ఎంత నిష్ఠ! ఎంత నిబద్ధత! ఎంత దీక్ష! ఎంత దక్షత! అసలే దేశ ప్రధాని పుట్టినరోజు. మరోవైపు కొవిడ్‌పై టీకాల(Covid Vaccination) సమరం! కొత్త చరిత్రకు అదే సరైన తరుణం. ఆరు నూరైనా ఏకబిగిన లక్షల టీకాలు పొడిచేయాల్సిందే. వ్యాక్సిన్లలో కొత్త రికార్డులను(Vaccination Record in India) రీఫిల్ లేని పెన్నుతో లిఖించాల్సిందే. ఆ లక్ష్య సాధనలో మేలిమి ఇనుముతో పోతపోసిన టీకా కంకణాలు ధరించినట్లున్నారు మధ్యప్రదేశ్ అధికారులు. నాలుగు నెలల కిందటే నేల మీద నుంచి నిష్క్రమించిన అభాగ్యురాలికీ సెప్టెంబరు 17న రెండో డోసు ఇచ్చేశారు! మొన్నటి మార్చిలోనే ఆమె మొదటి డోసు తీసుకున్నారు. అయినా వైరస్ వికృత కేళి ఆడింది. అయితే మాత్రం, రెండు విడతలూ పడకుండా కీర్తిశేషురాలైతే దేశానికి ఎంత అప్రతిష్ఠ.. టీకా 'మేళా'కు ఎంత నామర్దా!! అందుకే, మరణించినా కరుణించి మరీ టీకా లెక్కల్లో ఆమె పేరునీ ఎక్కించేశారు. ఆ విధంగా ఆమె పవిత్రాత్మకు కాస్తంత సంతృప్తి చేకూర్చాలని అనుకున్నారు కామోసు. ఈ విషయంలో అధికార యంత్రాంగం విశాలహృదయాన్ని కీర్తించడం మానవ మాత్రులకు కుదరని పని. స్వయంగా గంధర్వులే దివి నుంచి దిగివచ్చి స్తుతిగీతాలను వల్లెవేస్తూ అధికారుల దయామయ హస్తాలను వాడేసిన వ్యాక్సిన్ బాటిళ్లతో అర్చించాల్సిందే!
అదేంటోగానీ, చెలరేగడం మొదలుపెడితే ఒకటీ అరాతో ఆగిపోదు మన అధికార యంత్రాంగం. మొన్నటి వ్యాక్సిన్ 'మేళా'లోనే టీకా కేంద్రం వైపు కన్నెత్తి చూడని వారికీ వ్యాక్సిన్ భాగ్యం దక్కింది. సెల్‌ఫోన్లకు ఆ శుభవార్తలు శుభాకాంక్షలతో వెళ్ళిపోయాయి కూడా. ఆ మేరకు ధ్రువపత్రాలూ సిద్ధమయ్యాయి. అసలు పరీక్షే రాయకుండా ఇలా పాసైపోవడమంటే మాటలా? సూది పడకుండానే సర్టిఫికెట్ చేతుల్లోకి చేరడమంటే అంత తేలికా! ఇదంతా వదిలేసి, ప్రధాని పుట్టినరోజునాటి రెండున్నర కోట్ల వ్యాక్సిన్ రికార్డు తప్పుల తడక అంటూ మూతి తిప్పుతారా పాత్రికేయులు! ఏదో అధికారుల 'దయ' వల్ల ఇలాంటి 'ఘనత'లు మన భూగోళం మీద, అదీ పవిత్ర ధాత్రి భారతంలో తరచూ ఆవిష్కృతం అవుతుంటాయి. వాటిని చూసి మురిసిపోవడమా, మూర్ఛిల్లడమా అన్నది జనం మన ప్రజాస్వామ్యాన్ని అర్థంచేసుకున్న తీరును బట్టి ఉంటుందంతే! ఆమాత్రం దానికి అంత రాద్ధాంతం చేయాలా? అన్నట్లూ, ఇప్పటిదాకా దేశంలో పద్దెనిమిదేళ్లు దాటని వారికి టీకాలే మొదలవలేదా, ఈ ఏడాది జూన్‌లోనే ఆ ఘట్టాన్ని ఆవిష్కరించేసింది మధ్యప్రదేశ్ రాష్ట్రం! అయినా, టీకాలదేముందీ.. ఎవరో ఒకరు కనిపెడతారు. విడ్డూరాలను వండి వార్చడం అంత తేలికా! ఆ విషయంలో ఆది నుంచీ మన అధికారులు లెక్కలేనన్ని పీహెచ్‌డీలతో దూసుకుపోతూనే ఉన్నారు. వింతలు మరీ ఎక్కువైతే దిష్టి తగులుతుంది కదా! అందుకే, 'సాంకేతిక లోపం' అని తమ ఘనతను తగ్గించుకోవడానికీ వెనకాడరు. వాళ్ల త్యాగం ముందు శిబి, దధీచి వంటి వారూ చిన్నబోవాల్సిందే!
అయినా, ఎలుక లేకుండా కలుగు ఉంటుందా? నిప్పు లేకుండా పొగ వస్తుందా? అధికారులు ఎన్ని వింతలు 'రుచి' చూపించినా, అందులో నేతల వాటా వారిదే! శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు, ప్రజాప్రతినిధుల 'ప్రోద్బలం' లేకుండా అధికార యంత్రాంగం ఒక్క అడుగైనా ముందుకేయగలదా? 'అధికారులు ఉన్నదే మా చెప్పులు మోయడానికి. వాళ్లను మా అవసరాలకోసం వాడుకుంటాం' అని ఆమూలాగ్రం రాజకీయాల్ని ఆఘ్రాణించిన ఉమాభారతి ఈ మధ్యనే సెలవిచ్చారు. 'వాళ్లకు పోస్టింగులు, జీతాలు, ప్రమోషన్లు.. అన్నీ మా దయ' అంటూ బహిరంగ రహస్యాన్ని బాహాటంగా బయటపెట్టారు. నేతలు ఆదేశిస్తారు. అధికారులు ఆచరిస్తారు. కాకుంటే, సిరాబుడ్డి తీసుకురా అంటే మొహమంతా పులుముకొన్నట్లు ఉంటుంది వ్యవహారం. అదే మన ప్రారబ్ధం. అయినా ఏడిస్తే బాగోదు.. రోదించీ రవ్వంతైనా ప్రయోజనం లేదు! అన్నట్టూ ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలన్నా 'టీకా సర్టిఫికెట్టు' అడుగుతున్నారు. దేశంలో నకిలీ వ్యాక్సిన్, ధ్రువపత్రాల లీలలు ఇప్పటికే భారీగా గుప్పుమంటున్నాయి. వ్యాక్సిన్ల 'రికార్డుల్లో' తలమునకలైన అధికారులకు వాటిని పట్టించుకొనే తీరికా, అవసరం ఎక్కడివీ! బ్రిటన్ ఏమో మీ టీకాలు ఓకే, ధ్రువపత్రాలే డౌటు అంటూ కూనిరాగాలు తీస్తోంది. ఆ ఒక్కదేశం కాదంటే మాత్రం పోయేదేమిటట! ఇంకా ఎన్ని లేవనీ. ఉత్తిపుణ్యానికే టీకా ధ్రువపత్రం దరి చేరడమే పెద్ద వరం. అందుకు ఇతోధికంగా 'శ్రమపడుతున్న' అధికారులు, ప్రజాప్రతినిధుల 'సేవాబంధం' కలకాలం వర్ధిల్లుతుంటే, అది చూసి ఆనందించే శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థించేద్దాం. ఏమంటారూ!