తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రతిష్టంభన తొలగిస్తేనే ప్రతిష్ఠ - ప్రతిష్టంభన తొలగిస్తేనే ప్రతిష్ఠ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఓవైపు కొవిడ్​ ప్రమాదం, మరోవైపు ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా రెండు నెలలకు పైగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్రంతో రైతు సంఘాలు 11దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. నాడు.. ఆచార్య ఎన్​జీ రంగాలా రైతు ప్రయోజనాల్ని కాచుకొనే దృఢమైన రాజకీయ సంకల్పం గల నేతలు నేడు లేనందువల్లే.. కర్షకులు ఇలా చితికిపోతున్నారు. 'ఎద్దు ఎండకు- ఎనుబోతు నీడకు' చందంగా ఉన్న ఈ ప్రతిష్టంభనకు తెరపడేదెప్పుడు?

Farmer protests
ప్రతిష్టంభన తొలగిస్తేనే ప్రతిష్ఠ

By

Published : Feb 4, 2021, 7:22 AM IST

దేశ రాజధాని సరిహద్దుల్లో పది వారాలుగా కర్షకలోకం చేస్తున్నది అక్షరాలా అస్తిత్వ పోరాటం. ఆత్మనిర్భర్‌ భారత్‌ వ్యూహంలో భాగంగా అన్నదాత సముద్ధరణే ధ్యేయమంటూ కేంద్ర సర్కారు హడావుడిగా పట్టాలకెక్కించిన చట్టాలు- వాస్తవానికి బడుగు రైతుల పొట్ట కొట్టేవేనన్నది ఆందోళన పథంలో కదం తొక్కుతున్న కర్షకుల నిశ్చితాభిప్రాయం. ఎముకలు కొరికే చలిని, పొంచి ఉన్న కొవిడ్‌ ప్రమాదాన్ని ఖాతరు చేయకుండా- ఉగ్రవాదులు, ఖలిస్థాన్‌వాదులన్న ముద్రలకు బెదరకుండా... కేంద్రంతో రైతు సంఘాలు 11 విడతలు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. రైతు సంఘాలతో చర్చలకు ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నామని ప్రధానమంత్రే ప్రకటించినా- రాజును మించి రాజభక్తి ప్రదర్శనలో రాటుతేలిన సర్కారీ యంత్రాంగం రైతుల గణతంత్ర కవాతు దరిమిలా అమానుష వేధింపులకు నిష్ఠగా తెరతీసింది.

వికృత మనస్తత్వంతో..

టిక్రీ, ఘాజీపూర్‌, సింఘు సరిహద్దుల్లో ఆందోళనకారుల్ని అష్టదిగ్బంధనం చేసేలా బ్యారికేడ్లు కట్టి, గోతులు తవ్వి, గోడలు నిర్మించి, రహదార్లపై మేకులున్న పట్టీలు అమర్చి, ముళ్ల కంచెలు వేసి, అంతర్గత రోడ్లను మూసేసి వికృత మనస్తత్వాన్ని చాటుకొంది. అంతర్జాల సేవల నిలిపివేత, రైళ్ల దారి మళ్ళింపు, రైతు ఉద్యమంలో చీలికలు, ఆందోళనకారులపై దాడులు, కేసుల బనాయింపులకు జతపడి నీరు, పారిశుద్ధ్య సదుపాయాల్నీ అందుబాటులో లేకుండా చేయడం దమన నీతికి పరాకాష్ఠ! 'భారత ప్రజలమైన మేము' అని రాసుకొన్న రాజ్యాంగం ద్వారా శాంతియుత నిరసన ఓ హక్కుగా పౌరులందరికీ దఖలుపడిన సంగతి అధికార శ్రేణులకు తెలియదా? 'మా బాగుకోసమంటూ తెచ్చిన నడమంత్రపు చట్టాలు మాకొద్దు మహాప్రభో' అని అన్నదాతలు ఆక్రోశిస్తుంటే- ఏడాదిన్నర పాటు వాటిని అటకెక్కిస్తామని కేంద్రం చెబుతోంది. కనీస మద్దతుకు చట్టబద్ధత కావాలని కర్షకులు కోరుతుంటే- లిఖితపూర్వక హామీకే సర్కారు సమ్మతిస్తోంది. రైతు ఆందోళనను ఉపశమింపజేస్తేనే సర్కారు ప్రతిష్ఠ ఇనుడిస్తుంది!

నాడు దిగొచ్చిన ప్రభుత్వాలు..

ఉద్యమ పథంలో భారతీయ రైతు ఈ స్థాయిలో కదం తొక్కిన సందర్భాలు రెండున్నాయి. 1907లో బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన మూడు చట్టాలతో ఇప్పటిమాదిరే పొలం తమ చేజారిపోతుందన్న పంజాబ్‌ రైతుల ఆందోళన- సర్దార్‌ భగత్‌సింగ్‌ బాబాయి అజిత్‌సింగ్‌ సారథ్యంలో పగ్డి సంభాల్‌ జట్టా (తలపాగా జారుతోంది... జాగ్రత్త) ఉద్యమంగా రూపుదాల్చి విజయవంతమైంది. పిమ్మట ఎనిమిది దశాబ్దాలకు మహేంద్ర సింగ్‌ తికాయత్‌ నేతృత్వంలో సాగిన బోట్‌ క్లబ్‌ ఆందోళనకు రాజీవ్‌ ప్రభుత్వం దిగివచ్చింది! ప్రతికూల వాతావరణం తమలో సగటున రోజుకొకర్ని బలిగొంటున్నా, కర్కశ నిర్బంధాలు అమలవుతున్నా- నల్ల చట్టాలు రద్దు కావాల్సిందేనంటున్న రైతుల నిబద్ధ పోరులో నిజాయతీ ఉంది. డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సుల్ని అమలు చేస్తామంటూ 2014లో ఇచ్చిన హామీనుంచి వెనక్కి తగ్గిన ఎన్‌డీఏ సర్కారు- రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ తెచ్చిన చట్టాలివి.

ప్రతిష్టంభన వీడేదెపెప్పుడు?

వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనా కొత్త చట్టాలపై వాటిని సంప్రదించనే లేదు. రైతన్నల జీవికతో ముడివడిన కీలకాంశంపైన వారి సంఘాలతోనూ చర్చించ లేదు. క్షేత్రస్థాయి వాస్తవాలు ఎరుగని అధికార గణం ఏసీ గదుల్లో సాగించిన దుర్విధాన రచనకు తెలిసో తెలియకో మొహరు వేసిన ప్రభుత్వం- రైతుల అభ్యంతరాలేమిటో తెలిసి కూడా వెనక్కి తగ్గకపోవడం విడ్డూరం. సాగు చట్టాల్ని ఏణ్నర్ధం పాటు శవసమానంగా అటకెక్కించే బదులు రైతులు కోరినట్లుగా వెంటనే వాటిని ఖననం చేసి, భవిష్యత్తులో సర్వామోదకర శాసనాలకు రెక్కలు తొడగడానికి ఏమిటి అభ్యంతరం? వ్యధాభరితంగా సాగుతున్న రైతుల ఆందోళనను గమనిస్తే- దేశంలో ప్రతిపక్షం ఎంత బలహీనంగా ఉందో బోధపడుతోంది. ఎన్‌జీ రంగాలా రైతు ప్రయోజనాల్ని కాచుకొనే బలీయ రాజకీయ సంకల్పంగల నేతలు లేకపోబట్టే, అన్నదాతలు ఇంతగా చితికిపోతున్నారు. 'ఎద్దు ఎండకు- ఎనుబోతు నీడకు' చందంగా ఉన్న ఈ ప్రతిష్టంభనకు తెరపడేదెప్పుడు?

ఇదీ చదవండి:'పరువునష్టం కేసు నుంచి విముక్తి కల్పించండి'

ABOUT THE AUTHOR

...view details