తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సామాన్యులకు సత్వర న్యాయం స్వప్నమేనా? - ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ఆలస్యం

ఒక కేసు పరిష్కారానికి సాధారణ కోర్టు 133 రోజులు తీసుకుంటుండగా, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు సగటున 122 రోజులు పడుతున్నట్లు ఓ పరిశీలనలో వెల్లడైంది. దీనివల్ల వాటి ఏర్పాటుతో ప్రయోజనం ఏముంటుందనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇవి సాధారణ కోర్టులకన్నా భిన్నంగా ఏమీ పనిచేయడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. నిర్దిష్ట కేసుల కోసం ఏర్పాటుచేసిన ఈ కోర్టులపైనా ఆయా కేసుల భారం భారీగా ఉండటమే ఇందుకు కారణం.

fast track courts
ఫాస్ట్​ ట్రాక్ కోర్టులు

By

Published : Nov 16, 2021, 6:45 AM IST

సామాన్యులకు సత్వర న్యాయం సుదూర స్వప్నంగానే ఉండిపోతోంది. పదకొండో ప్రణాళిక సంఘం సిఫార్సుతో 20 ఏళ్ల క్రితం మొదలైన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ మందకొడిగా సాగుతోంది. కేసులను వేగవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఏర్పాటైనా, వాటి ప్రయోజనం మాత్రం నెరవేరడం లేదు. కేసుల కొండలను కరిగిస్తూ, దస్త్రాల దుమ్ము దులిపి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా సత్వర న్యాయం అందించాలనే సమున్నత భావన, లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. పోక్సో చట్టం కింద అపరిష్కృత కేసులు వందకుపైగా ఉన్న జిల్లాల్లో ఇలాంటి కోర్టులు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. లైంగిక వేధింపుల కేసుల సత్వర విచారణకు ఉద్దేశించిన ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఆచరణలో అంతంతమాత్రమే. పలు రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు ఇప్పటికీ ఆశించిన స్థాయిలో జోరందుకోలేదు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై రెండేళ్ల క్రితం గాంధీజయంతి రోజు తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ అమలు చేయకపోవడంతో, ఆ అంశాన్ని గుర్తుచేస్తూ కేంద్రం మరోసారి రాష్ట్రాలకు ఇటీవల లేఖలు రాసింది.

నిధులే సమస్య

కేంద్రప్రాయోజిత పథకంలో భాగంగా ఏర్పాటయ్యే కోర్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిధుల వ్యయాల్ని భరించాల్సి ఉండటంతోపాటు, రాష్ట్రాలు సమ్మతి తెలపాలి. ఉత్తర్‌ ప్రదేశ్‌, దిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు, నాగాలాండ్‌ వంటి 17 రాష్ట్రాలు తమకు మంజూరైన మొత్తం కోర్టులను ఏర్పాటు చేశాయి. ఏపీలో 18 కోర్టులు మంజూరవగా, తొమ్మిది మాత్రమే ఏర్పాటయ్యాయి. బిహార్‌కు 54 మంజూరవగా 45, మహారాష్ట్రకు 138 మంజూరుకాగా 33 కోర్టులు పనిచేయడం ప్రారంభించాయి. పశ్చిమ్‌ బెంగాల్‌కు 123 కోర్టులు మంజూరురైనా, వాటి ఏర్పాటుకు ఆ రాష్ట్రం అనుమతించలేదు. అండమాన్‌ నికొబార్‌ కేంద్రపాలిత ప్రాంతానికి ఒకటి మంజూరు చేసినా అనుమతి రాలేదు. తమ రాష్ట్రంలో మహిళలపై దాడుల కేసులు లేనందువల్ల ప్రస్తుతానికి వాటి అవసరం లేదని అరుణాచల్‌ప్రదేశ్‌ పేర్కొంది. గోవా ఒక్కదానికే అనుమతి ఇచ్చింది.

దేశవ్యాప్తంగా పోక్సో న్యాయస్థానాలు కలిపి ఏర్పాటైన సుమారు వెయ్యికి పైగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఈ ఏడాది ఆగస్టు వరకు 56,267 కేసులను పరిష్కరించాయి. కేంద్ర ప్రాయోజిత పథకమైన ఈ కోర్టుల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు సమకూర్చాలి. 60శాతం కేంద్రం, 40శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఒక్కో కోర్టులో ఒక న్యాయాధికారి, ఏడుగురు సిబ్బంది ఉంటారు. ప్రతి కోర్టు ఏడాదికి 65 నుంచి 165 కేసులు పరిష్కరించాలి. ప్రతి కోర్టు నిర్వహణకు ఏటా రూ.75 లక్షల చొప్పున అవసరమవుతాయని అంచనా. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు తమవంతు నిధులు సమకూర్చే విషయంలో రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితులను కారణంగా చూపుతూ కేంద్రం వద్ద తమ అశక్తతను వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని అవి పేర్కొంటున్నాయి. 40 శాతం వాటాను రాష్ట్రాలు భరించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. 2023 మార్చి ఆఖరు నాటికి కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధి కింద రూ.971.70 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.601.16 కోట్లతో మొత్తం రూ.1572.86 కోట్లు కేటాయించాల్సి ఉంది.

పూర్తిస్థాయి నియామకాలు

ఒక కేసు పరిష్కారానికి సాధారణ కోర్టు 133 రోజులు తీసుకుంటుండగా, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు సగటున 122 రోజులు పడుతున్నట్లు ఓ పరిశీలనలో వెల్లడైంది. దీనివల్ల వాటి ఏర్పాటుతో ప్రయోజనం ఏముంటుందనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇవి సాధారణ కోర్టులకన్నా భిన్నంగా ఏమీ పనిచేయడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. నిర్దిష్ట కేసుల కోసం ఏర్పాటుచేసిన ఈ కోర్టులపైనా ఆయా కేసుల భారం భారీగా ఉండటమే ఇందుకు కారణం. ఈవ్‌ టీజింగ్‌, గృహహింస వంటివి కూడా లింగపరమైన హింస కిందకు వస్తాయా అనే విషయంలో స్పష్టత కరవైంది. కేసులకు సంబంధించి నిర్దిష్ట కాలపరిమితి సైతం ఉండటం లేదు. మౌలిక సదుపాయాల కొరత, ప్రత్యేకించిన న్యాయాధికారులు లేకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా తేలాయి. ఈ కోర్టులు మరింత ప్రభావశీలంగా పనిచేయాలంటే విచారణలు నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తవ్వాలి. ప్రత్యేక జడ్జీలను, సమర్థ సిబ్బందిని నియమిస్తేనే అది సాధ్యం. ఇతర కోర్టుల్లో పనిచేసే వారినే తాత్కాలిక జడ్జీలుగా కాకుండా పూర్తిస్థాయి నియామకాలు జరపాలి. కేసుల విచారణ క్రమం తప్పకుండా కొనసాగించాలి. సాక్షులకు, దర్యాప్తు అధికారులకు సకాలంలో నోటీసులు జారీచేసేలా తగిన యంత్రాంగం ఉండాలి. కొన్ని దేశాల్లో పాటిస్తున్నట్లుగా లైంగిక హింసకు సంబంధించిన కేసుల్లో నిర్దిష్ట కాలావధిలో పరిష్కరించే పద్ధతిని అనుసరించాలి. మానవ వనరుల నియామకాల్ని పెంచడం, నిబంధనల పరమైన సంస్కరణలతోనే సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుంది.

-- డీఎస్‌

ఇదీ చదవండి:

Air Pollution: ఉసురు తీస్తున్న వాయుకాలుష్యం

ABOUT THE AUTHOR

...view details