-బి, (గెజిటెడ్, నాన్ గెజిటెడ్), గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఏటా ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తుంది.
మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) పేపర్-2 మినహా మిగిలిన అన్ని పరీక్షలు హిందీ, ఆంగ్లాలలోనే ఉంటాయి. 2017-2020 మధ్య యూపీఎస్సీ పరీక్షలకు దాదాపు 90 లక్షల మంది, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు కోటీ ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు నిర్వహిస్తే మరింత ఎక్కువ మంది వీటిలో పోటీపడగలుగుతారు. తపాలా శాఖలో మల్టీటాస్కింగ్ సిబ్బంది, పోస్ట్‌మన్, మెయిల్ గార్డు ఉద్యోగాలకు స్థానిక భాషపై అవగాహన తప్పనిసరి. అప్పటి వరకూ 15 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్న పోస్టల్ పరీక్షలను 2019లో కేంద్రం హిందీ, ఆంగ్లాలకు పరిమితం చేయడంతో తమిళనాడులో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దాంతో ఆ ఉద్యోగ ప్రకటనను రద్దు చేశారు.