ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(uttar pradesh election 2022) దగ్గరపడుతున్నాయి. ముందస్తు సర్వేల ఫలితాలూ వస్తున్నాయి. దాంతో మళ్ళీ ఆ రాష్ట్రంలో విగ్రహ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. వివిధ సామాజికవర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు విగ్రహాలను నెలకొల్పడంపై పార్టీలు దృష్టిపెట్టాయి. ఇన్నాళ్లూ బ్రాహ్మణులను భాజపా నిర్లక్ష్యం చేసిందన్న వాదన ఉండటంతో, ఆ నష్టాన్ని పూరించుకోవడానికి బ్రాహ్మణుల ప్రతినిధిగా భావించే పరశురాముడి విగ్రహాలను ఇబ్బడి ముబ్బడిగా ఆ పార్టీ నెలకొల్పుతోంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో 16 అడుగుల పరశురాముడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లోనూ ఈ విగ్రహాలు(uttar pradesh statue politics) ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు భాజపా నాయకుడు, బ్రాహ్మణ సమాజ్ ఉత్థాన్ సేవా సంస్థాన్ జాతీయాధ్యక్షుడు శ్యాంప్రకాష్ ద్వివేది పేర్కొన్నారు.
అఖిలేశ్ ధీమా..
యూపీలో విగ్రహాల సంస్కృతి గతంలోనూ కనిపించింది. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాన్షీరాం విగ్రహాలతో పాటు ఏనుగు బొమ్మలు, స్వయంగా తన నిలువెత్తు విగ్రహాలనూ(mayawati statue) ప్రజాధనంతో ఏర్పాటు చేయడం వివాదాలకు దారితీసింది. అది చివరకు సుప్రీంకోర్టుదాకా వెళ్ళింది. ప్రజాభిప్రాయం మేరకే వాటిని ఏర్పాటుచేశామని మాయావతి పేర్కొన్నారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సర్దార్ పటేల్, ఎన్.టి.రామారావు, జయలలితల విగ్రహాలను ప్రజాధనంతోనే ఏర్పాటుచేయించారని, దళిత నాయకురాలైన తన విగ్రహాల విషయంలోనే ఎందుకు రాద్ధాంతం జరుగుతోందని ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో గళం వినిపించారు. ఏనుగుల బొమ్మలు కేవలం శిల్పశాస్త్రానికి సంబంధించినవే తప్ప తమ పార్టీ గుర్తుగా భావించలేమని వాదించారు.
భాజపాకు పోటీగా సమాజ్‌వాదీ పార్టీ(samajwadi party) సైతం లఖ్‌నవూలోని జనేశ్వర్ మిశ్రా పార్కులో 108 అడుగుల ఎత్తయిన పరశురాముడి విగ్రహం ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. సరిగ్గా 2022 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే యోచనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఇక నిషాద్ పార్టీలు ఫూలన్‌దేవి విగ్రహాన్ని గోరఖ్‌పుర్‌లో పెట్టించాలని డిమాండు చేస్తున్నాయి. తాము ప్రతి నిషాద్ ఇంటికీ ఫూలన్‌దేవి విగ్రహాలను సరఫరా చేస్తామని తొలిసారిగా యూపీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చెబుతోంది. పేదలు, బడుగువర్గాల కోసమే ఫూలన్‌దేవి కృషిచేశారని, ఆమెకు తాము తగిన గౌరవాన్ని కల్పిస్తామని వీఐపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి:'మోదీ మళ్లీ పీఎం అవ్వాలంటే.. యోగి సీఎం కావాల్సిందే'
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (up assembly election 2022 date) ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్, భాజపా స్పష్టం చేశాయి. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా సాగిన పరిపాలన, అభివృద్ధి తమను ముందుకు నడిపిస్తాయన్న విశ్వాసాన్ని భాజపా వ్యక్తం చేస్తోంది. రైతుల ఆందోళన తమకు సానుకూలంగా ఉంటుందని భావించి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా కొంత చురుగ్గా కదిలినా- ఇప్పుడు రైతు చట్టాల రద్దు దరిమిలా వారి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. గతంలో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసినా హస్తం పార్టీకి ప్రయోజనం దక్కలేదు. ప్రస్తుతం ముందునుంచే జనంలో కలిసిపోతూ, అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అధికారంలోకి రాగలమన్న నమ్మకం కాంగ్రెస్ అగ్రనేతలకు లేకపోయినా.. ఈసారి కొన్ని స్థానాలైనా సాధించి, తమ ఉనికిని చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.