Russia Ukraine War: పసిపాపల నునులేత శరీరాలు నెత్తుటి ముద్దలవుతున్నాయి. పచ్చటి కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ ఆవేదనాభరితంగా స్పందించినట్లు, ఉక్రెయిన్‌లో కన్నీటి నదులు వరదలెత్తుతున్నాయి. ఇది అక్షరాలా నరమేధం.. మానవతా జ్యోతులను కసితీరా కొండెక్కించే కదన పిశాచి వికటాట్టహాసం! ఉక్రెయిన్, జార్జియా తదితర సోదర జాతులను అణచివేసే ఆధిపత్య భావజాలాన్ని 'మహా రష్యన్ దురహంకారం' (గ్రేట్ రష్యన్ షావెనిజం)గా సోవియట్ దిగ్గజ నేత లెనిన్ ఒకప్పుడు ఈసడించారు. తాను మరణించే వరకు దానిపై పోరాడతానని ప్రకటించారు. ఆ విష భుజంగానికి మళ్ళీ పాలుపోసిన పుతిన్- అతి జుగుప్సాకర యుద్ధ విధ్వంసానికి కారణభూతులయ్యారు. అణ్వస్త్ర తర్జనితో ప్రపంచాన్ని బెదిరిస్తూ, భీతావహ దాడులతో పొరుగు ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాలరాస్తున్నారు. వారికి తోడ్పాటునందించే పక్షాలను శత్రుసమానంగా భావించి భీకరంగా విరుచుకుపడతామంటూ ఆయన హుంకరిస్తున్నారు.
రష్యా జాతీయ సమగ్రతను ఉక్రెయిన్ ప్రశ్నించలేదు.. సమరోత్సాహాన్నీ ప్రదర్శించలేదు. బుడాపెస్ట్ మెమొరాండం ద్వారా తమ భద్రతకు మాస్కో ఇచ్చిన హామీ గాలిలో దీపమైన దరిమిలా ఆత్మరక్షణ కోసం నాటో కూటమిలో చేరాలని అది అభిలషించింది. అదే సాకుగా రష్యా ఆరంభించిన యుద్ధం- సుమారు 15 లక్షల అమాయక ఉక్రెయిన్ వాసులను అసహాయ శరణార్థులుగా మార్చింది. పదకొండు వందల మందికి పైగా సామాన్యులు సమరంలో సమిధలైనట్లు ఐరాస మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. వాస్తవానికి అంతకు ఎన్నో రెట్ల స్థాయిలో అక్కడ మారణహోమం సాగుతున్నట్లుగా వెలుగుచూస్తున్న కథనాలు దిగ్భ్రాంత పరుస్తున్నాయి. తనువెల్లా గాయాలైన బిడ్డలను గుండెలకు అదుముకుంటూ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న తల్లిదండ్రులు.. తరుముకొస్తున్న మోర్టార్ల పాలబడి నడిరోడ్లపై విగతజీవులవుతున్న సాధారణ పౌరుల దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తన పోరాటానికి స్వస్తిపలికి ఉక్రెయిన్ తమకు తలొగ్గితేనే యుద్ధం ఆగుతుందంటున్న పుతిన్ సామ్రాజ్యవాదం- తూర్పు ఐరోపా దేశాలకే కాదు, భవిష్యత్తులో యావత్తు ఖండానికీ అనర్థదాయకమే!