ప్రపంచ మానవాళితో ఏటేటా మృత్యుక్రీడలాడటంలో ఎయిడ్స్, క్షయ, మలేరియాలకన్నా క్యాన్సర్లదే పెద్దపద్ధు అధికశాతం క్యాన్సర్ కేసులకు పొగాకు వాడకమే పుణ్యం కట్టుకుంటున్నదనడానికి వివిధ అధ్యయన ఫలితాలే రుజువు. ఈ ఏడాది చివరికి దేశంలో 13.9లక్షలకు చేరనున్న క్యాన్సర్ రోగుల సంఖ్య 2025నాటికి 15.7లక్షలకు ఎగబాకనుందంటూ భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్), వ్యాధుల గణాంకాలూ పరిశోధన జాతీయ కేంద్రం(ఎన్‌సీడీఐఆర్) రూపొందించిన సంయుక్త నివేదిక ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఎకాయెకి 27శాతం క్యాన్సర్ కేసులకు పొగాకు వినియోగమే హేతువన్న నిర్ధారణ పెను విషాద మూలాల్ని పట్టిస్తోంది.
ప్రధానంగా పొగాకు సేవనంవల్లే ఇండియాలో ఏటా 85వేలమంది పురుషులు, 34వేలమంది స్త్రీలు నోటి క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఆ మధ్య కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్క చెప్పింది. చూడబోతే, పోనుపోను ముప్పు మరింత తీవ్రతరమవుతున్నట్లు సరికొత్త అధ్యయనం చాటుతోంది! అణ్వస్త్రాలకన్నా ఏటికేడు పెచ్చరిల్లుతున్న ‘పొగ’ ఉత్పత్తులే అత్యంత హానికరమన్న జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ(ఎన్‌ఓటీఈ) ఆ పరిశ్రమలో పెట్టుబడుల్ని, లైసెన్సుల జారీని స్తంభింపజేయాలని గతంలోనే కేంద్రానికి సూచించింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా సిగరెట్ పెట్టెలూ బీడీ కట్టలపై బొమ్మల ముద్రణలకే ప్రభుత్వాలు పరిమితమవుతున్నాయి.
ఈ-సిగరెట్లకే పరిమితం..
ఏడాది కిందట ఈ-సిగరెట్లపై ఆంక్షలు విధించారు. వాస్తవంలో పొగ తాగేవారిలో మూడుశాతమే ఆ అలవాటును మానుకోగలుగుతున్నారని పార్లమెంటరీ స్థాయీసంఘం వెల్లడించగా, ధూమపానాన్ని వదిలేసినా మూడు దశాబ్దాలపాటు దుష్ప్రభావాలు వెన్నాడతాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. అరకొర చర్యలతో పొగాకు ముప్పును తప్పించలేరెవరూ! దేశీయంగా 60లక్షలమంది పొగాకు రైతులకు తగిన ప్రోత్సాహకాలందించి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళించడంతోపాటు కార్మికులకూ కొత్తదారి చూపడంపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి కేంద్రీకరించాలి.