తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా కాచుకుంది... తస్మాత్‌ జాగ్రత్త! - కొవిడ్ జాగ్రత్తలు

ప్రపంచదేశాలపై కరోనా మరోమారు మృత్యుపంజా విసురుతోంది. అగ్రరాజ్యంలో రెండు వారాలుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ ఉరవడి తగ్గిపోయిందన్న ధీమాతో విహార యాత్రలు ముమ్మరించగానే.. కరోనా మళ్ళీ కోర సాచింది. రెండున్నర లక్షల కేసులు రావడంతో బిత్తరపోయిన ఐరోపాలోని దేశాలన్నీ లాక్‌డౌన్లు, పలురకాల ఆంక్షలతో హడావుడి చేస్తున్నాయి. అప్రమత్తతే రక్షాకవచం అన్న విషయం మరిచి ఉపేక్షించడమే అనర్థదాయకమైంది.

eenadu editorial
కరోనా కాచుకుంది... తస్మాత్‌ జాగ్రత్త!

By

Published : Nov 3, 2020, 7:54 AM IST

మాటు వేసిన పులిలాంటి కరోనా మహమ్మారి ఉపశమించినట్లే కనిపించి, మరోమారు మృత్యుఘాతాలతో విరుచుకుపడుతుండటంతో అమెరికా ఐరోపాలు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నాలుగు కోట్ల 70 లక్షల కేసులు, 12 లక్షలు దాటిన మరణాలతో ‘శతాబ్దపు మహమ్మారి’గా ముద్రవేసిన కొవిడ్‌- శీతకాలంలో మరింతగా చెలరేగి పోతోంది. 95 లక్షలకు చేరువైన కేసులు, రెండు లక్షల 36 వేల పైచిలుకు మరణాలతో అగ్రరాజ్య హోదా నిలబెట్టుకొన్న అమెరికాలో- రెండు వారాలుగా పాతిక రాష్ట్రాలు కరోనా కేసుల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. నిర్ధారణ పరీక్షల్లో పెరుగుదల తొమ్మిదిశాతం ఉంటే, కేసుల పెరుగుదల 24 శాతంగా నమోదు కావడం- అమెరికాలో కరోనా విజృంభణ తీవ్రతకు తార్కాణం.

అప్రమత్తత మరచి...

ప్రపంచ జనాభాలో 10 శాతానికి ప్రాతినిధ్యం వహించే ఐరోపా- విశ్వవ్యాప్త కొవిడ్‌ కేసుల్లో 22 శాతానికి, మరణాల్లో 23 శాతానికి కేంద్రంగా మారి కుములుతోంది. ప్రపంచంలో తాజాగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం ఐరోపాలోనే ప్రజ్వరిల్లడం- కొవిడ్‌ పునర్‌ విజృంభణ ఎంత దారుణంగా ఉందో వెల్లడిస్తోంది. ఎప్పుడైతే కొవిడ్‌ ఉరవడి తగ్గిపోయిందన్న ధీమా ప్రబలి స్పెయిన్‌ లాంటి దేశాలకు విహార యాత్రలు ముమ్మరించాయో- కరోనా మళ్ళీ కోర సాచింది. ఒక్కరోజులోనే రెండున్నర లక్షల కేసులు రావడంతో బిత్తరపోయిన ఐరోపాలోని దేశాలన్నీ లాక్‌డౌన్లు, పలురకాల ఆంక్షలతో హడావుడి చేస్తున్నాయి. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, బెల్జియం, ఇటలీ, గ్రీస్‌, స్పెయిన్‌- ఇలా ఎన్నో దేశాలు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి వెంపర్లాడుతున్నాయి. కొవిడ్‌ పెనుముప్పు పొంచి ఉన్నప్పుడు సదా అప్రమత్తతే రక్షాకవచం కాగా, దాన్ని ఉపేక్షించడమే అనర్థదాయకమైంది!

శీతకాలంలో మరింతగా

మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశలో 1918 మార్చిలో వెలుగు చూసిన స్పానిష్‌ ఫ్లూ జూన్‌ నాటికి ఆస్ట్రేలియా, రష్యా, చైనా, ఇండియా, ఆఫ్రికా, జపాన్‌లతోపాటు దాదాపు ఐరోపా అంతటా వ్యాప్తి చెంది జులై నాటికి తగ్గుముఖం పట్టింది. యువకులు, నడివయస్కులపై అప్పట్లో పెద్దగా ప్రభావం చూపని మహమ్మారి సెప్టెంబర్‌లో తిరగబెట్టాక అక్షరాలా నరమేధం సృష్టించింది. కొత్త శతాబ్దపు మహమ్మారిగా పెను సవాలు రువ్వుతున్న కొవిడ్‌ ఎన్నిసార్లు తిరగబెడుతుందో తెలియకపోయినా- దాని నుంచి స్వీయ ప్రాణ రక్షణకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్న అవగాహన ఇప్పటికే అందరిలో పాదుకొంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతల తీవ్రతనూ తట్టుకొన్న వైరస్‌ శీతకాలంలో మరింతగా విజృంభిస్తోందని, వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నచోట్ల మరింతగా మృత్యుపాశాలు విసురుతోందని వైద్యులు, శాస్త్రవేత్తలు విస్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కోరలకు బలైనవారిలో 15 శాతం వాయు కాలుష్య బాధితులేనంటున్న అధ్యయనం ఇండియాలో ఆ సంఖ్య 17 శాతమంటోంది!

హెచ్చరికల్ని ఆలకించాలి

ప్రభుత్వాలు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన కీలక దశలోకి ప్రవేశించామన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల్ని ప్రతి ఒక్కరూ చెవిన పెట్టాల్సిన సమయమిది. శీతకాలంలో కొవిడ్‌ సృష్టించగల ఆరోగ్య ఆత్యయిక స్థితి దృష్ట్యా ముందు జాగ్రత్తగా లక్ష మెట్రిక్‌ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ దిగుమతికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. విపత్కర పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించగల వైద్యపర తోడ్పాటుకూ పరిమితులున్నాయని తేలినందున- ముందస్తు జాగ్రత్తల్ని ప్రతి ఒక్కరూ పౌరధర్మంగా పాటించడం తప్పనిసరి. క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పి.ఎం. 2.5 పరిమాణం ఒక్క మైక్రోగ్రామ్‌ పెరిగినా కొవిడ్‌ మరణాల రేటు ఎనిమిది శాతం విస్తరిస్తుందని హార్వర్డ్‌ పరిశోధన చాటుతోంది. మనకేం కాదన్న దిలాసా ప్రాణాంతకమని ఐరోపా అనుభవాలు చాటుతున్నందువల్ల మాస్కులు- చేతుల పరిశుభ్రత- మూడు గజాల దూరం నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటిస్తేనే పెనుముప్పు నుంచి తప్పించుకోగల వీలుంది!

ఇదీ చదవండి- కొవిడ్​ రికవరీల్లో భారత్​యే టాప్​.!

ABOUT THE AUTHOR

...view details