తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వృద్ధి బాటలో ఉపాధికి బాసట! - కొవిడ్ నిరుద్యోగం

దేశంలో నిరుద్యోగితే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. కరోనాకు ముందే కుంగిపోయిన వ్యవస్థను మహమ్మారి మరింత దిగజార్చింది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినందున ఇప్పుడిప్పుడే సంప్రదాయ రంగాలు గాడినపడుతున్నాయి. కానీ.. కోల్పోయిన ఉద్యోగాలను పునరుద్ధరించగల విధంగా ఆ రంగాలు మెరుగుపడ్డాయా అన్నదే ప్రశ్న!

recovering lost jobs due to covid
వృద్ధి బాటలో ఉపాధికి బాసట!

By

Published : Jan 21, 2021, 7:08 AM IST

సుమారు పది నెలలపాటు కరోనా వల్ల యావద్దేశం స్తంభించిపోయింది. వైరస్‌ రూపంలో విరుచుకుపడిన పెనుముప్పు అనేక రంగాలను కుంగదీసింది. సంక్షోభ కాలంలో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి భారతీయ యువత తీవ్ర సమస్యల పాలైంది. నిరుద్యోగం ఇప్పుడు భారత్‌ను వెన్నాడుతున్న అతిపెద్ద సమస్య. కరోనాకు ముందునుంచే దేశ ఆర్థికం నేల చూపులు చూస్తోంది. అప్పటికే సగం కుంగిపోయిన వ్యవస్థలు వైరస్‌ మహమ్మారి దెబ్బకు మరింత దిగజారాయి. ప్రభుత్వం అసాధారణ చర్యలతో ముందుకొస్తే తప్ప కొవిడ్‌ కారణంగా లక్షల సంఖ్యలో మలిగిపోయిన చిన్నాచితకా ఉద్యోగాలను పునరుద్ధరించడం సాధ్యమయ్యే పనికాదు.

దేశ సామాజిక, ఆర్థిక రంగాల్లో గడచిన ఇరవయ్యేళ్లుగా స్థిరపడిన కొన్ని ధోరణులు కొవిడ్‌ కారణంగా కిందుమీదులయ్యాయి. బతుకుదెరువుకోసం గ్రామాలనుంచి పట్టణాలకు పెద్దయెత్తున వలసవెళ్ళడం గడచిన రెండు దశాబ్దాల్లో ప్రముఖంగా కనిపించిన ధోరణి. కొవిడ్‌ దెబ్బకు వలసలు ఆగిపోయాయి. పట్టణాలనుంచే బతుకును వెదుక్కుంటూ పల్లెలకు వలస వెళ్ళే కొత్త పరిణామం కనిపించింది. నిర్మాణ, సేవా రంగాల వికాసం దేశంలో ఉద్యోగాల వెల్లువకు కారణమైంది. పల్లెలనుంచి చోటుచేసుకునే వలసల ద్వారానే ఈ రంగాలకు అవసరమయ్యే శ్రామిక శక్తి సమకూరేది. నిర్మాణ, సేవా రంగాలు నడవాలంటే తక్కువ వేతనాలతో పనిచేసే శ్రామికశక్తి అవసరం. అత్యధిక జీతాలిచ్చే ఉద్యోగాలు ఈ రంగాల్లో తక్కువే. వైరస్‌ విస్తరణ, ‘లాక్‌డౌన్‌’ల వల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొవిడ్‌ కేసులు తగ్గడంతో ఇప్పుడిప్పుడే సంప్రదాయ రంగాలు గాడినపడుతున్నాయి. కానీ, కోల్పోయిన ఉద్యోగాలను పునరుద్ధరించ గల విధంగా ఆ రంగాలు మెరుగుపడ్డాయా అన్నదే ప్రశ్న!

ప్రాథమ్యాలు మారాలి

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన స్థూల విలువ జోడింపు అంచనాలు-2020-’21 (జీవీఏ) ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో కుదేలైందో వెల్లడిస్తున్నాయి. కొవిడ్‌ తాకిడికి తట్టుకుని నిలబడిన ఒకే ఒక రంగం వ్యవసాయం. సేద్యం, మత్స్య, అటవీ రంగాల్లో 7.3శాతం గణనీయ వృద్ధి నమోదైన కారణంగానే దేశ జీవీఏ 2018-’19తో పోల్చినా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక మిగిలిన రంగాలన్నింటిలోనూ 2018-’19తో పోలిస్తే వృద్ధి అత్యంత దిగనాసిగా ఉంది. గడచిన కొన్నేళ్లుగా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కల్పించిన వాణిజ్య, సేవలు, సమాచార సాంకేతిక, హోటళ్లు, నిర్మాణ, స్థిరాస్తి రంగాలు ఈసారి నిట్టనిలువునా కూలిపోయాయి. నిర్మాణ రంగం నిరుటితో పోలిస్తే 12.6శాతం క్షీణించింది. వాణిజ్యం, హోటళ్లు, విద్య, రవాణా రంగాల్లో 2019-’20తో పోలిస్తే ఈ దఫా 21.4శాతం క్షీణత నమోదైంది. నగరాలు, పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి వ్యవస్థలు నేలకరవడంతో- అందరికీ వ్యవసాయమే ఏకైక దిక్కుగా మారింది. మిగిలిన చోట్ల అవకాశాలు మందగించడంతో సేద్య రంగం మీద ఒత్తిడి పెరుగుతోంది. విద్యారంగంలో 2016నాడున్న ఉద్యోగాలు సైతం ఇప్పుడు లేవని 'సీఎంఐఈ' వెల్లడించింది. దేశ విద్యావ్యవస్థలో 2016లో 1.3 కోట్లుగా ఉన్న ఉద్యోగాలు 2020 డిసెంబరు నాటికి 91 లక్షలకు కొడిగట్టాయి.

ఉద్యోగాలు టపటపా ఊడిపోతుండటం, ఆర్థికం మందగించడం దీర్ఘ, మధ్య కాలావధుల్లో దేశానికి మేలు చేసే పరిణామం కాదు. దేశంలో సేవల రంగంలోనే అత్యధిక ఉద్యోగాలున్నాయి. కొద్దిపాటి నైపుణ్యాలున్నవారూ చిన్నా చితకా ఉద్యోగాల్లో కుదురుకోవడానికి అవకాశమిచ్చిన రంగమిది. అందుకే దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యధికులు తక్కువ వేతనాలతోనైనా ఇందులో నిలదొక్కుకోగలిగారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విజ్ఞాన రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నప్పుడు, అంతర్జాతీయంగా ఆర్థిక ప్రాథమ్యాలు గుణాత్మకంగా మారినప్పుడు తక్కువ నైపుణ్యాలతో నెట్టుకొస్తున్నవారి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ఇప్పుడు భారత్‌లో జరుగుతోందదే! ఐటీ రంగంలో వ్యక్తుల నైపుణ్యాలు సగటున ఏడేళ్లకు మించి మనలేవని పాశ్చత్య దేశాల్లో నిర్వహించిన వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్త మార్పులకు అనుగుణంగా సామర్థ్యాలకు పదును పెట్టుకోకపోతే కొన్నేళ్లకు యువత నైపుణ్యాలు కొరగానివిగా మిగులుతాయి. పనిచేయగలవారి సంఖ్య భారత్‌లో భారీగా ఉంది. ఏటా రెండుకోట్లమంది ఉద్యోగ మార్కెట్లో ప్రవేశిస్తున్నారు. ఇదే ధోరణి 2036 వరకూ కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. భారతీయుల జీవన కాలపరిమితి సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చదువు ముగించుకొని మార్కెట్లోకి కొత్తగా అడుగుపెడుతున్న యువతకు ఉద్యోగాలు కల్పించలేని పక్షంలో- వయసు మళ్ళిన తరవాత వీరి జీవిక తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది.

గ్రామీణ యువతపై ప్రత్యేక శ్రద్ధ

ఉపాధి కరిగి ఆర్థిక మాంద్యం ఉరుముతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవగా ముందుకు రావాలి. ఉద్యోగ కల్పన బాధ్యతను పూర్తిగా ప్రైవేటు రంగానికి వదిలేసి, సేవల రంగం పునరుజ్జీవిస్తే అన్నీ సర్దుకుంటాయని చేతులు ముడుచుకు కూర్చుంటే సమస్య సంక్షోభంగా మారుతుంది. వ్యవసాయ, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెంచి వాటి విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలి. ఈ రంగాల్లో వీలైనంత మేర ప్రైవేటు పెట్టుబడులను ఇనుమడింపజేయడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయాలి. కొవిడ్‌ కారణంగా నగరాలకు, పట్టణాలకు తిరిగివెళ్ళకుండా యువత ఇంకా గ్రామాల్లోనే ఉంది. ఉన్నచోటే ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వ్యవసాయం, తదనుబంధ రంగాల్లో యువతకు శిక్షణ నైపుణ్యాలు అందించి వారిని పల్లెల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దాలి. అందుకోసం వీలైన మేర పెట్టుబడులను వెచ్చించేందుకూ వెనకాడరాదు. యువకులతోనే స్వయం సహాయక బృందాల వంటి వాటిని ఏర్పాటు చేసి, సేద్య అవసరాలకు అక్కరకొచ్చే యంత్రాలను ఆయా సంఘాలకు అందజేసి, వాటిని సమర్థంగా ఉపయోగించే నైపుణ్యాలు వారికి అలవర్చాలి. పట్టణాలు, నగరాలనుంచి సొంత ఊళ్లకు వలసవెళ్ళి ఉపాధిలేక అలమటిస్తున్న యువతను రైతాంగానికి దన్నుగా తీర్చిదిద్దాలి. ఎక్కడికక్కడ స్వయం సహాయ బృందాలకు వ్యవసాయ యంత్రాలు అందజేయడంవల్ల వారికి ఉపాధి లభించడంతోపాటు- యంత్రాల తయారీ రూపంలో పారిశ్రామిక రంగమూ కాస్తో కూస్తో చురుకందుకుంటుంది. వ్యవసాయ ఖర్చులు తడిసిమోపెడై ఇబ్బందిపడుతున్న రైతన్నకూ దీనివల్ల మేలు జరుగుతుంది. దేశంలో రవాణా రంగమూ కొవిడ్‌వల్ల కుదేలైంది. కనిష్ఠస్థాయి నైపుణ్యాలున్నవారికి సైతం భారీగా ఉపాధి కల్పించిన రంగమిది. కాబట్టి పన్నులు తగ్గించడమో లేదా నేషనల్‌ పర్మిట్‌ ఫీజులకు కోతపెట్టడం ద్వారానో రవాణా రంగానికి కొత్త ఊపిరి పోసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం చొరవగా ఆర్థిక సాయం అందించాలి. ఇలాంటి చర్యలవల్ల ఆర్థిక వ్యవస్థ తిరిగి మామూలు స్థితికి వచ్చేవరకూ దేశంలోని యువతకు ఏదోస్థాయిలో ఆదరవు దక్కుతుంది.

-డాక్టర్ ఎస్ అనంత్(రచయిత- ఆర్థిక సామాజిక రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details