ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రచారం వేడెక్కింది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా డెమోక్రటిక్ పార్టీ తరఫున నిలిచిన ప్రత్యర్థి జో బైడెన్ కే హెచ్చు జనాదరణ ఉందని వివిధ సర్వేలు తెలుపుతున్నాయి. అమెరికా ఎన్నికల వైచిత్రి ఏమంటే, ప్రజల నుంచి ఎక్కువ ఓట్లు సంపాదించిన అభ్యర్థి కన్నా ఎక్కువ నియోజక గణ (ఎలెక్టోరల్ కాలేజ్) ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థే చివరకు విజేతగా నిలవడం. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభలో, ఎగువ సభ అయిన సెనెట్‌లో దేశంలోని 50 రాష్ట్రాలకూ ఉన్న సీట్లను బట్టి ఆయా రాష్ట్రాలకు నియోజక గణ ఓట్ల కేటాయింపు జరుగుతుంది. రెండు సభల్లో కలిపి 538 నియోజక గణ ఓట్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి ఎక్కువ నియోజక గణ ఓట్లు (కనీసం 270) సాధించిన అభ్యర్థి దేశాధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
అలా అధ్యక్షుడయ్యారు..
2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ కన్నా డెమోక్రటిక్ అభ్యర్థి హిలరీ క్లింటన్ కు 28.7 లక్షల ప్రజా ఓట్లు ఎక్కువగా లభించినా, నియోజక గణ ఓట్లు ఎక్కువ వచ్చిన ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించారు. ఈసారి కూడా అలాగే జరగదని భరోసా ఏమీ లేదు. నవంబరు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ బైడెన్‌కు 50 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినా, నియోజక గణంలో ట్రంప్ మళ్లీ ఆధిక్యం సాధిస్తే ఆయనకే సింహాసనం దక్కుతుంది. చిక్కల్లా ట్రంప్ గత ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన రాష్ట్రాల్లో ఈసారి ఆయనకు పట్టు తగ్గిపోతుండటమే. అందుకే, గతంలో గెలిచిన రాష్ట్రాల్లో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ప్రత్యర్థి చేతిలోని రాష్ట్రాల్లో పాగా వేయాలని బైడెన్, ట్రంప్ హోరాహోరీ పోరాడుతున్నారు. 2016 ఎన్నికల్లో విస్కాన్సిన్, మిషిగన్, పెన్‌సిల్వేనియా రాష్ట్రాల్లో హిలరీ కన్నా కేవలం 77 వేల పైచిలుకు ప్రజా ఓట్లు ఎక్కువగా సాధించడం వల్ల ట్రంప్ ఆ మూడు రాష్ట్రాల నియోజక గణ ఓట్లన్నింటినీ తన ఖాతాలో వేసుకుని అధ్యక్ష పదవి చేజిక్కించుకున్నారు.
బెర్నీ-బైడెన్ ఏకమై..
నిజానికి అప్పట్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం హిల్లరీతో పోటీపడిన బెర్నీ శాండర్స్ కు ఈ మూడు రాష్ట్రాల పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. చివరకు హిల్లరీకే అభ్యర్థిత్వం ఖరారవడంతో, ప్రైమరీలలో బెర్నీకి ఓటు వేసిన డెమోక్రటిక్ పార్టీ తెల్లజాతి కార్మిక ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నకు ఓట్లు వేశారు. అప్పట్లో హిల్లరీ, శాండర్స్ మద్దతుదారులు కలిసి పనిచేసి ఉంటే ట్రంప్ ఆట కట్టేదని విశ్లేషణలు వెలువడ్డాయి. గతంలో చేసిన పొరపాటు పునరావృతం కాకుండా చూడటానికి ఈసారి బైడెన్ , బెర్నీ శాండర్స్‌లు ఏకమయ్యారు. అధ్యక్ష ఎన్నికలు, ఆ తరవాత కూడా దేశ రాజకీయాలను శాసించే ఆరు కీలక సమస్యలపై పార్టీ విధాన రూపకల్పనకు సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేశారు. ఆ అంశాలేవంటే- నిరుద్యోగంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వలసల విధానం, కొవిడ్ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ, జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై పెల్లుబికిన నిరసనాగ్రహాల దృష్ట్యా నేర న్యాయ సంస్కరణలు చేపట్టడం, విద్యా రంగ సంస్కరణలు, వాతావరణ మార్ఫు డెమోక్రటిక్ పార్టీలో బైడెన్ వర్గ ఉదారవాదులు, శాండర్స్ వర్గ ప్రగతిశీలురు ఈ అంశాలకు సంబంధించి ట్రంప్‌పై కలిసికట్టు పోరాటం సాగిస్తున్నారు.
డెమోక్రటిక్ పార్టీ వైపే జనాల మొగ్గు
అమెరికాలోని నల్లజాతివారు, హిస్పానిక్, ఆసియన్లు, ఇతర మైనారిటీ వర్గాల్లో డెమోక్రటిక్ పార్టీకే ఎక్కువ పట్టు ఉంది. వీరికి వ్యతిరేకంగా తెల్లజాతి ఓటర్లను కూడగట్టాలన్న తాపత్రయంలో ట్రంప్ హెచ్ 1బి వీసాలపైన విరుచుకుపడుతున్నారు. విదేశాల నుంచి అమెరికాలో నివాసం కోసం వలస వచ్చేవారితోపాటు పనికోసం వచ్చేవారిపైనా తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. బైడెన్ తాను గనుక అధికారంలోకి వస్తే తక్షణం హెచ్ 1బి వీసాలపై సస్పెన్షన్ రద్దు చేస్తానన్నారు. కరోనా కల్లోలం వల్ల ఏదైనా అమెరికన్ విద్యాసంస్థ పూర్తిగా ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేపడితే, ఫాల్ సెమిస్టర్‌లో విదేశీ విద్యార్థులంతా తమతమ దేశాలకు వెళ్లిపోయి అక్కడి నుంచి పాఠాలు వినాలనే నిబంధనను ట్రంప్ సర్కారు తీసుకొచ్చింది. ఇది భారతీయ విద్యార్థులకు చాలా నష్టదాయకం. ట్రంప్, బైడెన్ లు ఇద్దరూ భారతదేశం తమకు వ్యూహపరమైన భాగస్వామి అని ప్రకటిస్తున్నా- హెచ్ 1బి విషయంలో ట్రంప్ భారత ప్రయోజనాలకు హానికరంగా వ్యవహరిస్తున్నారు.
అందరికీ చిర్రెత్తించిన ట్రంప్..!