అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి ట్రంప్, బైడెన్‌లలో ఎవరు గెలుస్తారా అని అమెరికన్లతోపాటు ఇతర దేశాలవారూ ట్విటర్‌ను, ఎన్నికల వెబ్‌సైట్లను ఉత్కంఠతో శోధిస్తున్నారు. భారతీయులైతే బిహార్ ఎన్నికలకన్నా అమెరికా ఎన్నికల మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంటే అతిశయోక్తి కాదు. విజేతకు తిరుగులేని మెజారిటీ వస్తుందా లేక అరకొర మెజారిటీ వచ్చి ఫలితాల బంతి కోర్టు వాకిట్లో పడుతుందా అనే ప్రశ్న అందరి నోటా వినవస్తోంది.
కరోనా వల్ల పోలింగ్ తేదీకి ముందే 10 కోట్ల ఓట్లు తపాలా ద్వారా పోల్ కావడం, వాటి మీద ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టుల్లో పేచీలు పెట్టడం ఈ గందరగోళానికి కారణం. కోర్టు వ్యాజ్యాల వల్ల ఎన్నికల ఫలితం వెలువడటానికి రోజులు లేదా వారాలు పట్టవచ్చన్న అనుమానాలు ఏర్పడ్డాయి. పోలింగ్ పూర్తయ్యాక నిర్దిష్ట తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడటం, వాటిని అన్ని పార్టీలు శిరసా వహించడం అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నదే- ఒక్క అమెరికాలో తప్ఫ అక్కడ ఇతర దేశాలకు భిన్నమైన సమాఖ్య పద్ధతి నెలకొని ఉండటం తీవ్ర గందరగోళానికి తావిస్తోంది.
అమెరికాలో కొన్ని నిర్దేశిత అంశాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలకే అత్యధిక అధికారాలు ఉంటాయి. ఎన్నికలను ఎలా నిర్వహించాలి, ఎవరు ఎప్పుడు ఎలా ఓటు వేయాలనే అంశంపై రాష్ట్రాలకే పూర్తి అధికారం ఉంది. ఇక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ సొంత నిబంధనలను అనుసరిస్తాయి. పోలైన ఓట్లను ఎప్పుడు లెక్కించాలి, పోలింగ్ తేదీ తరవాత అందిన పోస్టల్ ఓట్లను ఆమోదించాలా వద్దా, ఓట్ల లెక్కింపును ఏ తేదీకల్లా పూర్తి చేయాలనే అంశాలపై పూర్తి నిర్ణయాధికారం రాష్ట్రాలదే. అమెరికాలో చిన్న రాష్ట్రమైనా, పెద్ద రాష్ట్రమైనా- కాంగ్రెస్ (పార్లమెంటు) ఎగువ సభ సెనేట్‌లో తలా రెండేసి సీట్లు ఉంటాయి.
తపాలా ఓట్లపై తకరారు
ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానించిన ట్రంప్ బ్యాలట్ పత్రాల చెల్లుబాటును, ఓట్ల లెక్కింపును కోర్టుల్లో సవాలు చేస్తున్నారు. కరోనా విజృంభణ వల్ల చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో 10 కోట్లమంది వరకు అమెరికన్లు తపాలా ద్వారా ఓటు వేశారు. వీరిలో 80 లక్షలమంది 18-29 ఏళ్ల ప్రాయంలోని యువజనులేనని అంచనా. పోలింగ్ కేంద్రాల్లోనూ రికార్డు సంఖ్యలో యువ ఓటర్లు కనిపించారు. వీరు కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం, నిరుద్యోగం, జాత్యహంకారాలకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.
పెన్సిల్వేనియా రాష్ట్రంలో యువత తొలిసారి ఓటర్లుగా నమోదయ్యేటప్పుడు సరైన గుర్తింపు పత్రాలను చూపలేదనే వంకతో వారి తపాలా ఓట్లను తిరస్కరించాలని ట్రంప్ వర్గీయులు దావా వేశారు. యువ ఓటర్లు బైడెన్ వైపు మొగ్గారనడానికి ఇది బలమైన సూచన. అత్యధిక డెమొక్రాట్ ఓటర్లు కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాలకు రాకుండా ముందస్తుగా తపాలా ఓట్లు వేశారనే అంచనాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థించే రిపబ్లికన్ ఓటర్లు మాత్రం ఆయనలానే మాస్కులు ధరించకుండా బయటికి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారని, దీన్ని వీరత్వ ప్రదర్శనగా భావించారని విశ్లేషణ వినవస్తోంది.
అమెరికాలోని 50 రాష్ట్రాలకు 34 రాష్ట్రాలు, వాటితోపాటు రాజధాని వాషింగ్టన్ కూడా తపాలా బ్యాలట్లను అనుమతిస్తున్నాయి. ఈ తపాలా ఓట్లలో అత్యధికం డెమొక్రాట్ల ఖాతాలో పడతాయనే భయంతో ఆ ఓట్ల చెల్లుబాటును ట్రంప్ కోర్టుల్లో సవాలు చేస్తున్నారు. మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును ఆపాలని, పెన్సిల్వేనియాలో పోలింగ్ రోజు రాత్రి ఎనిమిది గంటల తరవాత అందే బ్యాలట్ పత్రాలను లెక్కించకూడదని వాదిస్తూ దావాలు వేశారు.