కొవిడ్ పంజా దెబ్బకు విలవిలలాడుతున్న పేద దేశాల గోడును పట్టించుకోకుండా సంపన్న దేశాలు తమ బాగును తామే చూసుకుంటున్నాయి. యావత్ ఆఫ్రికా ఖండ జనాభాలో కొవిడ్ టీకాలు అందినవారు ఒక్క శాతంకన్నా తక్కువే అయినా సంపన్న దేశాలు తమ ఫార్మా కంపెనీల లాభాలే మిన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇతర దేశాలకు తమ టీకాలు అందించాలంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాలంటున్నాయి. తాము తయారు చేసిన అతి ఖరీదైన టీకాలు మాత్రమే సమర్థమైనవని, ఇతరుల టీకాలు బొత్తిగా వ్యర్థమని చెబుతున్నాయి. రష్యా, చైనాలు తయారు చేసిన కొవిడ్ టీకాలకు ఈ కారణంతోనే అమెరికా, ఐరోపా దేశాలు మోకాలడ్డుతున్నాయి. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) టీకాలు వేసుకున్న వారికి మాత్రమే తమ దేశంలో ప్రవేశించడానికి గ్రీన్ పాస్ వీసాలు ఇస్తామని అమెరికా స్పష్టం చేస్తోంది. ఐరోపా సమాఖ్య (ఈయూ) ఆస్ట్రాజెనెకాకు మొదట్లో వంకలు పెట్టినా తరవాత పంథా మార్చుకుని ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్నవారికి మాత్రమే గ్రీన్ పాస్‌లు మంజూరు చేస్తోంది. భారత ప్రభుత్వం గట్టిగా అభ్యంతరం చెప్పిన మీదట కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) టీకాకు తొమ్మిది ఐరోపా దేశాలు ఆమోదముద్ర వేశాయి. ఐరోపాలో ఒక్క ఎస్తోనియా దేశం మాత్రమే కొవాక్సిన్ టీకాలు వేసుకున్న వారికి గ్రీన్ పాస్ ఇస్తోంది. భారత్ సొంతంగా తయారు చేసిన కొవాక్సిన్‌కు అత్యవసర ప్రాతిపదికపై అనుమతి ఇవ్వడానికి అమెరికా నిరాకరించినా, పూర్తిస్థాయి ప్రయోగాలు ముగిశాక అనుమతి మంజూరు చేస్తామని పేర్కొంది. కొవాక్సిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి కోసం నిరీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
క్యూబా ఖ్యాతి
సంపన్న దేశాలు టీకా జాతీయవాదంతో, అమిత లాభాపేక్షతో వ్యాక్సిన్ అడ్డుగోడలు నిర్మిస్తున్నందువల్ల పలు వర్ధమాన దేశాలు సొంత వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. భారత్ మొత్తం నాలుగు సొంత టీకాలతో కొవిడ్‌పై సమరానికి సిద్ధమవుతోంది. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్ ఇప్పటికే వినియోగంలోకి రాగా, రెండో టీకా జైకోవ్-డికి అత్యవసర అనుమతి లభిస్తే రెండు నెలలలోపే ఉత్పత్తి ప్రారంభమవుతుంది. పుణేకి చెందిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ దేశంలోనే మొదటిసారిగా రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా క్లినికల్ ప్రయోగాలు జరుపుకొంటోంది. బయొలాజికల్ ఇ సంస్థ కోర్బివ్యాక్స్ టీకా ఆగస్టుకల్లా వినియోగంలోకి రావచ్చు. మరోవైపు అరవై ఏళ్లుగా అమెరికా ఆంక్షలతో చితికిపోయిన చిన్న దేశం క్యూబా స్వశక్తితో అయిదు టీకాలు రూపొందిస్తోంది. ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకాలు అందించే కొవ్యాక్స్ కార్యక్రమంలో చేరకుండా, మిత్రదేశాలైన రష్యా, చైనా టీకాలపై ఆధారపడకుండా స్వావలంబన సాధించింది. తన టీకాల్లో ఒకదానికి సాబెరానా-2 (సార్వభౌమ) అని పేరు పెట్టి తన ఆత్మనిర్భరతను చాటుకొంది. సాబెరానాపై మూడో దశ ప్రయోగాలు ముగియకముందే మే నెల నుంచి సార్వజన టీకా కార్యక్రమం ప్రారంభించింది. దీనికన్నా ముందు క్యూబా రూపొందించిన అబ్దాలా- దేశ టీకా కార్యక్రమంలో ప్రధాన భాగంగా ఉంది. ప్రొటీన్ టీకా అయిన అబ్దాలా 92 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని క్యూబా శాస్త్రజ్ఞులు ప్రకటించారు. క్యూబా.. దక్షిణ అమెరికా ఖండంలో మొట్టమొదటి కొవిడ్ టీకాను తయారు చేసిన దేశంగా ఖ్యాతికెక్కింది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం జనాభాకు టీకాలు వేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకొంది. ఈ టీకాల కొనుగోలుకు ఇతర దేశాలూ ముందుకొస్తున్నాయి. క్యూబా విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు కొవిడ్ టీకాల రూపకల్పనలో చురుగ్గా పాల్గొనడం వల్లే సొంత టీకాలు రూపుదిద్దుకున్నాయి.