వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు కొంతమంది స్థిరాస్తి వ్యాపారుల భూదాహం తోడై చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురవుతున్నాయి. ఫలితంగా కొద్దిపాటి వర్షాలకే నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయి. చెరువులు ఆక్రమణలకు గురవుతుండటం, వాటిలోకి వరద నీరు వచ్చి చేరే మార్గాలు మూసుకుపోవడం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి కారణాలతో ఇటీవల వరదలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఎక్కడ చెరువులు, కుంటలు ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో భూములు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా కొద్దిపాటి వర్షానికే జనావాసాలు జలాశయాలను తలపిస్తున్నాయి. నిరుడు అక్టోబర్, డిసెంబర్‌లతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. తెలంగాణలో చెరువుల ఆక్రమణలపై మూడు నెలల క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలతో సహా నగరాలు, పట్టణాల్లోని చెరువుల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ శాఖలతో పాటు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై ఎన్జీటీకి హెచ్‌ఎండీఏ నివేదిక అందజేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల అదనపు కలెక్టర్లతో ప్రత్యేక కమిటీలు వేసి చెరువుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం విజయనగరం, విశాఖ, కృష్ణా, నెల్లూరు, కడప జిల్లాల్లోనూ చెరువుల ఆక్రమణలపై ఇటీవల పలు కథనాలు వెలుగుచూశాయి.
వ్యర్థాలతో అనర్థం..
గత దశాబ్దం వరకు నగరాలు, పట్టణాల్లో ఎంత పెద్ద వర్షం కురిసినా కాలనీలు, జనావాసాలు వరద ముంపునకు గురికావడం చాలా అరుదుగా కనిపించేది. ఇటీవలి కాలంలో ఈ సమస్య అధికమైంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలను కలుపుతూ పెద్ద సంఖ్యలో గొలుసు కట్టు చెరువులు ఉండేవి. ప్రస్తుతం అవి ఆక్రమణలకు గురై చాలా వరకు కనుమరుగయ్యాయి. నగరాలు, పట్టణాలు విస్తరిస్తూ, భారీయెత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగి వేల ఎకరాల విస్తీర్ణంలోని చెరువులు, కుంటల భూముల్ని మింగేశాయి. దీనికి తోడు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని విచ్చలవిడిగా పడేస్తుండటం వల్ల మురుగు, వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి చిన్న వానకే నగరాల్లోని రహదారులు గోదారులుగా మారుతున్నాయి. నానాటికీ తీవ్రతరమవుతున్న భూతాపం మూలాన ఆకస్మికంగా కురుస్తున్న కుండపోత వానల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల శిఖం భూముల్లోని లేఔట్లకు, వెంచర్లకు సునాయాసంగా అనుమతులు మంజూరవుతున్నాయి. రెవిన్యూ భూరికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం స్థిరాస్తి మాఫియాకు, ఆక్రమణదారులకు వరంగా మారింది. నిన్న మొన్నటి వరకు భూ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్ల విభాగాలకు మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో చెరువులు, కుంటల భూములు యథేచ్ఛగా పరాధీనమయ్యాయి.