తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సభాపర్వంలో విలువల హననం- చీకటి దినం! - రాజ్యసభ ఎంపీలపై వేటు

రైతు ప్రయోజనాలపై ఎత్తిన కత్తిగా బిల్లుల్ని తూలనాడిన పక్షాలు వాటిని సమగ్ర సమీక్ష నిమిత్తం సెలక్ట్‌ కమిటీకి నివేదించాలని లేదా పక్కాగా ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుపట్టాయి. అంతలోనే పరిస్థితులు కట్టుతప్పి, మాన్య సభ్యుల వీరావేశ ప్రదర్శనలు జోరెత్తాయి. ఆ హడావుడిలోనే మూజువాణి ఓటుతో బిల్లులు నెగ్గాయన్న ప్రకటన మౌలిక సందేహాల్ని లేవనెత్తుతోంది. ఈ క్రమంలో ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసిన పరిణామాలు జరిగిన రోజు- ఎగువసభ చరిత్రలో చీకటి దినం!

parliament
సభాపర్వం

By

Published : Sep 22, 2020, 6:44 AM IST

పాతికేళ్లలో దాదాపు నాలుగు లక్షలమంది రైతుల బలవన్మరణాలు- దేశ వ్యవసాయ రంగం ఎంతటి దారుణ సంక్షోభంలో కూరుకుపోయిందో స్పష్టీకరిస్తున్నాయి. వ్యవసాయ ఆర్థికాన్ని సముద్ధరించి రైతుల శ్రేయానికి గొడుగు పట్టేందుకంటూ ఎన్‌డీఏ ప్రభుత్వం తెచ్చిన కీలక బిల్లులు- పంజాబు హరియాణాల్లో అన్నదాతల ఆగ్రహజ్వాలలకు, ఎగువ సభలో పెను అలజడికి కారణమయ్యాయి. వివాదాస్పద బిల్లులు లోక్‌సభలో సులభంగా నెగ్గినా, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన మంత్రి రాజీనామాతో పాలక కూటమిలో భేదాభిప్రాయాలు రచ్చకెక్కాయి. బీజేడీ, ఏఐఏడీఎమ్‌కే, తెరాస, తృణమూల్‌, అకాలీదళ్‌ వంటి పక్షాలు ఎన్‌డీఏ వ్యతిరేక శిబిరంగా గిరిగీసి నిలిచిన వాతావరణం- ఎగువ సభలో ఉద్విగ్నతల్ని పెంచింది.

రైతు ప్రయోజనాలపై ఎత్తిన కత్తిగా బిల్లుల్ని తూలనాడిన పక్షాలు వాటిని సమగ్ర సమీక్ష నిమిత్తం సెలక్ట్‌ కమిటీకి నివేదించాలని లేదా పక్కాగా ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుపట్టాయి. అంతలోనే పరిస్థితులు కట్టుతప్పి, మాన్య సభ్యుల వీరావేశ ప్రదర్శనలు జోరెత్తాయి. ఆ హడావుడిలోనే మూజువాణి ఓటుతో బిల్లులు నెగ్గాయన్న ప్రకటన మౌలిక సందేహాల్ని లేవనెత్తుతోంది. దేశ జనాభాలో సగానికి పైగా జనావళి జీవనాన్ని ప్రభావితం చేసే బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపి మూడు నెలల్లో నివేదిక రాబట్టి తప్పొప్పుల్ని తర్కించి మరింత మెరుగ్గా తీర్చిదిద్దే రాజమార్గాన్ని ఎన్‌డీఏ ఎందుకు వద్దనుకొంది? మరొకటి- ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్‌ నిర్వహించడంలో ఇబ్బందేమిటి? రాష్ట్రాల మండలిగా కొలువుతీరిన రాజ్యసభలో ఆయా రాష్ట్రాల వాణికి మన్నన కొరవడటం, తమ మాట పెడచెవిన పెడుతున్నారంటూ విపక్ష శిబిరం సభావిలువల్నే తోసిరాజని రెచ్చిపోవడం- రెండూ దురదృష్టకరం. ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసిన పరిణామాలు జరిగిన రోజు- ఎగువసభ చరిత్రలో చీకటి దినం!

ఎగువ సభ చర్చా వేదిక..

‘పార్లమెంటు అంటే శాసన నిర్మాణానికే కాదు, అది చర్చలకూ వేదిక. ఆ విషయంలో మనమంతా విలువైన సేవలు అందించాల్సి ఉంది’ అని 1952 మే నెల నాటి రాజ్యసభ తొలిభేటీలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉద్బోధించారు. ఉభయ సభలూ కలిస్తేనే భారత పార్లమెంటు అని పండిత నెహ్రూ తీర్మానించినా- అసలు పెద్దల సభ అవసరంపై రాజ్యాంగ నిర్ణయ సభలో పెద్ద చర్చే జరిగిందప్పుడు! లోక్‌సభలో పాలకపక్షం కొన్నిసార్లు కేవలం రాజకీయావసరాల కోసం చేసే శాసనాల్ని నిశితంగా పరిశీలించడానికి మరో సభ ఉపకరిస్తుందన్న వాదన నాడు బలంగా వినిపించింది. సమధిక సామర్థ్యం నైపుణ్యం గల వ్యక్తులు కొలువుతీరేందుకు ఉభయ సభల వ్యవస్థ అక్కరకొస్తుందని, దానివల్ల శాసన ప్రతిపాదనల్ని లోతుగా సమీక్షించడం సాధ్యపడుతుందన్న ఆశావహ దృక్పథానికి మన్నన దక్కి రాజ్యసభ ఆవిర్భవించింది. ‘సెగలు పొగలు కక్కే శాసనాల్ని చల్లార్చడానికి ఎగువసభ సాసర్‌ లాంటిది’ అన్న అమెరికా అధ్యక్ష దిగ్గజం జార్జి వాషింగ్టన్‌ మాట- పెద్దల సభ వ్యవహారసరళి ఎలా ఉండాలో వెల్లడిస్తోంది. సంయమన శీలం, సద్వివేచనలతో రాణకెక్కాల్సిన రాజ్యసభ- ఆవేశోద్రేకాల రంగస్థలిగా మారడం ఆలోచనాపరుల్ని కలచి వేస్తోంది.

పార్లమెంటరీ సత్‌ ప్రమాణాలకు ఎత్తుపీట వేస్తూ దేశవ్యాప్త చట్టసభలకు ఆదర్శంగా నిలవాల్సిన అత్యున్నత శాసన నిర్మాణ వేదికలు- పాలక ప్రతిపక్షాల దుందుడుకుతనంతో ఏం సందేశం ఇస్తున్నట్లు? మంచి చెయ్యడమే కాదు, మంచిగానూ చెయ్యాలన్నారు మహాత్మాగాంధీ. రైతుసంఘాలు మొదలు పలు రాష్ట్ర ప్రభుత్వాల దాకా బిల్లులపై ఎన్నో సందేహాలు వ్యక్తీకరిస్తున్నా- వాటిపై కూలంకష చర్చా సమీక్షలకు తావివ్వకుండా కేంద్రప్రభుత్వం ముందడుగేయడం బేసబబు. శాసన నిర్మాణానికే కాదు, కూలంకష చర్చలకూ పార్లమెంటు వేదిక అన్న మౌలిక స్పృహ కొడిగట్టిపోతే- భారత ప్రజాస్వామ్యం ఏంగాను?

ABOUT THE AUTHOR

...view details