'నాదు దేశము నాదు జాతి నాదు భాష' అనే అహంకారం ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలన్నారు రాయప్రోలు. దేశం, జాతి, భాష... ఈ మూడింటి సంబంధం ముప్పేటలుగా పేనుకొని మానవ అస్తిత్వానికి చిరునామాగా నిలుస్తుంది. అస్తిత్వ పోరాటాలన్నింటికీ భాషే ఉచ్ఛ్వాస. అలాంటి భాష మాతృభాషగా సంక్రమించి ఆ జాతి అస్తిత్వానికి సుస్థిరమైన కోటను నిర్మిస్తుంది. సుఖదుఃఖాల్లో, సంభ్రమాశ్చర్యాల్లో, శరీరంలోని వివిధ నాడులు ఎలా స్పందిస్తాయో అలాగే పుట్టుకతో వచ్చిన భాషా స్పందిస్తుంది.
మనం వేరే భాషలో మాట్లాడే ప్రతి మాట జ్ఞాపకం తెచ్చుకుంటూ మాట్లాడేదే! కానీ మాతృభాష నిద్రావస్థలో సైతం సహజంగా, అసంకల్పితంగా వస్తుంది. మాతృభాషకు, అన్యభాషకు చాలా తేడా ఉంది. మన తెలుగు భాష విషయానికి వస్తే- దేశం అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం జరిగిన ప్రతి ఉద్యమంలోనూ అది ప్రధాన భూమిక వహించింది. ఇప్పటికే పలు రకాల ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మన భాషకు తాజాగా యూనికోడ్ విషయంలో కొత్త ముప్పు ఎదురవుతోంది.
లిపిని పరిరక్షించాలి
భాషను పరిరక్షించడమంటే భాషను ప్రేమించడమే! అలాంటి మన తెలుగు భాష ఉనికినే రూపుమాపే ప్రయత్నాలు పక్కవాళ్లు చేస్తూ ఉంటే ఊరికే చేతులు కట్టుకొని కూర్చోవడం ఎంతవరకు సబబు? తెలుగులో యూనికోడ్ వినియోగం ఎంత అధ్వానంగా ఉందో చూస్తే మనవాళ్లకు మాతృ భాషపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.
తెలుగు ఫాంట్ల విషయంలో నేటికీ వ్యాపార ధోరణే రాజ్యమేలుతోంది. యూనికోడ్‌లో పుస్తకాలు అచ్చు వెయ్యాలన్న ఆలోచనగానీ, అచ్చు వేసే నైపుణ్యాలుగానీ మనవాళ్లకు లేవనే విమర్శలూ ఉన్నాయి. ఇటీవల తిరువాయిమొళి, తిరుప్పావై, తిరుప్పల్లాండు మొదలైన దివ్య ప్రబంధ గ్రంథాల్లో విరివిగా వాడే రెండు వర్ణాలను తెలుగు లిపిలో చేర్చడానికి తమిళులు ప్రయత్నించడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదు.
ఏమిటీ యూనికోడ్..
'యూనికోడ్'’ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచంలో ఏ భాష అయినా ఇందులో సభ్యత్వాన్ని పొందితే, ఆ భాష సాంకేతికంగా పరిపుష్టిని పొందినట్టే లెక్క. తెలుగు భాష కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇందులో సభ్యత్వం తీసుకుంది. అలా తీసుకున్న ప్రతి భాషకూ యూనికోడ్ సర్వసభ్య సంఘం కొన్ని సంకేతాలను అందిస్తుంది.
వీటిద్వారా విశ్వవ్యాప్తంగా ఒకే విధంగా కంప్యూటర్లలో ఇతర ఉపకరణాల్లో వివిధ భాషల మధ్య వారధి నిర్మించినట్లవుతుంది. భాషను అభివృద్ధి చేసుకోవడానికి; భాషానువాదం, భాషాంతరీకరణం, లిపి మార్పిడి, యంత్రానువాదం మొదలైన అనేక వ్యవస్థల్లో ఈ యూనికోడ్ వినియోగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే కాలాలకు తెలుగు భాషను, సాహిత్యాన్ని అందించేందుకు, శాశ్వత సంరక్షణకు ఇది ఒక్కటే మార్గం.