నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీల వ్యవహార శైలిపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యాంగ విలువలకు వారు విఘాతం కలిగిస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. వారిరువురూ గత ఆరు నెలల్లో పార్లమెంటును రెండుసార్లు రద్దు చేయడమే ఇందుకు కారణం. కానీ ఓలీ, భండారీ మాత్రం తమ వైఖరిని సమర్థించుకుంటున్నారు. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితికి దారితీశాయి. పార్లమెంటును రద్దు చేయాలని విజ్ఞప్తి చేసే వెసులుబాటు ప్రధానికి లేదని, 2015లో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా రూపకర్తలు గర్వంగా ప్రకటించారు. కానీ గత ఆరు నెలల్లోనే ఆ దేశ ప్రతినిధుల సభ రెండుసార్లు రద్దు కావడం గమనార్హం. ఓలీ విజ్ఞప్తిని అంగీకరిస్తూ తొలుత 2020 డిసెంబర్ 20న, మళ్ళీ 2021 మే 22న పార్లమెంటును రద్దు చేశారు భండారీ. రాజ్యాంగంలోని 76వ ఆర్టికల్‌ను పరిశీలించకుండా ఓలి విజ్ఞప్తికి అధ్యక్షురాలు ఆమోదముద్ర వేశారని విశ్లేషకులు అంటుంటే... దాన్ని ప్రధాని, అధ్యక్షురాలు ఖండించారు.
అడుగడుగునా బలపడుతూ...
ఓలీ, భండారీ ఇరువురూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ - యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్) పక్షానికి చెందినవారే. భండారీ భర్త, ప్రముఖ నేత మదన్ భండారీ 1993లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అ తరవాత భండారీకి రాజకీయ పాఠాలు నేర్పించిన ఓలీ పార్టీలో ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఇందుకు కృతజ్ఞతగా 2015లో అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఓలీకి ఆమె అన్ని విధాలుగా మద్దతిస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. నూతన రాజ్యాంగాన్ని ప్రకటించిన సమయంలో, దేశానికి దక్షిణాన ఉన్న తెరాయ్ ప్రాంతంలోని మధేసి పార్టీలను కూడా చేర్చుకోవాలని భారత్ నుంచి నేపాల్‌కు తీవ్ర ఒత్తిడి ఎదురైంది. కానీ వాటిని ఓలీ లెక్కచేయకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఈ పరిణామంతో ఓలీకి అక్కడి ప్రజల్లో ఆదరణ పెరిగింది. 2020 మే 20న నేపాల్ కొత్త మ్యాపును విడుదల చేశారు. కాలాపానీ, లింపియదుర, లిపులేఖ్ ప్రాంతాలపై భారత్-నేపాల్ మధ్య వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అవి తమ భూభాగంలోనివేనని ఇరు దేశాలూ వాదిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయా ప్రాంతాలను జోడిస్తూ ఓలీ మ్యాప్ రూపొందించడం తీవ్ర చర్చలకు దారితీసింది. అయినప్పటికీ ఓలీ వెనకడుగు వేయక పోవడంతో మద్దతుదారుల్లో ఆయన నాయకత్వం మీద నమ్మకం పెరిగింది. పార్లమెంటు రద్దు తరవాత సైతం ఓలీ ధైర్యంగా ఉండటానికి- మహంత ఠాకుర్, రాజేంద్ర మహతో వంటి మధేసి నేతలు ఆయనకు మద్దతుగా నిలవడం మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వారిని తనవైపు తిప్పుకోవడానికి ఓలీ 'పౌరసత్వ' అస్త్రాన్ని ప్రయోగించారు. నూతన పౌరసత్వ ఆర్డినెన్స్‌ను ఓలీ- అధ్యక్షురాలికి పంపగా... ఆమె వెంటనే దాన్ని ఆమోదించారు. 2015 సెప్టెంబర్ 20కి ముందు నేపాల్ పౌరసత్వం ఉన్న దంపతుల సంతానాలకు, ఒంటరి తల్లుల సంతానాలకు పౌరసత్వాన్ని అందించే విధంగా ఆ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. దీంతో అప్పటి వరకు తనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న మధేసి నేతలను ఓలి తనవైపు తిప్పుకోగలిగారు.