ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి(వీసీ)గా ఆచార్య ఎ.ఎల్.నారాయణ ఉన్న సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1962లో విశాఖపట్నం సందర్శించారు. ముఖ్యమంత్రిని కలవడానికి వీసీ విమానాశ్రయానికి వెళ్ళారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి తనవైపు రావడం గమనించిన ముఖ్యమంత్రి వెంటనే తన కుర్చీలో నుంచి లేచి ఆయన దగ్గరకు వెళ్ళి మధ్యలోనే ఆపారు. 'మీరు ఇలా నన్ను కలవడానికి రావడం దౌత్య మర్యాదల (ప్రొటోకాల్) ప్రకారం విరుద్ధం. మిమ్మల్ని కలవడానికి మేమే విశ్వవిద్యాలయ కులపతి (గవర్నర్) అనుమతి తీసుకోవాలి' అన్నారు.
మరో సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పుడు- ప్రముఖ రచయిత, ఆలోచనాపరుడైన ఆచార్య కె.ఆర్.శ్రీనివాస అయ్యంగార్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి బాధ్యతల స్వీకరణకు ఆహ్వానించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఉపకులపతి నియామకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉండాలని- అప్పుడే ఉన్నత విద్యకు తగిన న్యాయం చేకూరుతుందని వ్యాఖ్యానించారు.
ఉపకులపతి పదవి ఎంత ఉన్నతమైందో, గౌరవప్రదమైందో ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తున్నాయి. మేధావులు, విద్యావేత్తలకు ఉపకులపతి పదవులు కట్టబెట్టడంద్వారా- విద్యార్థుల సామర్థ్యాన్నే కాకుండా, సమాజంలో మానవీయ విలువలనూ పెంచవచ్చుననేది నిర్వివాదాంశం.
రాజకీయాలకు అతీతంగా..
కొన్ని దశాబ్దాల క్రితం విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల్లో ప్రభుత్వాలు ఎన్నో విలువలను అనుసరించేవి. అధికారంలో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా విద్యావేత్తలను ఆదరించేవారు. రాజనీతిజ్ఞతతో వ్యవహరించేవారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన విద్యావేత్తలనే ఉపకులపతులుగా నియమించేవారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉపకులపతి హోదాలో అడుగు పెట్టినవారు సైతం తమ సొంత ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి- పదవిని విద్యాప్రమాణాల పెంపుదలకే వినియోగించేవారు. తమ హయాములో విశ్వవిద్యాలయ ఘనతను, ప్రతిష్ఠను మరింత పెంచే దిశగా కృషి చేసేవారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉప కులపతుల నియామకాల్లో పలు పెడధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియమాకాలు రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సుల మీదే ఆధారపడి ఉంటున్నాయి. కుల, మత సమీకరణలూ సర్వసాధారణమవుతున్నాయి. ఈ ధోరణులు ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినవి కాదు. దేశవ్యాప్తంగా ఉపకులపతుల నియామకాలు పలురకాల సమీకరణలతో కూడుకొని ఉంటున్నాయి. ఇది ముమ్మాటికీ జాతీయస్థాయి సమస్య.
అడ్డదారిలో వీసీలుగా..