తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నేర రాజకీయాల కంచుకోటలో రామరాజ్యం ఎప్పుడు? - నేర రాజకీయాల కంచుకోట

కరడుగట్టిన నేరగాళ్లు పూర్తిగా అంతమయ్యేదాకా యూపీలో ఎన్​కౌంటర్​లు కొనసాగుతూనే ఉంటాయని గతంలో ఆ రాష్ట్ర సీఎం ప్రకటించారు. నేరగాళ్ల ఏరివేతకు ఎదురుకాల్పులే పరిష్కార మార్గమనే ప్రశ్నలు ప్రజల్లో తట్టాయి. 30 ఏళ్ల నేర చరిత్రలో రాటుదేలిన వికాస్​ దుబే- పట్టుబడ్డ ఒక్కరోజులోనే హతమయ్యాడు. దుబే ఎదుగుదలకు సాయపడిన సత్యాలన్నీ ఎప్పుడో అంతమైపోయాయి. ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాల్లో ఘరానా నేరగాళ్ల సృష్టి, స్థితి, లయకారులు- పార్టీలు, పోలీసులేనన్న నిజాలు మాత్రం అనునిత్యం భయానక పరిస్థితుల్ని నెలకొల్పుతూనే ఉన్నాయి.

Criminal politics in UP
నేర రాజకీయాల కంచుకోటగా ఉత్తర్​ప్రదేశ్​

By

Published : Jul 12, 2020, 8:51 AM IST

కరడు కట్టిన నేరగాళ్లు కనుమరుగయ్యేదాకా ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఎదురుకాల్పులు (ఎన్‌కౌంటర్లు) జరుగుతూనే ఉంటాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రెండేళ్ల క్రితమే చట్టసభలో ప్రకటించారు. దుష్టశక్తుల్ని మట్టగిస్తేనే రామరాజ్యం స్థాపించగలమని సర్కారు విధానాన్ని ఉపముఖ్యమంత్రి గట్టిగా సమర్థించుకొన్నారు. రామరాజ్యం రూపురేఖా విలాసాలు నేతాగణాల భాషణల్లో తప్ప కంటికి కనిపించేవి కావు. నేరగాళ్ల ఏరివేతకు ఎన్‌కౌంటర్లే ఏకైక పరిష్కారమన్న ఏలికల ఆలోచనా ధోరణి- చట్టబద్ధ పాలనకు చాపచుట్టేసి, సమాధానాలు దొరకని ప్రశ్నలు ఎన్నింటినో దేశ ప్రజల ముందు ఉంచిందిప్పుడు! మూడు దశాబ్దాల నేరచరిత్రలో రాటుతేలిన వికాస్‌ దుబే- పట్టుబడిన ఇరవై నాలుగ్గంటల్లోనే ఎన్‌కౌంటర్లో హతమారిపోగా, అతగాడి ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డ పెద్ద తలకాయల తాలూకు నిజాలన్నీ భూస్థాపితమైపోయాయి. యూపీ రాజకీయాల్లో ఘరానా నేరగాళ్ల సృష్టి, స్థితి, లయకారులు- పార్టీలు, పోలీసులేనన్న సత్యం మాత్రం అనునిత్యం భీతి గొలుపుతూనే ఉంటుంది!

అక్కడే ఎన్​కౌంటర్​..

కాన్పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని బిక్రు గ్రామం వికాస్‌ దుబే కార్యక్షేత్రం. తన అడ్డాలో కాలు మోపే దమ్ము మిలిటరీకి మాత్రమే ఉందనేంతగా దుబే రాటుతేలడానికి పుణ్యం కట్టుకొంది అక్కడి రాజకీయ వాతావరణం! తనను అరెస్టు చెయ్యడానికి వస్తున్న పోలీసులపై దుబే ముఠా వ్యూహాత్మకంగా దాడి చేసి ఎనిమిది మంది రక్షకభటుల్ని అమానుషంగా వధించింది. పర్యవసానాల తీవ్రత తెలిసిన దుబే రాత్రికి రాత్రి పలాయనం చిత్తగించినా- ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో పట్టుబడే నాటికే అతగాడి అనుచరులు ఆరుగురు 'ఎన్‌కౌంటర్‌' అయిపోయారు. 'పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు దుబే రేపు ప్రయత్నించవచ్ఛు.. ఎదురుకాల్పుల్లో అతడి కథ సమాప్తం కావచ్చు' అంటూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ముందే భవిష్యత్‌ దర్శనం చేశారు. ఆ ప్రమాదాన్ని నిలువరించాలంటూ సుప్రీంకోర్టును మరొకరు ఆశ్రయించారు! తన బిడ్డ ఎన్‌కౌంటర్‌ కాకుండా అరెస్టు అయ్యాడని దుబే తల్లి సంతోషించినంతసేపు పట్టలేదు- పోలీసు తుపాకీ తన పని తాను చేసుకుపోవడానికి! దుబేను చట్ట ప్రకారం విచారిస్తే- అతగాడి నేరసామ్రాజ్యానికి రాళ్లెత్తిన రాజకీయ, పోలీసు గణాల ముసుగులు తొలగేవి!

నేరగాళ్లే న్యాయం చెప్పేలా..

నేరన్యాయ వ్యవస్థ చచ్చుపడిన చోటల్లా నేరగాళ్లే న్యాయం చెప్పే దురవస్థ రాజ్యమేలుతుంది. ఎనభయ్యో దశకం మధ్యలో హరిశంకర్‌ తివారి, వీరేంద్ర ప్రతాప్‌షాహి అనేవాళ్లు జైలునుంచే స్వతంత్రులుగా పోటీ చేసి, కాంగ్రెస్‌ లోపాయికారీ మద్దతుతో విధానసభకు ఎన్నికయ్యారు. అనంతర కాలంలో షాహి ప్రత్యర్థుల కాల్పుల్లో చనిపోగా, తివారీ వివిధ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు వెలగబెట్టాడు! అప్పటిదాకా పరారీలో ఉన్న నేరగాడు రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ 1998లో కల్యాణ్‌ సింగ్‌ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్లో ప్రత్యక్షమయ్యాడంటే- ఏమనుకోవాలి?

లైసెన్స్​ రద్దే కాలేదు..

2003లో ములాయం సర్కారులోనూ అతగాడు మంత్రే! నేరం- రాజకీయం కలిసి లిఖించిన రక్తచరిత్రలో వికాస్‌ దుబే లాంటివాళ్లు ధారాళంగా పుట్టుకొచ్చారు. 2001లో భాజపా నేత, సహాయమంత్రి హోదా కల సంతోష్‌ శుక్లాను తరిమి తరిమి పట్టపగలు శివ్లీ పోలీసు ఠాణాలో దుబే కాల్చి చంపాడు. ప్రత్యక్ష సాక్షులైన పాతికమంది పోలీసులు తమకేం తెలియదని మాట ఫిరాయించడంతో దుబేపై ఈగైనా వాలలేదు. అంతకంటే విచిత్రం ఏమిటంటే- ఆనాడు హత్యకు దుబే ఉపయోగించాడన్న రైఫిల్‌లైసెన్సు ఈనాటి దాకా రద్దు కానే లేదు! పోలీసులు రాజకీయ నాయకుల దన్ను దండిగా గల దుబే మీద 62 కేసులున్నాయి. అందులో అయిదు హత్యకు సంబంధించినవి, ఎనిమిది హత్యాయత్నాలు! ఇంత నేర చరిత్ర ఉన్నా- రాష్ట్రంలోని పేరుమోసిన పాతికమంది నేరగాళ్ల జాబితాలో దుబే పేరు లేనే లేదు!

పెద్ద నెట్​వర్క్​

చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్లలోని యావన్మంది సిబ్బందితోనూ సత్‌ సంబంధాలు గల దుబే- తనకు వ్యతిరేకంగా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కనిపెట్టగల నెట్‌వర్క్‌ ఏర్పరచుకొన్నాడు. దుబే ముఠా ఘాతుకంలో కడతేరిపోయిన దేవేంద్ర మిశ్రా అనే డీఎస్పీ- మొన్న మార్చి నెలలోనే ఠాణా అధికారి వినయ్‌ తివారి ఆ నేరగాడికి తొత్తుగా వ్యవహరిస్తున్నట్లు పై అధికారులకు నివేదిక పంపారు. దానిపై చర్య తీసుకొన్న నాథుడు లేడు. బిక్రూ గ్రామస్థుడు చేసిన ఫిర్యాదు పట్టుకొని డీఎస్పీ మిశ్రా అరెస్టు చెయ్యడానికి వస్తున్నట్లు దుబేకు పోలీస్‌ఠాణా నుంచే ఉప్పు అందింది. దుబే గ్యాంగ్‌ నరమేధం సాగిపోయాక ఆ ఠాణాకు చెందిన యావన్మందిపైనా వేటు వేసిన ప్రభుత్వం- పనిలో పనిగా ముఠా సభ్యుల ఏరివేతను నిష్ఠగా చేపట్టింది. కడకు దుబేనూ కడతేర్చి మీసం మెలేస్తున్న రాజ్య వ్యవస్థ- ఆ తరహా నేరగాళ్ల మోచేతి నీళ్లు తాగి ఎదిగిన ఎంతో మంది జాతకాలు బయటపడకుండా తెర వేసేసింది!

బూటకపు ఎన్​కౌంటర్​లతో..

కంటికి కన్ను అన్న ఆటవిక సిద్ధాంతాన్ని పాటిస్తే లోకమే గుడ్డిదవుతుందన్నారు మహాత్మాగాంథీ. ముంబయి ముట్టడిలో పాల్గొన్న ‘నరహంతక యంత్రం’ కసబ్‌ను సైతం చట్టబద్ధంగానే విచారించి ఉరికొయ్యకు వేలాడదీసిన దేశం మనది. కోర్టుల్లో న్యాయం మరీచికను తలపిస్తుంటే తక్షణ సాంత్వన కల్పించే నేరగాళ్ల శరణు కోరే వైపరీత్యం- ఎక్కడికక్కడ దాదాలకు, సాయుధ గూండాలకు ప్రాచుర్యం, ప్రాబల్యం సంపాదించి పెడుతోంది. సంకుచిత రాజకీయ అవసరాల కోసం వాళ్ల ముందు సాగిలపడే పార్టీల దివాలాకోరుతనం దుబేలాంటి నేరగాళ్లకు కోరలు, కొమ్ములు మొలిపిస్తోంది. రాజకీయ బలిమి గల నేరగాళ్లు- పోలీసు యంత్రాంగానికి అతిథి దేవుళ్లు! సాగినంత కాలం అంతా సవ్యంగానే ఉన్నా- పోలీసులపైనే తూటాలు వర్షించే ఉన్మాదం జడలు విప్పేసరికి- నోరువిప్పే అవకాశం లేకుండా నేరగాణ్ని ‘తప్పించడం’ చారిత్రక అవసరంగా మారుతోంది. నేరగ్రస్త రాజకీయ కంచుకోట బద్దలు కొట్టకుండా దుబే లాంటి నేరగాడి ఏరివేతతో సమాజంలో శాంతి భద్రంగా ఉంటుందా? యూపీ లాంటి రాష్ట్రంలో బూటకపు ఎన్‌కౌంటర్లతో రామరాజ్యం పరిఢవిల్లుతుందా?

ఇదీ చదవండి:వికాస్​ దుబే కుటుంబంపై మనీలాండరింగ్​ కేసు!

ABOUT THE AUTHOR

...view details