తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అన్నార్తుల ఆకలి తీరేదెప్పుడు? - Hungry people in India

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాడే దేశంలో పేదరికాన్ని తరిమికొట్టాలని మహానేతలు సంకల్పించుకున్నారు. దాంతో పాటే ఆకలి, అనారోగ్యాల్ని అంతమొందించాలని లక్ష్యించుకున్నారు. అయితే అవన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోయినట్లుగా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. స్వతంత్ర భారత్​గా ఆవిర్భవించి 7 దశాబ్దాలు పైబడినా... ప్రపంచ ఆహార సూచీలో 117 దేశాల జాబితాలో ఇండియా 102వ స్థానంలో కొట్టుమిట్టాడుతుండటం దేశ పరిస్థితులకు అద్దం పడుతోంది.

Help the poor
అన్నార్తులను ఆకలి తీరేదెప్పుడు?

By

Published : Apr 20, 2020, 8:06 AM IST

పేదరికాన్ని దాని కవలలైన ఆకలి, అనారోగ్యాల్ని తుదముట్టించడమే లక్ష్యమన్నది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజున మహోన్నత నేతలు చేసిన ఆశయ ప్రకటనల సారాంశం. గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన ఏడు దశాబ్దాల తరవాతా ప్రపంచ క్షుద్బాధా సూచీలో ఇండియా మొత్తం 117 దేశాల జాబితాలో 102వ స్థానంలో ఉండటం- క్షేత్రస్థాయి దయనీయ స్థితిగతులకు దర్పణం. రెక్కాడితేగానీ డొక్కాడని కోట్లాది బడుగు కుటుంబాలపై కరోనా మహమ్మారి అక్షరాలా ఆకలి పిడుగే.

కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఎక్కడి పనుల్ని అక్కడ స్తంభింపజేయడంతో రోజు కూలియే జీవనాధారమైన కోట్లాది శ్రమజీవుల కన్నీటి జడులు గుండెల్ని పిండేసేవే. వైరస్‌ సంగతేమోగాని ఆకలితో చచ్చిపోయేట్లున్నామని బాధితులు బావురుమంటున్నారు. బీదసాదల ప్రయోజనాలకే పెద్దపీట వేసి ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా 81 కోట్లమందికి తిండి గింజలు అందించేందుకు కేంద్రం సంసిద్ధమైంది.

కరోనా రూపంలో అనుకోని ఉత్పాతం..

లబ్ధిదారులు ఆరునెలల కోటాను ఒకేసారి తీసుకొనే వెసులుబాటు, సంక్షుభిత పరిస్థితుల్లో ప్రతి మనిషికీ అదనంగా రెండు కిలోలు అందించేందుకు సుముఖమైంది. సొంత ఊళ్లలో రేషన్‌ కార్డులు ఉన్నా పొట్టచేత పట్టుకొని వలస కూలీలుగా వేరే చోట్లకు తరలిపోయిన కోట్లమంది అభాగ్యుల పరిస్థితి ఏమిటి? ‘ఒక జాతి- ఒకే రేషన్‌ కార్డు’ పథకాన్ని వచ్చే జాన్‌ నుంచి 20 రాష్ట్రాల్లో పట్టాలకెక్కించడానికి కేంద్రం ప్రాతిపదికలు సిద్ధం చేస్తున్న దశలో విరుచుకుపడిన కరోనా ఉత్పాతం బీదా బిక్కీని కష్టాల కాష్ఠంలోకి నెట్టేసింది. వారితోపాటు అన్ని అర్హతలూ ఉండికూడా రేషన్‌ కార్డులకు నోచని అభాగ్యుల సంఖ్యా కోట్లల్లో ఉంది. నిర్బంధ కాలంలో ఆకలి మంటలు కోట్లాది నిర్భాగ్యుల్ని దహించకుండా ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలి!

అధ్యయనాలు ఏమంటున్నాయంటే..

దిగ్బంధంలో చిక్కుకొన్న వలస కూలీల్లో 96 శాతానికి రేషన్‌ అందడం లేదని, స్థానిక అధికారులు వండిన ఆహారం పంపిణీ చేస్తున్న సంగతీ 70 శాతానికి తెలియదని మహారాష్ట్ర, యూపీ, కర్ణాటకల్లో జరిపిన తాజా అధ్యయనం చాటుతోంది! లోగడ యూపీఏ ప్రభుత్వం గ్రామీణ జనాభాలో 75 శాతాన్ని, పట్టణవాసుల్లో 50 శాతాన్ని లక్షించి మొత్తం దేశ జనావళిలో 67 శాతానికి ఆహార భద్రతా హక్కు చట్టాన్ని వర్తింప చేసింది. 2011నాటి జనగణన మేరకు 121 కోట్ల ప్రజల్లో సుమారు 80 కోట్లమందికి లబ్ధి చేకూరుతుందన్నది నాటి లెక్క. ప్రస్తుతం భారతావని జనాభా 137 కోట్లకు చేరగా అందులో 67శాతం- అంటే 92 కోట్లమంది పీడీఎస్‌ పరిధిలో ఉండాలి. కానీ ఇప్పటికీ 81 కోట్లమందే పీడీఎస్‌ లబ్ధిదారులన్న కాకిలెక్కలు, దండిగా అనర్హులతో నిండిన రేషన్‌ జాబితాలు- కోట్లమంది అభాగ్యుల కడుపు కొడుతున్నాయి. ఎంచబోతే మంచమంతా కంతలే అన్నట్లున్న పీడీఎస్‌ శల్య పరీక్షకు ఇది సమయం కాదు.

ఆహార గోదాములు సుభిక్షంగా ఉంటేనే..

దేశవ్యాప్తంగా అయిదు లక్షల రేషన్‌ దుకాణాలకు ఏడాదిపాటు ఆహార ధాన్యాల సరఫరాకు తగినన్ని నిల్వలతో గోదాములు సుభిక్షంగా ఉన్నాయి. త్వరలో రబీ దిగుబడులూ అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిస్థితుల్లో యూపీ, దిల్లీ, కేరళ, రాజస్థాన్‌, కర్ణాటక, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు రోజు కూలీల వంటి శ్రమ జీవులకు ఉచిత రేషన్‌ ఇప్పటికే అందిస్తున్నాయి. వలసకూలీల బతుకు వెతల్ని గుర్తించిన సాధికార బృందం- సాధారణ పరిస్థితులు నెలకొనే దాకా రేషన్‌ కార్డు, వ్యక్తిగత గుర్తింపు కార్డు వంటి వాటితో పని లేకుండా అందరికీ ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా సాగించాలని సూచించినట్లు తెలుస్తోంది. ధాన్య రాశులతో గిడ్డంగులు పిగిలిపోతున్నా బ్రిటిషర్ల కాలంలో బెంగాల్‌ క్షామం 30 లక్షలమందిని పొట్టన పెట్టుకోవడానికి విధానపర వైఫల్యాలే కారణం. ఆ దయనీయ గతం పునరావృతం కాకుండా, కరోనాపై కదనంలో బడుగు జీవుల డొక్కలు మాడకుండా అందరికీ ఆహార భద్రత కల్పించడమే సముచితం, తక్షణావసరం!

ఇదీ చదవండి:నేతన్నల యాతన... వైరస్​ వ్యాప్తితో కష్టాలు!

ABOUT THE AUTHOR

...view details