తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చేయీచేయీ కలిపితేనే మహమ్మారిపై విజయం - భారత్​లో కరోనా

గడచిన వందేళ్లలో మనం కనీవినీ ఎరుగని ఘోర విపత్తు ఈ కరోనా వైరస్​. ఈ అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలి. యథాలాప వ్యవహారశైలిని వీడి.. కొవిడ్‌పై కలిసికట్టుగా పోరాడాలి. ఆరునూరైనా ఈ పోరులో మనం గెలుపొంది తీరాలి.

pandemic, corona
చేయీచేయీ కలిపితేనే మహమ్మారిపై విజయం

By

Published : May 7, 2021, 7:41 AM IST

ఇవాళ కొవిడ్‌ వ్యాధి ఒక పెను తుపానులా, సునామీలా మన జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. మానవ మనుగడకే సవాలు విసురుతోంది. గడచిన వందేళ్లలో మనం కనీవినీ ఎరుగని ఘోర విపత్తు ఇది. ఈ అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలి. యథాలాప వ్యవహారశైలిని వీడి కొవిడ్‌పై కలిసికట్టుగా పోరాడాలి. ఆరునూరైనా ఈ పోరులో మనం గెలుపొంది తీరాలి. మన మానసిక, భౌతిక శక్తులన్నీ కూడదీసుకుని చురుగ్గా కదనరంగంలోకి దిగాలి. మహమ్మారిని ఓడించాలనే దృఢ సంకల్పాన్ని అణువణువునా నింపుకోవాలి. కొవిడ్‌ మొదటి దశను మనం సమర్థంగా ఎదుర్కొన్నాం. పీపీఈ కిట్లు, శానిటైజర్లు, వెంటిలేటర్ల ఉత్పత్తిని ఎన్నో రెట్లు పెంచాం. అన్నింటినీ మించి టీకాల తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. మన వనరులు, సామర్థ్యాలను మోహరించి టీమిండియా మాదిరిగా ఏకతాటిపై కార్యోన్ముఖులమయ్యాం. వసుధైక కుటుంబకమనే ఆర్యోక్తిని పాటించి ఇతరుల మేలు కోసమూ పాటుపడ్డాం. ప్రపంచంలో పలు దేశాలకు కొవిడ్‌ టీకాలు, మందులు, ఇతర సామగ్రి అందించాం. మొదటి దశలో మనం ప్రదర్శించిన స్నేహ, సుహృద్భావాలు కొవిడ్‌ రెండో దశ విస్తృతి సందర్భంగా మనకు ఎంతో అక్కరకొస్తున్నాయి. అప్పట్లో మన సహాయ సహకారాలు పొందిన ప్రపంచ దేశాలు ఇప్పుడు తమవంతుగా ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులు, ఇతర సామగ్రిని పంపుతున్నాయి. కొవిడ్‌ చెలరేగుతున్న ఈ దశలో నిరాశా నిస్పృహలకు, పరస్పర నిందారోపణలకు తావు ఇవ్వరాదు. సంయమనాన్ని కోల్పోకూడదు.

నిర్విరామ కృషి

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న శత్రువు కంటికి కనబడని మహమ్మారి. మనుషులను నిర్వీర్యం చేస్తూ వేగంగా వ్యాపిస్తోంది. దీన్ని మన జీవితాల నుంచి పారదోలడానికి ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఈ సమరంలో విజయం సాధించడానికి మోదీ నాయకత్వంలో ప్రభుత్వం వివిధ వ్యూహాలను రచించి అమలు చేస్తోంది. ఆక్సిజన్‌ సరఫరాలను వేగంగా పెంచడానికి, రోగుల చికిత్సకు ఆస్పత్రుల సామర్థ్యాన్ని ఇనుమడింపజేయడానికి శతవిధాల కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగ పరిశ్రమలు, కార్పొరేట్‌ అధినేతలు, పౌర సంస్థలతో కలిసి కొవిడ్‌ బాధితుల ప్రాణాలు కాపాడటానికి కేంద్రం నిర్విరామ కృషి జరుపుతోంది. ఈ కొవిడ్‌ కాళరాత్రి అంతమై వెలుగు రేఖలు పొడసూపక మానవు. మనం స్థిమితం కోల్పోకుండా మహమ్మారిపై పోరాడుతూ ఉంటే ఆ రోజు రానే వస్తుంది. గడ్డు పరిస్థితుల్లో గట్టివాడే నిలిచి గెలుస్తాడు. కాబట్టి ప్రతికూల భావనలను దరిచేరనివ్వకుండా స్థిర చిత్తంతో పోరాడుతూ ముందుకెళ్లినప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది. అజేయ భారతీయ చైతన్యంతో మనం మొదటి దశ కొవిడ్‌ విజృంభణను తట్టుకుని గట్టెక్కాం. రెండో దశను కూడా అదే స్ఫూర్తితో అధిగమించాలి. గడచిన సంవత్సర కాలంగా మన వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బంది మొక్కవోని స్థైర్యంతో, నిరుపమాన దీక్షాదక్షతలతో కొవిడ్‌పై పోరాడుతున్నారు. రెండో దశలోనూ అదే ఊపు ప్రదర్శిస్తున్నారు. వారికి కావలసిన సాధన సంపత్తిని మనం ఎప్పటికప్పుడు అందించాలి. ఆక్సిజన్‌ సరఫరాలను, అత్యవసర మందులను నిత్యం అందుబాటులో ఉంచాలి. దీనికోసం జాతి యావత్తూ సమైక్యంగా ముందుకు కదులుతోంది. భారత స్టీల్‌ ప్రాధికార సంస్థ (సెయిల్‌) ఆక్సిజన్‌ ఉత్పత్తిని ఎన్నో రెట్లు పెంచడం దీనికి ఉదాహరణ. ఏప్రిల్‌ రెండో వారంలో 500 టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసిన సెయిల్‌ ఇప్పుడు రోజుకు 1100 టన్నులు ఉత్పత్తి చేస్తోంది. భారతీయ రైల్వే శాఖ 27 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ద్వారా 1,585 టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ను రవాణా చేస్తోంది.

సవాలు పెద్దదే...
ఊహకందని సంక్లిష్టతతో మనల్ని చుట్టుముట్టిన కొవిడ్‌ మహమ్మారిని మొక్కవోని స్థైర్యంతో ఎదుర్కోవలసిన తరుణమిది. వక్రీకరణలకు, వ్యర్థ విమర్శలు, నిందారోపణలకు సమయం కాదిది. సవాలు పెద్దదే కానీ, దాన్ని చూసి భీతిల్లరాదు. కొవిడ్‌ ప్రమాదాన్ని అధిగమించడానికి కావలసిన టీకాలు, సమర్థ వైద్య సిబ్బంది, రవాణా సౌకర్యాలు మనకున్నాయి. మన శక్తిని మనమే శంకించుకుంటూ కూర్చోకుండా కార్యసాధనలోకి దూకినట్లయితే కొవిడ్‌ కష్టనష్టాలను కనీస స్థాయికి తగ్గించవచ్చు, అమూల్య ప్రాణాలను కాపాడవచ్చు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయీకృతంగా సంక్షోభాన్ని అధిగమించడానికి సకలవిధాల కృషి చేస్తున్నారు. ఇది జాతీయ ఆరోగ్య విపత్తు కాబట్టి, దాన్ని అధిగమించడానికి జాతి యావత్తూ ముందుకు కదలాలి. అంతా ప్రభుత్వాల మీదనే వదలి వేయకుండా ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలో తాముంటూ, అవసరమైన సందర్భాల్లో చేయీచేయీ కలిపి పోరాడాలి. అన్ని ప్రభుత్వ విభాగాలు పరస్పర అనుసంధానతతో సమస్యను ఢీకొనాలి. మన లోపాలను మననం చేసుకుంటూ నిస్తేజితులం కాకుండా మన బలాల నుంచి అనుక్షణం స్ఫూర్తి పొందాలి. తప్పులెన్నుతూ కూర్చుంటే పని కాదు. నిపుణుల సలహాలు స్వీకరిస్తూ, కొవిడ్‌పై పోరాడే వైద్య సిబ్బంది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొంటూ సంక్షోభాన్ని అధిగమించే వ్యూహాలను రూపొందించి అమలు చేయాలి. వ్యక్తులు, సంస్థలు తమ నైపుణ్యాలను, అనుభవాన్ని మేళవించి కలిసికట్టుగా కొవిడ్‌ను జయించాలి. మన బంధుమిత్రులెవరైనా కొవిడ్‌ బారిన పడినా, ఆ వ్యాధి వల్ల మరణించినా విషాదంతో కుంగిపోవడం సహజం. అలాగని ఎల్లకాలం నిరాశావాదంలో, భయాందోళనల్లో కూరుకుపోవడం సరికాదు. అటువంటి ప్రతికూల భావనలను కలిగించే వార్తలు, వీడియోలను తలకెక్కించుకోకుండా సంక్షోభంపై పోరుకు సమాయత్తం కావాలి. తీవ్ర కష్టనష్టాల నుంచి బయటపడే సత్తా మనకుంది. కేవలం కొన్ని నెలల క్రితం, అంటే మొదటి దశ కొవిడ్‌ కేసులను తగ్గించడంలో మనం సఫలమైన సంగతిని గుర్తుకు తెచ్చుకొని, రెండో దశ అదుపునకు చొరవగా ముందుకు కదలాలి. కరోనా అదుపులో కృతకృత్యమైన ఇతర దేశాల నుంచి స్ఫూర్తి పొందాలి. చీకటి వెనుక వెలుగు ఉంటుందనే సత్యాన్ని నిరంతరం మదిలో నింపుకోవాలి.

సర్వవిధాల సమాయత్తం

ఇది పరీక్షా సమయం. తెలుగు పంచాంగం ప్రకారం గడచిన సంవత్సరం శార్వరి నామ సంవత్సరం. శార్వరి అంటే చీకటి అని అర్థం. ప్రస్తుత సంవత్సరం ప్లవ నామ సంవత్సరం. ప్లవ అంటే దాటించే పడవ అని అర్థం. కాబట్టి ఈ సంవత్సరం మనల్ని కొవిడ్‌ కష్టాల కడలి నుంచి దాటించే నావ అవుతుందని ఆశిద్దాం. 'కష్టాల కడలిలోనూ మనో స్థైర్యాన్ని కోల్పోకూడదు' అని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రబోధించారు. 'నీ గమ్యం చేరేంతవరకు విశ్రమించవద్దు, అకుంఠిత దీక్షతో ముందుకు కదులు' అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన ధైర్యాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలి. కొవిడ్‌ రెండో దశ తరవాత కూడా మరిన్ని విషమ దశలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని అధిగమించడానికి సర్వవిధాల సమాయత్తం కావాలి. టీకాలు వేయించుకొని, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ, మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ కొవిడ్‌ మహమ్మారిని పారదోలాలి.

-ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి:'ప్రధాని వైఫల్యంతోనే దేశంలో లాక్​డౌన్​ పరిస్థితులు'

ABOUT THE AUTHOR

...view details