'స్వయం సమృద్ధ భారత్‌కు- మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, ప్రజలు, గిరాకీ... మూలస్తంభాలు. ఈ అయిదింటిపై దృష్టిపెట్టి కరోనా విలయంతో కుంటువడిన దేశాభివృద్ధిని మళ్లీ గాడిన పడేలా చేస్తాం'
'ఆత్మ నిర్భర్' ప్యాకేజీ ప్రకటించడానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. అందులో గిరాకీ (డిమాండ్) అతి ముఖ్యమైంది. వరుస నష్టాలతో కుదేలైన వాహనరంగం కోలుకోవడానికి తక్షణం కావాల్సింది గిరాకీయే. దేశంలో ఇప్పటికీ ప్రతి వెయ్యిమందిలో 28 మందికి మాత్రమే సొంత కారు ఉంది. చైనాలో వెయ్యికి 180 మంది, అమెరికాలో 880 మంది కారు ఉపయోగిస్తున్నారు. ఈ గణాంకాలు భారత్‌లో వాహనరంగ విస్తృతికి ఉన్న అపారమైన అవకాశాలేమిటో చెప్పకనే చెబుతున్నాయి. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి మూడున్నర కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. స్థూలదేశీయోత్పత్తికి ఏడున్నర శాతం వాటా సమకూరుస్తోంది. పరిశ్రమ మరింతగా విస్తరిస్తే లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. దేశం ఆర్థికంగా మరింతగా పురోగమిస్తుంది. దురదృష్టవశాత్తు, కీలకమైన ఆటోమొబైల్ రంగంపై పాలకులది మొదటినుంచీ చిన్నచూపే.
దక్కింది గోరంతే!
కరోనా కాటుతో తిరోగమన బాట పట్టిన దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టడానికి కేంద్రం రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఇది జీడీపీలో 10శాతానికి సమానమని ఘనంగా చాటుకుంది. వాహనరంగం ఈ ప్యాకేజీపై గంపెడు ఆశలు పెట్టుకుంది. చివరికి కొండంత ఆశిస్తే గోరంతే దక్కిందంటూ పరిశ్రమ ప్రతినిధులు పెదవి విరిచారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం, పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించడం గుడ్డిలో మెల్ల. ఏదేమైనా ప్రభుత్వం ప్రకటించే ఆర్థిక ప్యాకేజీలు తక్షణ ఉపశమన చర్యలేగానీ ఆటొమొబైల్ రంగాన్ని అమాంతం గట్టెక్కించే పరిస్థితి లేదని అత్యధికుల అభిప్రాయం. వాహన తయారీకి మనదేశం ప్రపంచకేంద్రంగా మారుతున్నా- ఆటొమొబైల్ విడిభాగాలు, వస్తువులపై ఇప్పటికీ చైనా లాంటి విదేశాలపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులను ప్రారంభించాలి. వీటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇది జరిగితే వాహన రంగంలో భారత్ స్వయంసమృద్ధ, బలీయమైన శక్తిగా ఎదుగుతుందని, విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అశోక్ లేలాండ్ ఎండీ, సీఈఓ విపిన్ సోంధీ అభిప్రాయం. ఇక ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన మరో కార్యక్రమం- జాతీయ రహదారుల విస్తరణ. దేశంలో 60 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఉన్నా అందులో జాతీయ రహదారుల శాతం స్వల్పం. భారత్ తన ఆర్థిక అవసరాలు నెరవేర్చుకోవాలంటే 2020 నాటికి ఏడాదికి పది లక్షల కోట్ల రూపాయల చొప్పున జాతీయ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలపై వెచ్చించాలని గోల్డ్‌మన్ శాక్స్ 2009లోనే అంచనా వేసింది. కానీ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అందులో పదిశాతమే. జాతీయ రహదారుల విస్తరణ కోసం కేంద్రం ఈ మధ్యే రూ.15 లక్షల కోట్లు వెచ్చించబోతున్నామని ప్రకటించడం ఊరట కలిగించే విషయం. ఈ నిధులతో జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున రాబోయే రెండేళ్లలో జాతీయ రహదార్లు నిర్మించబోతోంది. వీటన్నింటికన్నా ముఖ్యంగా, వాహనరంగం ప్రభుత్వం నుంచి ఆశిస్తోంది- వాహనాలపై పన్ను తగ్గింపు. పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని కలిసిన ప్రతిసారీ చర్చకొచ్చే అంశం ఇదే.