తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఎవరి వ్యూహాలు వారివి.. అమెరికా- తాలిబన్ల చర్చలు - talibans latest news

నవంబర్‌లో జరిగే అమెరికా ఎన్నికలు దగ్గరపడేకొద్దీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ ప్రచారాస్త్రాలకు పదునుపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇచ్చిన మాటను కొంతమేరకు నిలబెట్టుకున్నా, మరో అవకాశం ఇవ్వండి పని పూర్తిచేసి చూపిస్తానని ఓటర్లను అడగనున్నారు. ఫలితంగా అఫ్గాన్‌ ప్రభుత్వం బిక్కుబిక్కుమంటూనే తాలిబన్లతో చర్చలకు సిద్ధపడింది.

us talks with talibans
ఎవరి వ్యూహాలు వారివి అమెరికా..తాలిబన్ల చర్చలు

By

Published : Sep 21, 2020, 9:05 AM IST

న్యూయార్క్‌లోని వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి 19 ఏళ్లు పూర్తయిన మర్నాడే అఫ్గాన్‌ శాంతిచర్చలు మరో మెట్టు పైకెక్కాయి. ముగ్గురు అమెరికా అధ్యక్షులను చూసిన అఫ్గాన్‌ యుద్ధం- దాదాపు ముగింపు దశకు చేరుకుంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ట్రంప్‌ ప్రచారాస్త్రాలకు పదునుపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇచ్చిన మాటను కొంతమేరకు నిలబెట్టుకున్నా, మరో అవకాశం ఇవ్వండి పని పూర్తిచేసి చూపిస్తానని ఓటర్లను అడగనున్నారు. ఫలితంగా అఫ్గాన్‌ ప్రభుత్వం బిక్కుబిక్కుమంటూనే చర్చలకు సిద్ధపడింది.

తగ్గుముఖం పట్టని హింస

వాస్తవానికి యూఎస్‌-తాలిబన్‌ ఒప్పందం ప్రకారం ఈ చర్చలు మార్చిలోనే మొదలుకావాల్సి ఉంది. 400మంది కరడుగట్టిన తాలిబన్ల విడుదల విషయంలో అఫ్గాన్‌ ప్రభుత్వం కఠిన వైఖరి వల్ల జాప్యం తప్పలేదు. అమెరికా ఒత్తిడితో అంతిమంగా విడుదలకు ఆమోదముద్ర వేసింది. తాలిబన్ల విడుదలపై ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా వంటి అమెరికా మిత్రదేశాలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. సోవియట్‌ ఆక్రమణ నాటినుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా అక్కడ శాంతి కరవైంది. అమెరికా రక్షణ శాఖలోని ‘కాస్ట్‌ ఆఫ్‌ వార్‌’ ప్రాజెక్టు లెక్కల ప్రకారం 2001 నుంచి 2019 వరకు పౌరులు, సంకీర్ణ సేనలు, తాలిబన్లు లక్షా యాభైవేలమందికి పైగా మృతి చెందారు. అమెరికాకు 97 వేల కోట్ల డాలర్లకు పైగా వ్యయమైంది. ఒక్క 2019లోనే 7,423 బాంబులను ప్రయోగించినట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ లెక్కలు చెబుతున్నాయి.

అఫ్గాన్‌లో 90శాతానికి పైగా ప్రజల రోజువారీ సంపాదన రెండు డాలర్ల కంటే తక్కువ. ఈ నేపథ్యంలో తాలిబన్లు హింసకు స్వస్తిపలికి, చర్చలకు వస్తే రాబోయే ఫలితాలు దేశ ప్రయోజనాలను ప్రతిబింబించేవి. చర్చలకు ముందు తాలిబన్ల ప్రకటనల్లో ఎక్కడా కాల్పుల విరమణ అనే పదమే కనిపించలేదు. చర్చలకు రెండు రోజుల ముందు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌పైనే రెండోసారి హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనతోనే చర్చలు నిలిచిపోతాయని భావించినా ఎవరి అవసరాలు వారికి ఉండటంతో అవి సాకారమయ్యాయి.

అఫ్గాన్‌లో చర్చల ద్వారా అమెరికా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలన్నది ట్రంప్‌ ఆలోచన. దేశం నుంచి అమెరికాను సాగనంపి, ఆపై దేశాన్ని గుప్పిట్లోకి తీసుకోవాలన్నది తాలిబన్ల వ్యూహం. కనుక చర్చల్లో కొంత పురోగతి సాధించాలన్నది ఉభయ పక్షాల లక్ష్యం. అమెరికా సేనలు వైదొలగితే అఫ్గాన్‌లో ప్రజా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లే భావించాలి. ఇస్లామిక్‌ ఎమిరేట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ నుంచి తాలిబన్లు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అంటే, తొమ్మిదో దశకంనాటి ముల్లాల పాలన పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. చర్చల అజెండాలోని కీలకమైన సామాజిక సమానత్వం, మహిళల హక్కులపై స్పష్టత లేదు. అఫ్గాన్‌ రాజ్యాంగ వ్యవస్థలో మార్పులు ఖాయమనే విషయం స్పష్టమవుతోంది. అక్కడి ప్రజాప్రభుత్వాన్ని తాలిబన్లకు ఎరగా వేసి అమెరికా తప్పుకోనుంది. అది భారత్‌కు ఇబ్బందికరమే. ఇతరుల జోక్యం లేకుండా పూర్తిగా అఫ్గాన్ల చేతుల్లోనే దేశం ఉండాలన్నది భారత్‌ ఆకాంక్ష. తాలిబన్లు ఇప్పటికీ పాక్‌ సైనిక పాలకుల కనుసన్నల్లోనే ఉండటమే దీనికి కారణం. చర్చల ప్రారంభానికి ముందు కూడా తాలిబన్‌ సంప్రతింపుల బృందం పాక్‌ను సందర్శించింది.

పాక్‌ ప్రచ్ఛన్న జోక్యం

భవిష్యత్తులో పాక్‌ ఎఫ్‌ఏటీఎఫ్‌ ఒత్తిడిని తప్పించుకొనేందుకు ఉగ్రమూకల శిబిరాలను అఫ్గానిస్థాన్‌కు తరలించే ప్రమాదం ఉంది. పుల్వామా దాడి సూత్రధారికి శిక్షణ అఫ్గానిస్థాన్‌లోనే ఇచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో దాదాపు 400 ప్రాజెక్టులు చేపట్టిన భారత్‌కు భవిష్యత్తులో కష్టకాలం ఎదురయ్యే అవకాశం ఉంది. చైనాకూ తాలిబన్లు అధికారంలోకి రావడం ఇష్టం లేదు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా నిష్క్రమించాక ‘పెద్దన్న కుర్చీ’ని పాక్‌ సాయంతో దక్కించుకొనేందుకు చైనా కచ్చితంగా ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం చైనా-భారత్‌ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పును తలపిస్తున్నాయి. అమెరికా ప్రత్యేక దూత జల్మే ఖలీల్జాద్‌ ఇటీవల దిల్లీ విచ్చేసి విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. భారత్‌ ఆందోళనలను అఫ్గానిస్థాన్‌ శాంతి చర్చల సందర్భంగా ఇరువర్గాలకు చేరవేసి, ఆ మేరకు తగిన హామీలు తీసుకొనే అవకాశం ఉంది. అయినా వాటికి తాలిబన్లు ఏ మేరకు కట్టుబడి ఉంటారన్నదీ సందేహమే! ఒబామా హయాములో అఫ్గాన్‌ రాయబారిగా పనిచేసిన రేయాన్‌ క్రోకర్‌ మాటల ప్రకారం- ‘లొంగిపోవడమే అసలు ఒప్పందం’ అంటూ అమెరికా తీరును తప్పపట్టారు. రేయాన్‌ మాటల్లో కొంత నిజం లేకపోలేదు. ఫిబ్రవరినాటి అమెరికా-తాలిబన్‌ ఒప్పందంలో అగ్రరాజ్యానికి ఏం దక్కిందో తెలిసినవారికి ఇప్పుడు అఫ్గాన్‌ ప్రభుత్వానికి ఏమి లభించనుందో అర్థమైపోతుంది!

- లక్ష్మీ తులసి

ABOUT THE AUTHOR

...view details