కొవిడ్ సంక్షోభవేళ మొండి బకాయి(నిరర్థక ఆస్తులు- ఎన్‌పీఏ)ల భారం ఇంతలంతలైందన్న రిజర్వ్‌బ్యాంక్, తాజా వార్షిక నివేదికలో కోరికల చిట్టా విప్పింది. సాధారణ కార్యకలాపాలు కుంటువడి మూడులక్షల కోట్ల రూపాయల దాకా ఆదాయ నష్టం వాటిల్లిందని, ఆ మేరకు కేంద్రం పెద్ద మనసుతో బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకోవాలని ఆర్‌బీఐ విన్నవిస్తోంది. కొవిడ్ లాంటి అనూహ్య ఉత్పాతం సంభవించి భిన్న రంగాలు పెను సంక్షోభానికి లోనైన తరుణంలో నిరర్థక ఆస్తుల పరిమాణం పెరగడం సహజమే. పారు బాకీల బాగోతం ఇప్పుడే మొదలైంది కాదు. ఆ మహా జాడ్యం తాలూకు మూలాలు బ్యాంకింగ్ వ్యవస్థలో లోతుగా పాతుకొన్నాయి. ప్రజాధనానికి ధర్మకర్తగా జాతి ప్రగతికి దోహదపడాల్సిన బ్యాంకింగ్ రంగాన నిష్పూచీ ధోరణుల ప్రజ్వలనానిది అంతులేని కథ. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2019-20లో రెండింతలకు మించిన మోసాల విలువ రూ.1.85 లక్షల కోట్లకు చేరి దిగ్భ్రాంతపరుస్తోంది. బ్యాంకులు సజావుగా పనిచేసేందుకంటూ కొలువు తీర్చిన నియమ నిబంధనలు, అంతర్గత కట్టుబాట్లు ఏ ఏట్లో కొట్టుకుపోయినట్లు? ఒక సంస్థ చెల్లించాల్సిన మొత్తానికి హామీ ఇస్తూ బ్యాంకు జారీచేసే ఎల్‌ఓయూల గురించి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(సీబీఎస్)లో అజాపజా లేకుండా చూసి 300 దాకా చీకటి లావాదేవీలకు తావిచ్చిన సిబ్బంది ఘోర నేరం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) పుట్టి ముంచేసింది. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌కు వాధవన్ సోదరులకు మధ్య ‘నీకిది-నాకది’ తరహా ఒప్పందంతో ఆ సంస్థ జాతకమే తిరగబడింది. 'కేవలం' రెండేళ్లలోనే ఈ తరహా వంచనల్ని పసిగట్టగలుగుతున్నట్లు ఆర్‌బీఐ చెబుతున్నా.. పీఎన్‌బీలో వేలకోట్ల రూపాయల కుంభకోణాన్ని ఆడిట్ నియంత్రణ విభాగాలు ఏడేళ్లపాటు కనుగొనలేకపోవడం సిగ్గుచేటు.
పొరపాట్లు.. తప్పిదాలు..
నిరర్థక ఆస్తుల కారకాలను లోగడ వేర్వేరుగా వర్గీకరించిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ 'కొన్ని బ్యాంకుల పొరపాట్లు... మరికొన్ని ఇతరత్రా తప్పిదాలు' అని లోగుట్టు వెల్లడించారు. కారణాలు ఏమైనా దివాలా చట్టంతోనూ ఎన్‌పీఏల పరిష్కరణగాడిన పడలేదంటున్న మరో మాజీ సారథి దువ్వూరి సుబ్బారావు 'ధనహర్తా ఆఫ్ మలేసియా' తరహాలో బ్యాడ్ బ్యాంక్‌ఏర్పాటు యోచనకు ఓటేస్తున్నారు. మొండి బాకీలన్నింటినీ ఒక సంస్థకు బదలాయించి వసూళ్లను క్రమబద్ధీకరించే ప్రత్యేక వ్యవస్థ అవతరణ ఎంత ఆవశ్యకమో, పారు పద్దును ఇంతగా పేరబెట్టిన అవ్యవస్థను సత్వరం సరిదిద్దడం అంతే కీలకం! సాధారణ పౌరులెవరైనా రుణం కోరితే అలవిమాలిన షరతులు పెట్టి రకరకాల పూచీకత్తులు డిమాండు చేసి వేధించే బ్యాంకులు.. బడా కార్పొరేట్ సంస్థలు అడిగిందే తడవుగా వేలకోట్ల రూపాయల నిధులెలా ప్రసాదిస్తున్నాయి? కొంతమంది అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తూ విద్రోహాలకు తెగబడుతున్నట్లు బ్యాంకర్లే వాపోవడం..ఎక్కడికక్కడ అవినీతి చీడ చిలవలు పలవలు వేసుకుపోయిందనడానికి ప్రబల నిదర్శనం. సగటున ప్రతి నాలుగు గంటలకొక కుంభకోణంలో సిబ్బంది చేతివాటాన్ని ధ్రువీకరించడంతోనే స్వీయ బాధ్యత నిర్వర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ భావిస్తున్నట్లుంది! ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఉదారంగా రుణాల మంజూరులో సాయపడుతున్న ఇంటిదొంగల భరతం పట్టాలి. ఆర్థిక నేరగాళ్లు ఆడింది ఆటగా చలాయించుకునే వీల్లేకుండా కంతలు పూడ్చి, నట్లు బిగించాలి. అవినీతి అధికారుల బాగోతాల్ని వెలికి తీయకుండా కప్పిపుచ్చి, కేంద్రంనుంచి ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల రూపాయల సాయం పొంది- ఆర్‌బీఐ కొత్తగా మరింత ఆర్థిక తోడ్పాటు కోరడం పూర్తి అసంబద్ధం. బ్యాంకుల పునర్ మూలధనీకరణ పేరిట కేంద్రం వెచ్చించే ప్రతి రూపాయీ ప్రజాధనమే. బ్యాంకుల్లో జవాబుదారీతనానికి, పనిపోకడల్లో పారదర్శకతకు ప్రోది చేసి విధిద్రోహుల్ని కఠినంగా దండిస్తేనే- బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రజల్లో మళ్ళీ మన్నన దక్కేది!
ఇదీ చూడండి: ఆ ప్రకటనలు పచ్చి అబద్ధాలు- పాక్‌పై భారత్ ఫైర్