కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని గజగజలాడిస్తోంది. అది ఎంతగా విజృంభించినా నేడు కాకపోతే రేపైనా కనుమరుగు కాక తప్పదు. కలరా, తట్టు, పోలియో, మెదడు వాపు, మశూచి, సార్స్, ఎబోలా, ప్లేగు వంటి మహమ్మారులు సైతం వేధించి కనుమరుగయ్యాయి. కరోనా గతీ రేపు ఇంతేకాక తప్పదు. ఈలోపు అది సృష్టించే విలయం నుంచి ప్రజలను కాపాడుకోవడానికి పాలకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దాంతోపాటు జాతిని వేధిస్తున్న మరో మహమ్మారిపైనా వారు దృష్టి సారించాల్సిన కీలక తరుణమిది. మానవాళిని వేధిస్తూ ఎప్పటికి అంతమవుతుందో తెలియని ఆ మహమ్మారి- 'ఆర్థిక అసమానత'!
అసమానతలకు అంతంలేదా?
కరోనా భూతంలానే వందేళ్ల క్రితం 1920లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా మహమ్మారులు పీడిస్తూనే ఉన్నాయి. అసమానత అనే రుగ్మతకు మాత్రం మందు కనుచూపు మేరలో లేదు. నిజానికి శ్రేయోరాజ్య భావన ప్రపంచంలో తొలుత 1880లో మొగ్గతొడిగింది. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఏర్పడిన ఆర్థిక సామాజిక కష్టాలతో దాని అవసరం మరింత ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్ల అవుతున్నా ఆర్థిక అంతరాలు మాత్రం సమసిపోలేదు. శ్రేయోరాజ్య పాలన అందించే ప్రభుత్వాలు దాని మూలసూత్రాలైన సమాన ఉపాధి అవకాశాలు, సంపద పంపిణీ వంటివాటిని విస్మరించాయి. అనవసర వ్యయాల బారినపడి అవినీతిని నిర్మూలించకుండా అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు మరింత అంతరాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల ఆరోగ్య, ఆర్థిక సామాజిక భద్రత కోసం ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు దోహదం చేసినప్పుడే శ్రేయోరాజ్య భావన సఫలీకృతమవుతుంది. 'ఫోర్బ్స్' లెక్కల ప్రకారం దేశంలో 102 మంది, ప్రపంచంలో 2,095 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ, దేశ జనాభాతో పోలిస్తే ఇది సంఖ్యాపరంగా తక్కువే కావచ్ఛు కానీ మొన్నామధ్య ప్రముఖ ఆర్థికవేత్త పద్మభూషణ్ కౌశిక్ బసు 'ఆక్స్‌ఫామ్' నివేదికను ఉటంకిస్తూ- 73 శాతం సంపద ఒక శాతం ప్రజల చేతిలో ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆర్థిక అంతరాలు ఎంతగా పెరిగి పోయాయో స్పష్టమైంది. దీనివల్ల పేదరికం పెరుగుతూ దాని కవలలైన ఆకలి, అనారోగ్యం మహమ్మారుల కంటే ఎక్కువగా పీడిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు చేపను పట్టడం నేర్పకుండా... తెచ్చి నోట్లో పెట్టినట్లు తాత్కాలిక పథకాలు, కార్యక్రమాలతో తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం యత్నిస్తున్నాయి. అధిక సంఖ్యలో ఉన్న నిర్ణాయక శక్తిని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం లేదు.