తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భరత భూమిలో అడుగంటిన నీరు! - water resources in india

అమెరికాలోని అతిపెద్ద రిజర్వాయర్‌ మీడ్‌ లేక్‌ సామర్థ్యానికి రెండింతల భూగర్భ జలరాశిని ఇండియా కోల్పోయింది. ప్రపంచ దేశాలు వాననీటిని జాగ్రత్తగా పదిలపరచుకుంటూ, వృథాను నివారించడానికి విశేష ప్రాముఖ్యమిస్తున్నాయి. మరిక్కడ? భవిష్యత్తులో మనదేశాన్ని నీటి గండం నుంచి తప్పించుకునేదెలా?

water scarcity in india govt plans to save water
భరత భూమిలో అడుగంటిన నీరు!

By

Published : Sep 4, 2020, 10:55 AM IST

భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చిన దరిమిలా సుమారు ఏడు దశాబ్దాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ ఆనకట్టలు నిర్మించారు. అంతటి శ్రమదమాదుల తరవాతా నేటికీ అధికశాతం పంటపొలాలు తడవడానికి, గ్రామాల్లో 85శాతం దాకా ప్రజానీకం గొంతు తడుపుకోవడానికి... భూగర్భ జలాలే దిక్కు. అంతగా వాటిపై ఆధారపడుతున్నప్పుడు పదిలంగా కాపాడుకుంటున్నారా అంటే, లేనేలేదు. ప్రపంచంలోనే అత్యల్పంగా కేవలం ఎనిమిదిశాతం వాననీటినే సంరక్షిస్తూ, మరోవైపు నిల్వల్ని ఎడాపెడా తోడేస్తున్న కారణంగా దేశంలో చాలాచోట్ల భూగర్భ జలాలు హరాయించుకుపోతున్నాయి.

నీరు ఇంకిపోతోంది..

2011తో పోలిస్తే 2025 సంవత్సరం నాటికి తలసరి నీటి లభ్యత 25శాతందాకా క్షీణిస్తుందని, తరవాతి పదేళ్లలో పరిస్థితి మరింత భయానకమవుతుందని అంచనా. ఈ దశలోనైనా సరైన దిద్దుబాటు చర్యలకు లోటు చేయకూడదంటున్న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తాజా నిర్దేశం అర్థవంతమైనది. పంచాయతీ, పురపాలక సంఘం, కార్పొరేషన్‌, అభివృద్ధి ప్రాధికార సంస్థ, జల్‌ నిగమ్‌, జల్‌ మండలి... పేరేదైనా- నీటి సరఫరాతో ముడివడిన ప్రతి సంస్థా వృథా నివారణలో పాలుపంచుకోవాలని జల్‌శక్తి శాఖ అభిలషిస్తోంది. జలాల వృథాను నివారించడంలో భాగంగా జరిమానాల ప్రతిపాదనా వినవస్తోంది. వాస్తవానికి, భూగర్భ జలాల్ని కలుషితం చేసినా దుర్వినియోగపరచినా కనీసం లక్ష రూపాయల జరిమానా, ఆరు నెలలనుంచి ఏడాదివరకు జైలుశిక్ష ప్రతిపాదనలతో మూడేళ్లక్రితమే ముసాయిదా సిద్ధమైంది. దేశంలోని 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో భూగర్భ జలాల పరిరక్షణ నిమిత్తం నిరుడు నవంబరులో స్థానిక సంస్థలకు మార్గదర్శకాలూ వెలువడ్డాయి. ముప్పు మరింత ముమ్మరించక మునుపే భూగర్భ జలాల సంరక్షణ, ప్రతి గ్రామానా జలనిధి ఏర్పాటే లక్ష్యంగా స్థానిక సంస్థల్ని రాష్ట్రాల్ని కూడగట్టి కేంద్రమే చురుగ్గా ముందడుగు వేయాలి!

తక్షణ చర్యలు అత్యవసరం..

‘వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా వినుతికెక్కిన రాజేంద్రసింగ్‌, దేశవ్యాప్తంగా 72శాతం మేర భూగర్భ జలాలు అడుగంటి పోయినట్లు మదింపు వేశారు. అమెరికాలోని అతిపెద్ద రిజర్వాయర్‌ మీడ్‌ లేక్‌ సామర్థ్యానికి రెండింతల భూగర్భ జలరాశిని ఇండియా కోల్పోయిందని తనవంతుగా 'నాసా' లెక్కకట్టింది. దేశంలో మూడు కోట్లకు పైగా బోరుబావుల ద్వారా విచ్చలవిడిగా నిల్వల్ని వెలికితీయడం తీవ్ర అనర్థదాయకమన్న మిహిర్‌ షా కమిటీ- తక్షణ దిద్దుబాటు చర్యలు అత్యావశ్యకమని నాలుగేళ్ల క్రితమే ఉద్బోధించింది. మొన్నటికి మొన్న మద్రాస్‌ హైకోర్టు అక్రమంగా భూగర్భ జలాల్ని తోడేస్తున్న ప్రైవేటు నీటి సరఫరా సంస్థలను మూసెయ్యాల్సిందిగా ఆదేశించాల్సి రావడం, ఎక్కడికక్కడ అవ్యవస్థ పెచ్చరిల్లుతున్నదనడానికి నిదర్శనం!

నీటిని ఒడిసిపట్టాలి..

ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాఫ్రికా, సింగపూర్‌ వంటివి వాననీటిని జాగ్రత్తగా పదిలపరచుకుంటూ, వృథాను నివారించడానికి విశేష ప్రాముఖ్యమిస్తున్నాయి. మరిక్కడ? ఇటీవలి వర్షాలూ వరదలను వెన్నంటి అపార జలరాశి ఉప్పు సముద్రం పాలయింది. ‘జల్‌శక్తి అభియాన్‌’ కింద ప్రతి పట్టణంలో ఒక్క నీటివనరు పునరుద్ధరణకైనా చర్యలు చేపట్టాలన్న మార్గనిర్దేశాలు నీరోడుతున్నాయి. తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదనడానికి తెలంగాణ అనుభవమే దృష్టాంతం.

చెరువులు, జలవనరులు, ప్రాజెక్టులకిచ్చిన విస్తృత ప్రాధాన్యం మూలాన ఈ ఏడాది మండువేసవిలో సైతం తెలంగాణలో భూగర్భ జలకళ ఉట్టిపడింది. ఇలా నీటిమట్టాలు పెరిగితే పరిసర ప్రాంతాల్లోనూ పంటసిరులు ఇనుమడిస్తాయన్నది అనుభవ సత్యం. సంప్రదాయ పంటల్లో వరి, చెరకు వంటి రకాల సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరం. తక్కువ నీటి వసతితోనే విరివిగా దిగుబడులనిచ్చే వంగడాల అభివృద్ధికి దేశంలో లెక్కకు మిక్కిలిగా పోగుపడిన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఇకనైనా నిబద్ధం కావాలి. కుంటలు, జలాశయాల పరిరక్షణలో పౌర సమాజం కీలక భాగస్వామ్యానికి; దుబారా నివారణ ఎంతటి ప్రాణావసరమో రేపటితరంలో స్పృహ రేకెత్తించేలా పాఠ్యాంశాల ప్రక్షాళనకు- ప్రభుత్వాలు నడుం కట్టాలి. జలసంరక్షణ జాతీయ అజెండాగా పట్టాలకు ఎక్కితేనే భూగర్భశోకం రూపుమాసేది!

ఇదీ చదవండి: భారత రోడ్లపై త్వరలోనే విద్యుత్​ కార్ల జోరు!

ABOUT THE AUTHOR

...view details