తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అంతరిక్ష పోటీలో ప్రైవేటు భాగస్వామ్యం పాత్ర ఏంటి? - eenadu main feature today

టెలికమ్యూనికేషన్‌ రంగంలో 'జియో, భారతీ ఎయిర్‌టెల్‌' వంటి ప్రైవేటు సంస్థల ప్రవేశం ప్రజలకు ఎంత సౌలభ్యం, సౌకర్యం కల్పించిందో చూశాం. అంతరిక్ష రంగంలోనూ అలాంటి ప్రవేశిస్తే అదే స్థాయి ప్రయోజనాలు సిద్ధిస్తాయని ఆశించవచ్చు. అమెరికాలో స్పేస్‌ఎక్స్‌తోపాటు ‘అమెజాన్‌, బోయింగ్‌’ వంటి హేమాహేమీలు అంతరిక్ష ప్రయోగాల్లోకి దిగినందున విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. భారత్​లోనూ పైవేటు సంస్థలు జోరుగా ముందుకురావాలంటే వ్యవస్థాపరంగా కీలక మార్పుచేర్పులు చేయడం అవసరం.

space india
అంతరిక్ష పోటీ

By

Published : Jun 15, 2020, 7:22 AM IST

అమెరికా ప్రైవేటు అంతరిక్ష కంపెనీ స్పేస్‌ఎక్స్‌ గతనెలలో ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా పంపింది. అనంతరం ఫాల్కన్‌ రాకెట్‌లోని కీలక భాగం ఇంజిన్‌తో సహా అమెరికా తీరంలోని ఒక డ్రోన్‌ నౌక మీదకు భద్రంగా దిగింది. ఇలాంటి పునర్వినియోగ రాకెట్ల వల్ల అంతరిక్ష ప్రయోగ, ప్రయాణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి.

స్పేస్‌ఎక్స్‌ విశిష్టత ఇది మాత్రమే కాదు. ఈ నెల 13న ఫాల్కన్‌ రాకెట్‌ 58 స్టార్‌ లింక్‌ ఉపగ్రహాలను, మూడు భూశోధన ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. గతేడాది ఇదే రాకెట్‌ 60 స్టార్‌ లింక్‌ ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రపంచానికి అధిక వేగ అంతర్జాల సౌకర్యాన్ని అందించడానికి మొత్తం 42,000 స్టార్‌ లింక్‌ ఉపగ్రహాలను సమీప భూకక్ష్యలోకి ప్రయోగించే కార్యక్రమంలో ఇది ఓ అంతర్భాగం.

ఇస్రోతో సాధ్యమేనా?

ఇప్పటివరకు అంతరిక్షంలోకి అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత భారతదేశానిదే. 2017 ఫిబ్రవరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్వీ) రాకెట్‌పై ఒకే విడతలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించింది. ఇదొక అద్బుతమని, భారతదేశానికి గర్వకారణమని స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ అప్పట్లో ప్రశంసించారు.

మరి 18 ఏళ్ల క్రితం స్థాపితమైన స్పేస్‌ఎక్స్‌ ఇటీవల సాధించిన అపూర్వ విజయాన్ని యాభై ఏళ్ల అనుభవం ఉన్న ఇస్రో సాధించగలదా? అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది.

స్పేస్‌ఎక్స్‌కు అమెరికా ప్రభుత్వ దన్ను

స్పేస్‌ఎక్స్‌ విజయం వెనక అమెరికా ప్రభుత్వ అంతరిక్ష సంస్థ నాసా, రక్షణ శాఖ పెంటగాన్‌ల దన్ను ఉందని గమనించాలి. ‘గూగుల్‌, ఫిడెలిటీ’ కంపెనీలూ స్పేస్‌ఎక్స్‌లో వాటాలు కొన్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అద్భుతాలు సాధించవచ్చని స్పేస్‌ఎక్స్‌ నిరూపిస్తోంది.

భారత ప్రభుత్వమూ ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా అంతరిక్షంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతించింది. స్పేస్‌ఎక్స్‌ తరహాలో పునర్వినియోగార్హ రాకెట్ల (ఆర్‌ఎల్వీ) తయారీకి ఇస్రో శ్రీకారం చుట్టింది. ఆర్‌ఎల్వీలో మొదటి దశ ప్రయోగం విజయవంతమైనా, అది తుది రూపు సంతరించుకోవడానికి పది, పదిహేనేళ్లు పట్టవచ్చు.

ప్రైవేటు భాగస్వామ్యం!

కేంద్ర అంతరిక్ష శాఖ గతేడాది న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ అనే సంస్థను నెలకొల్పింది. ఇది ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌ మాదిరే ఇస్రోకు మరో వాణిజ్య విభాగంగా పనిచేస్తూ- చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాల (ఎస్‌ఎస్‌ఎల్వీ) ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించనుంది. గడచిన అయిదేళ్లలో అనేక అంతరిక్ష అంకుర కంపెనీలు భారత్‌లో ఆరంభమయ్యాయి. వీటిని న్యూస్పేస్‌ స్టార్టప్‌ కంపెనీలుగా వ్యవహరిస్తున్నారు.

ఇవి ఇస్రోకు కాంట్రాక్టర్లుగా, విడిభాగాల సరఫరాదారులుగా కాకుండా సొంతగా అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు స్కైరూట్‌ ఏరోస్పేస్‌ స్వతంత్రంగా చిన్న ఉపగ్రహాల ప్రయోగ రాకెట్‌ను రూపొందించే కృషిలో ఉంది.

  • ‘ఏస్ట్రోమ్‌ టెక్నాలజీస్‌’ ఉపగ్రహ సముదాయాన్ని ప్రయోగించి అంతర్జాల అనుసంధానాన్ని విస్తరింపజేయాలని చూస్తోంది.
  • భూఉపరితల చిత్రాల కోసం నానో ఉపగ్రహ సముదాయాన్ని ప్రయోగించాలని ‘పిక్సెల్‌’ కంపెనీ లక్షిస్తోంది.
  • ‘బెలాట్రిక్స్‌ ఏరోస్పేస్‌’ అంతరిక్ష ప్రయోగాలకు కొత్తతరహా ఇంధనాలను అభివృద్ది చేసే పనిలో ఉంది.

గతేడాది డిసెంబరు నాటికి దేశంలో 25 న్యూస్పేస్‌ అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి.

పెట్టుబడులు ప్రవహించాల్సిందే!

ఇస్రో మొదట్లో రిమోట్‌ సెన్సింగ్‌, కమ్యూనికేషన్లు, వాతావరణ పరిశోధనలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. రానురానూ రక్షణ ప్రయోజనాలకు ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. దేశంలో విస్తరిస్తున్న టెలివిజన్‌, అంతర్జాల వినియోగాల కోసం ఇస్రో ఉపగ్రహ సేవలు అందిస్తోంది. చంద్రుడు, కుజగ్రహాలకు చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌, త్వరలో భూకక్ష్యలోకి మానవులను ప్రయోగించే గగన్‌యాన్‌ ప్రాజెక్టుల మీద ఇస్రో ఎక్కువ సమయం, శక్తి, నిధులను వెచ్చిస్తోంది.

ప్రస్తుతం ఇతర దేశాల ఉపగ్రహాలను తక్కువ ఖర్చులో అంతరిక్షంలోకి ప్రయోగించడం ద్వారా ఇస్రో వాణిజ్య విజయాలు సాధిస్తున్నా, స్పేస్‌ఎక్స్‌ మున్ముందు ఈ వ్యాపారంలో ఇస్రోకు తీవ్రమైన పోటీ ఇవ్వనుంది. ఇస్రో అంతరిక్ష రేసులో అమెరికా, చైనా, రష్యాలకు దీటుగా నిలవాలంటే, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను ఆహ్వానించాల్సిందేనని ప్రభుత్వమూ గ్రహించింది. ఇస్రో వసతులను ప్రైవేటు వినియోగానికీ అనుమతించదలచింది.

రెండు చేతులు కలిస్తేనే..

అంతరిక్షంలో నెగ్గుకురావడానికి చాలా సమయం, శ్రమ, పెట్టుబడులు అవసరమే కానీ, ఈ రంగంలో శ్రమకు మించిన ఫలితాలు అందివస్తాయి. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు అధిక వేగ అంతర్జాల అనుసంధానత లేనిదే ముందుకు కదలవు. ఈ ప్రయోజనాలన్నింటిని సాధించుకోవడానికి కావలసిన నైపుణ్యాలున్న సిబ్బంది, పెట్టుబడులు, సాంకేతికతలను అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేటు రంగం కానీ ఒంటిచేత్తో సమీకరించడం చాలా కష్టం. రెండు చేతులు కలిస్తేనే వేగవంతమైన పురోగమనం సాధ్యమని కేంద్రం గ్రహించి ఆత్మనిర్భర్‌ అభియాన్‌ అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి ద్వారాలు తెరచింది.

టెలికమ్యూనికేషన్‌ రంగంలో ‘జియో, భారతీ ఎయిర్‌టెల్‌’ వంటి ప్రైవేటు సంస్థల ప్రవేశం ప్రజలకు ఎంత సౌలభ్యం, సౌకర్యం కల్పించిందో చూశాం. అంతరిక్ష రంగంలోనూ అదే స్థాయి ప్రయోజనాలు సిద్ధిస్తాయని ఆశించవచ్చు. అమెరికాలో స్పేస్‌ఎక్స్‌తోపాటు ‘అమెజాన్‌, బోయింగ్‌’ వంటి హేమాహేమీ ప్రైవేటు సంస్థలు అంతరిక్ష ప్రయోగాల్లోకి దిగినందున, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. భారతదేశంలో పైవేటు సంస్థలు జోరుగా ముందుకురావాలంటే వ్యవస్థాపరంగా కీలక మార్పుచేర్పులు చేయడం అవసరం.

పకడ్బందీ చట్రం

ప్రైవేటు సంస్థల మేధా హక్కులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని న్యూస్పేస్‌ అంకుర సంస్థలు కోరుతున్నాయి. ఇంతవరకు ఇస్రోతో భాగస్వామ్యం నెరపిన సరఫరాదారులు, కాంట్రాక్టర్లకు మేధా హక్కుల రక్షణ అవసరం రాలేదు. అంకుర సంస్థలు కొత్త ఆవిష్కరణలు చేస్తాయి- కనుక వాటి మీద తమకే హక్కులు ఉండాలంటున్నాయి. ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసి చట్టబద్ధ మేధాహక్కులు కల్పించాలని కోరుతున్నాయి.

పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలు ఎల్లవేళలా విజయాలు సాధించలేవు. అవి విఫలమైనప్పుడు శ్రమ, నిధులు వృథా అవుతాయి. ఈ నష్టభయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆర్థిక ఏర్పాట్లు చేయాలి. ఇస్రో మొదటి నుంచి ‘లార్సెన్‌ అండ్‌ టూబ్రో, గోద్రెజ్‌, వాల్‌చంద్‌ నగర్‌ ఇండస్ట్రీస్‌’ వంటి భారీ ప్రైవేటు సంస్థలతో కలసి పనిచేస్తోంది. వీటికి పొరుగు సేవల కింద కొన్ని ప్రాజెక్టులు అందిస్తోంది.

కొన్ని అంతరిక్ష అంకుర పరిశ్రమలతో ఇప్పటికే ఇస్రో చేతులు కలిపింది. ఉపగ్రహ నిర్మాణానికి బెంగళూరులోని ‘ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌’తో, అధునాతన చోదక వ్యవస్థల రూపకల్పనకు ‘బెలాట్రిక్స్‌’తో సహకారం నెరపుతోంది. ఈ సహకారం మరింత బలంగా ముందుకెళ్లాలి.

స్పేస్‌ఎక్స్‌, అమెజాన్‌ వారి బ్లూఆరిజిన్‌, కొన్ని చైనా అంకుర సంస్థలు 35,000 కోట్ల డాలర్ల (రూ.26లక్షల కోట్ల) అంతరిక్ష వాణిజ్య విపణి మీద కన్నువేశాయి. ఇందులో ఇంతవరకు భారత్‌ వాటా కేవలం రెండు శాతమే (700 కోట్ల డాలర్లు). దీన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడానికి ఇస్రో, ప్రైవేటు రంగం కలసికట్టుగా కృషి చేయాలి.

(రచయిత - ఏఏవీ ప్రసాద్‌)

ABOUT THE AUTHOR

...view details