తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కశ్మీర్​ సైనిక వ్యూహం ఈశాన్యంలో ఫలిస్తుందా? - తిరుగుబాటు సంస్థలు

రాష్ట్రంలో తిరుగుబాటు ముఠాలు పన్నులు వసూలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో తన అధికారాలను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు నాగాలాండ్ గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు గవర్నర్ లేఖ రాయడం వెనక కారణాలేంటి? తిరుగుబాటు సంస్థల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం అనుసరించాల్సిన మార్గాలేంటనే విషయాలపై సీనియర్ పాత్రికేయులు రాజీవ్ భట్టాచార్య విశ్లేషణ ఇది.

Nagaland
నాగాలాండ్

By

Published : Jul 6, 2020, 2:09 PM IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు తన అధికారాలను పూర్తిగా వినియోగించాలని కోరుకుంటున్నట్లు నాగాలాండ్​ గవర్నర్ ఆర్​ఎన్ రవి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సాయుధ ముఠాలు చేస్తున్న దోపిడీలు, అక్రమ కార్యకలాపాల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ఓ సీనియర్ ప్రభుత్వ అధికారిని నియమించే అధికారాన్ని కోరారు. రాష్ట్రంలో అరడజనుకు పైగా సాయుధ ముఠాలు ఉన్నాయని.. ఇవన్నీ కొండ ప్రాంతాల్లో అక్రమంగా పన్నులు వసూలు చేస్తున్నాయని లేఖలో ప్రస్తావించారు.

ఈ లేఖపై వివిధ వర్గాలు, పార్టీల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కేవలం చట్టబద్ధమైన పన్నులను విధిస్తున్నట్లు ఈశాన్యంలోని నాగా ప్రాంతంలో ఉన్న అతిపెద్ద తిరుగుబాటు సంస్థ ఐసాక్ ముయివా- నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్(ఎన్​ఎస్​సీఎన్-ఐఎం) పేర్కొంది. విరాళాలు మాత్రమే సేకరిస్తున్నామని మరికొన్ని తిరుగుబాటు సంస్థలు చెప్పుకొచ్చాయి.

ఇదీ చదవండి-'నాగా'లతో చర్చలపై నీలినీడలేనా!

వాస్తవానికి తిరుగుబాటు సంస్థలు నాగాలాండ్ సహా మయన్మార్​లోని నాగా ప్రాంతం​లో కొన్ని దశాబ్దాల నుంచి సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్నాయి. వాణిజ్య సంస్థల నుంచి పన్నులు వసూలు చేసి రశీదులు జారీ చేస్తున్నాయి. తిరుగుబాటు ముఠా సభ్యులు, మధ్యవర్తులు ఈ పన్నులను వసూలు చేస్తున్నారు.

అయితే ముఖ్యమంత్రికి గవర్నర్ ఇప్పుడు లేఖ రాయడంలో ఆంతర్యమేంటి?

ఈ తిరుగుబాటు ముఠాలు నాగాలాండ్​లో రహదారులపై వెళ్లే ట్రక్కుల నుంచి కొంత కాలంగా పన్నులు వసూలు చేయడం ప్రారంభించాయి. గత మూడు నెలల్లో ఇలాంటి ఘటనలు బాగా పెరిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ముఠాకు చెందినట్లు అనుమానిస్తున్న కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు కూడా.

ఖర్చులు పెరిగాయ్​..

ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుందనే ఊహాగానాల మధ్య ముఠాలు గతేడాది తమ సభ్యుల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయి. ప్రభుత్వం నుంచి అన్ని ప్రయోజనాలను పొందేందుకు తమ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించాయి. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడల్లా.. తిరుగుబాటు సంస్థలు ఇలాగే తమ బలాన్ని విస్తృతం చేసుకున్నాయి. ఫలితంగా వాటి వ్యయాలు బాగా పెరిగిపోయాయి.

గతేడాది నవంబర్ 25న ఎన్​ఎస్​సీఎన్​(ఐఎం) నిర్వహించిన నియామక డ్రైవ్​ను అసోం రైఫిల్స్​, సైన్యం సంయుక్తంగా అడ్డుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇలాగే ఇతర సమూహాలు సైతం నియామక ర్యాలీలను నిర్వహిస్తున్న విషయం బహిరంగ రహస్యమే.

కరోనా పాట్లు

ఈ ప్రాంతంలోని ముఠాలలో చాలావరకు అవిభాజ్య నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఎన్​ఎస్​సీఎన్)​ వర్గాలే. 1975 షిల్లాంగ్ ఒప్పందాన్ని వ్యతిరేకించిన నాయకులు కలిసి 1980లో 'ఎన్​ఎస్​సీఎన్​'ను ఏర్పాటు చేశారు. ఈ ముఠాలకు చాలా వరకు ఆదాయం పన్నుల ద్వారానే వస్తుంది. దిమాపుర్​లోని వాణిజ్య సముదాయాలు, దుకాణాలు వీరి ఆదాయానికి కీలకం. అయితే కరోనా కారణంగా గత మూడు నెలల నుంచి వ్యాపారాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు అక్రమ రవాణా ద్వారా తీసుకొచ్చిన చైనా వస్తువులను విక్రయించే నగరంలోని హాంకాంగ్ మార్కెట్ మార్చి నుంచి మూతపడిపోయింది. వీటన్నింటి ఫలితంగా తిరుగుబాటు ముఠాల ఆదాయానికి గండిపడింది.

ఎన్​ఎస్​సీఎన్(యునిఫికేషన్) తిరుగుబాటుదారులు, నాగాలాండ్

ఇదీ చదవండి- 'నాగా'ల సమస్యకు పరిష్కారం దిశగా కేంద్రం!

దీంతో రహదారులపై వెళ్లే సరకు రవాణా ట్రక్కులే వీరికి దిక్కయ్యాయి. మణిపుర్​ సహా ఇతర ప్రాంతాల గుండా పెద్ద ఎత్తున ఈ రవాణా జరుగుతుంది. వీరి వద్ద నుంచి పన్నులు వసూలు చేయడం ప్రారంభించాయి ముఠాలు. గత మూడు నాలుగు నెలలుగా నాగాలాండ్​లో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడానికి ఇది కూడా ఓ కారణం.

చర్చలకు ఓకే

ప్రభుత్వంతో ఎన్​ఎస్​సీఎన్​(ఐఎం) కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత నాగాలాండ్​లో 1997లో శాంతి ప్రక్రియ మొదలైంది. అనంతరం ఎన్​ఎస్​సీఎన్(ఖప్లంగ్)తోనూ ఇలాంటి ఒప్పందాలు కుదిరాయి. షిల్లాంగ్ ఒప్పందం మాదిరిగా ఒక ఒప్పందం విఫలమైతే మరిన్ని కలహాలు జరగకుండా చూసేందుకు... ఇతర తిరుగుబాటు సంస్థలు కూడా శాంతి చర్చలకు ముందుకొచ్చాయి.

ఎన్​ఎస్​సీఎన్(ఐఎం) క్యాడర్, దిమాపుర్

రాజ్యాంగం, జెండా విషయాలను మినహాయిస్తే ప్రభుత్వానికి తిరుగుబాటు సంస్థలకు మధ్య దాదాపు అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎన్​ఎస్​సీఎన్​(ఐఎం) నేతృత్వంలోని పలు సంస్థలు చేస్తున్న డిమాండ్లను అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.

సైనిక చర్య పరిష్కారం కాకూడదు!

ఈ తిరుగుబాటు సంస్థల తీరుపై నాగాలాండ్​లోని పౌర సమాజ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ.. ముఠాలు లేవనెత్తిన అంశాలకు ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తోంది.

"చర్చలు పరిష్కారం కానంతవరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. సుదీర్ఘంగా సాగుతున్న చర్చలను ఓ కొలిక్కి తీసుకురావడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. నాగా రాజకీయ సమస్యను పరిష్కరించాలి."

-రోజ్​మేరీ జువిచు, నాగా మదర్స్​ అసోసియేషన్ సలహాదారులు

యాక్ట్ ఈస్ట్ పాలసీని అమలు చేయడాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈశాన్యంలో శాంతిని పునరుద్ధరించడానికి చర్చలకు తార్కిక ముగింపు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాకూడదు. జమ్ము కశ్మీర్​లో అమలు చేసిన వ్యూహాలు ఈశాన్యంలో పనిచేయవని భాజపా నాయకత్వం గ్రహించాలి.

(రచయిత- రాజీవ్ భట్టాచార్య, సీనియర్ పాత్రికేయులు)

ABOUT THE AUTHOR

...view details