తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బడిగంటలపై డోలాయమానం.. నిర్వహణలో సవాళ్లు! - పాఠశాలలు మళ్లీ ఎప్పుడు మొదవుతాయో?

కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రస్తుతానికి ఆన్​లైన్ బోధనను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను దశలవారీగా ప్రారంభించాలని యోచిస్తున్నాయి.

When will schools and educational institutions be opened?
బడిగంటలపై డోలాయమానం!

By

Published : Jun 11, 2020, 8:42 AM IST

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో బడులు మూతపడ్డాయి. ఇప్పటికీ కొవిడ్‌ మహమ్మారి తీవ్రత తగ్గకపోవడంతో కొన్ని రాష్ట్రాలు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను సైతం రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశాయి. తెలంగాణ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు ఈ మార్గాన్నే అనుసరించాయి. ప్రతి ఏటా జూన్‌ రాగానే చాలా రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై ప్రవేశాల ప్రక్రియతో సందడి నెలకొంటుంది. విద్యార్థుల పుస్తకాలు, ఏకరూప దుస్తులు, సంచుల కోసం మార్కెట్లోనూ కోలాహలం మొదలవుతుంది. కానీ, కొవిడ్‌ సృష్టించిన సంక్షోభం నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ బోధన మొదలుపెట్టాయి. కరోనా ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్లకు పైగా విద్యార్థులు నష్టపోతారని ఇటీవల యునెస్కో అంచనా వేసింది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను దశలవారీగా ప్రారంభించాలని యోచిస్తున్నాయి. త్వరలో కొవిడ్‌ నియమావళితో మార్గనిర్దేశకాలూ జారీ కానున్నాయి. వాటికి అనుగుణంగా పాఠశాలల నిర్వహణ ఉండాలనేది నిపుణుల అభిప్రాయం. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యార్థులు నష్టపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరులశాఖ తాజాగా తల్లిదండ్రులు, విద్యావేత్తల అభిప్రాయాలను కోరింది.

నిర్వహణలో సవాళ్లు...

కరోనా ప్రభావంతో పాఠశాల విద్య పూర్తి స్థాయిలో మార్పులకు లోనవుతున్న తరుణంలో బడుల్లో మౌలిక వసతుల కల్పన కీలకంగా మారింది. పాఠశాలలు, తరగతి గదుల్లో స్వచ్ఛతకు పెద్ద పీట వేయాల్సిన సమయమిది. తరగతి గది రూపురేఖలు మార్చడంతోపాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, సబ్బులు, శానిటైజర్లు వంటి వాటిని సమకూర్చాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల అలవాట్లలోనూ మార్పులు తీసుకురావాలి. మరోవైపు కొత్త అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా మన పాఠశాల భవనాలు ఉన్నాయా అనేదీ చూడాలి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మెజారిటీ పాఠశాలలకు భవనాలు అందుబాటులో ఉన్నా, ప్రస్తుత తరగతి గది మౌలిక స్వరూపం కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా లేదు. నేటికీ కొన్ని పాఠశాలలను తరగతి గదుల కొరత, మరమ్మతు సమస్యలు వేధిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ స్వచ్ఛవిద్యాలయం కార్యక్రమంలో భాగంగా మెజారిటీ పాఠశాలలకు మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లాంటివి కల్పించినా- వాటి నిర్వహణ సరిగ్గాలేక... నిరుపయోగ స్థితికి చేరుకున్నట్లు క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతున్నాయి. విద్యారంగం స్థితిగతులపై గత సంవత్సరం విడుదల చేసిన 'అసర్‌' 13వ వార్షిక నివేదిక గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో 23 శాతం మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నట్లు వెల్లడించింది. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పరిస్థితులు కరోనా వ్యాప్తికి ఆజ్యం పోసేలా ఉన్న పరిస్థితుల్లో కొవిడ్‌ నియమావళిని నిక్కచ్చిగా అనుసరించాల్సిందేనని, లేదంటే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిర్వహించాల్సిన తీరిలా...

ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి తరగతి గదులు, మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలి. విద్యా హక్కు చట్టం-2009లో పేర్కొన్న విధంగా ప్రమాణాలకు అనుగుణంగా బహుళ వసతుల భవనాలు నిర్మించాలి. సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన పెంచాలి. తరగతి గదిలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడంలాంటి సరికొత్త జీవన శైలిని విద్యార్థులకు అలవాటు చేయాలి. విద్యా ప్రమాణాలతోపాటు ఆరోగ్య సూత్రాల్నీ పాటిస్తూ బడుల్ని నిర్వహించాలి. విద్యార్థుల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు పండ్లు, మాత్రలు పంపిణీ చేయాలి. తరగతి గదుల్లో ప్రతిరోజూ రసాయన ద్రావణాలతో శుభ్రపరచాలి. మూత్రశాలలు, మరుగుదొడ్లకు తగిన నీటి సదుపాయం కల్పించాలి. చేతుల శుభ్రత కోసం ప్రతి పాఠశాలలో 'వాషింగ్‌ స్టేషన్‌' నిర్మించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తరగతి గదిలో భౌతిక దూరం నిబంధన కష్టంగా మారడంతో ఆన్‌లైన్‌ తరగతులపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో దీనిపై అధ్యయనం చేసి అమలు చేయాలి. లేనిపక్షంలో వెనకబడిన గ్రామీణ ప్రాంత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ఒక సామాజిక ఆరోగ్య కార్యకర్తను అనుసంధానించాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించిన తరవాతే తరగతిలోకి అనుమతించాలి. పాఠశాలకు థర్మల్‌ పరీక్షల ఉపకరణాల్ని సరఫరా చేయాలి. పాఠశాల ప్రారంభానికి ముందు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించి విద్యార్థుల భద్రతపై విశ్వాసాన్ని పెంపొందించాలి. విద్యార్థులపై పాఠ్యాంశాలు, పరీక్షల భారాన్ని కూడా తగ్గించాలి. బడిలో పరిశుభ్రత నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. సంక్షోభాన్ని ఎదుర్కొనే రీతిలో పాఠశాల విద్యలో సంస్కరణలకు నాంది పలకాలి!

- సంపతి రమేష్‌ మహారాజ్‌ (రచయిత- సామాజిక విశ్లేషకులు)

ఇదీ చూడండి:శిశువును పీక్కుతిన్న శునకాలు

ABOUT THE AUTHOR

...view details