కరోనా కారణంగా దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రపంచ దేశాలకు భిన్నంగా స్పందించిన భారత్... కఠినమైన లాక్డౌన్తో కరోనాపై యుద్ధాన్ని ప్రకటించింది. 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో చాలా మంది జీవనోపాధిపై దీని ప్రభావం పడింది.
చాలా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా విజృంభణ తక్కువ స్థాయిలోనే ఉంది. అయితే ఆర్థిక పరంగా చాలా నష్టం వాటిల్లింది. ఉత్పత్తి, ఉద్యోగాలు, ఆదాయాలు భారీగా పడిపోయాయి. 2019లో 4.3 శాతం, 2018లో 6.8 శాతంగా ఉన్న దేశ ఆర్థిక వృద్ధి రేటు 2020లో 1.2శాతంగా ఉండనుందని ఐరాస అంచనా వేసింది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం ఏప్రిల్లో 11.4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వీరిలో 2.7 కోట్ల మంది 20- 30 మధ్య వయస్కులే కావటం గమనార్హం.
ప్యాకేజీలో లోపాలు?
కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్రం రూ.20.97 లక్షల కోట్లు ప్రకటించింది. ఇందులో రెండు అంశాలుగా డబ్బును దేశ ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించనుంది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా నగదు లభ్యత ఉండేలా చూసుకోవటం వాటిలో ప్రధానమైంది. ఎంఎస్ఎంఈలు, వీధి వ్యాపారులకు రుణాల అందజేతకు పూచీకత్తును ప్రభుత్వమే ఇస్తుంది.
వ్యవసాయం, పరిశ్రమ, వ్యాపార సౌలభ్యానికి సంబంధించిన కీలక సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవసాయ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం సహా ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించటమే లక్ష్యంగా పెటుకుంది.
దేశం స్వావలంబన దిశగా అడగులు వేసేలా రూపొందించిన ఈ ప్యాకేజీని చాలా మంది ఆర్థిక నిపుణలు స్వాగతించారు. ఈ సంస్కరణలు, నగదు లభ్యత చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తే చాలా అంశాలను పరిష్కరించుకోగలమని అంటున్నారు.
వస్తు వినియోగం సంగతేంటి?
అయినప్పటికీ.. ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అత్యంత ప్రధానమైనది వస్తు సేవల వినియోగ డిమాండ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. ఆర్థిక వృద్ధి తగ్గటం, నిరుద్యోగిత పెరగటానికి ప్రధాన కారణం వస్తు సేవలకు డిమాండ్ తగ్గటమే.
రెండోది... సరఫరా వ్యవస్థ పునరుద్ధరణ. కరోనా కారణంగా పూర్తిగా ధ్వంసమైన సరఫరా వ్యవస్థను తిరిగి గాడిన పెడితేనే వస్తు వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది.