ప్రపంచంలో పలు ప్రభుత్వాలు సొంత డిజిటల్ కరెన్సీని వెలువరించే సన్నాహాల్లో ఉండగా, ఈ విషయంలో భారతదేశం కొంత భిన్నమైన పంథాను అనుసరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త డిజిటల్ చెల్లింపు సాధనమైన ఇ-రుపీ సాధికార డిజిటల్ కరెన్సీ కానీ, క్రిప్టోకరెన్సీ కానీ కాదు. అది డెబిట్ కార్డో లేక ఇ-వ్యాలట్టో కాదు. క్రిప్టోకరెన్సీల మాదిరిగా తమ ఇష్టం వచ్చిన వస్తుసేవల కొనుగోలుకు, షేర్ల మాదిరిగా లాభం కోసం కొని అమ్మడానికి ఇ-రుపీ పనికిరాదు. అది కేవలం ప్రభుత్వ నిర్దేశిత సామాజిక సేవలు పొందడానికి మాత్రమే తోడ్పడుతుంది. బహుశా భవిష్యత్తులో భారతీయ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడానికి ఇ-రుపీ తొలి మెట్టు కావచ్చు. బ్యాంకు ఖాతాలు లేని 19 కోట్లమంది పేద ప్రజలకు ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ (డీబీటీ) చేయడానికి ఇ-ఓచర్లు ఉపకరిస్తాయి.
కొన్ని బ్యాంకులను ప్రభుత్వం ఇ-ఓచర్ల కార్యక్రమంలో భాగస్వాములుగా ఎంచుకొంది. సంక్షేమం కోసం ప్రభుత్వం చెల్లించే ధనం భాగస్వామ్య బ్యాంకుల నుంచి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ద్వారా ఇ-ఓచర్ రూపంలో నేరుగా లబ్ధిదారుడికి చేరుతుంది. అది లబ్ధిదారుడి మొబైల్ నంబరుకు క్యూఆర్ కోడ్ రూపంలోనో, ఎస్‌ఎంఎస్ రూపంలోనో అందుతుంది. ఆ క్యూఆర్ కోడ్ లేదా ఎస్‌ఎంఎస్‌ను విక్రయదారుకు చూపితే అతడు ఆ నంబర్లను స్కాన్ చేస్తాడు. లబ్ధిదారుడి ఫోన్ నంబరుకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని విక్రయదారుడికి చూపితే చెల్లింపు పూర్తవుతుంది. ఈ పద్ధతిలో ఇ-ఓచర్లను లబ్ధిదారు ప్రభుత్వం నిర్దేశించిన వస్తుసేవలు- అదీ సామాజిక సేవల కొనుగోలుకే ఉపయోగించాలి. ప్రస్తుతానికి కొవిడ్ టీకాలు వేసుకోవడానికి, మాతాశిశు సంక్షేమ పథకాల కింద పోషకాహారం కొనడానికి ఇ-ఓచర్లను ఉపయోగించవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా క్షయ నివారణ కార్యక్రమం కింద మందుల కొనుగోలుకు, ఆయుష్మాన్ భారత్ కింద రోగ నిర్ధారణ పరీక్షలకు, ఎరువుల సబ్సిడీలకు వీటిని వెచ్చించవచ్చు.
ప్రయోజనాలెన్నో!
వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఓచర్లు ఇచ్చే పద్ధతి అమెరికా, దక్షిణ కొరియాలతోపాటు పలు దేశాల్లో విజయవంతమైంది. అమెరికాలో విద్యార్థులకు చదువుకోవడానికి స్కూల్ ఓచర్లను ఇస్తున్నారు. వీటిని ఉపయోగించి వారు తమకు నచ్చిన ప్రభుత్వ లేదా ప్రైవేటు విద్యాసంస్థలు వేటిలోనైనా సరే చదువుకోవచ్చు. రేపు భారతదేశంలోనూ పేద విద్యార్థులకు ఇ-ఓచర్ వరప్రసాదంగా మారవచ్చు. కొవిడ్ వల్ల చదువులు అటకెక్కాయి. పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల ఉపాధి వ్యాపారాలు దెబ్బతినడంతో తమ పిల్లలను ఖరీదైన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదివించలేని దుస్థితిలోకి జారిపోయారు. అందుకే, ఇటీవల ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 13 కోట్లమంది వరకు విద్యార్థులు ఉన్నారు.
కొవిడ్ బెడద తొలగిపోయిన తరవాత ప్రభుత్వ పాఠశాలల మీద ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది. దీన్ని తగ్గించాలంటే సరసమైన ఫీజులకు చదువు చెప్పే బడ్జెట్ (ప్రైవేటు) పాఠశాలలను ప్రోత్సహించవలసి రావచ్చు. ఈ తరహా పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు నెలనెలా నిర్ణీత మొత్తాన్ని ఇ-ఓచర్ల రూపంలో చెల్లించవచ్చు. వాటిని ఆన్‌లైన్ తరగతుల కోసమో, ట్యూషన్ల కోసమో కూడా వినియోగించవచ్చు. కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయిస్తున్న దాదాపు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌లో కొంత భాగాన్ని ఇ-ఓచర్ల రూపంలో వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిలో పాల్గొనవచ్చు. విద్యాహక్కు చట్టం కింద కేటాయించే సీట్లకు ఇ-ఓచర్లలో చెల్లింపు జరగడమూ ప్రయోజనకరమే అవుతుంది. ఇది విద్యారంగ పురోగతికి తోడ్పడుతుంది. వైద్య రంగంలోనూ ఇ-ఓచర్లు గొప్ప మార్పు తీసుకురాగలవు.