UP election 2022: కాశీ, అయోధ్య, మధురలకు కేంద్రస్థానమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో హిందుత్వ రాజకీయాలదే జోరు! 2017 ఎన్నికల్లో యూపీ శాసనసభలోని 403 సీట్లలో మూడువందలకుపైగా స్థానాలు గెలుచుకున్న భాజపా, అతివాద హిందుత్వ నేత యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటినుంచి యోగి సర్కారు నేరస్థులు, మాఫియా ముఠాలపై ఉక్కు పిడికిలి బిగించింది. యోగి అధికారంలోకి వచ్చాక యూపీ పోలీసులు 8,472 ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారు. 156 మంది రాటుదేలిన నేరస్థులు హతమయ్యారు. 'ఆపరేషన్ లంగ్డా' పేరిట పోలీసులు కాళ్లకు గురిచూసి కాల్పులు జరపడంతో 3,300 మంది నేరగాళ్ల కాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి వచ్చింది. మరోవైపు, మతమార్పిళ్లను, బహిరంగ స్థలాల్లో నమాజ్‌ను నిషేధించారు. జిన్నా, తాలిబన్లు వంటివారిపై ఒంటికాలిపై విరుచుకుపడ్డారు. ఆజంఖాన్, ముఖ్తార్ అన్సారీ, ఆతిక్ అహ్మద్ వంటి ప్రముఖ నాయకులు జైళ్లలో మగ్గుతున్నారు. కొంతమంది ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరికొందరి ఆస్తులు నేలమట్టమయ్యాయి.
అభివృద్ధి కార్యకలాపాలు
UP Political news: కాషాయధారి ముఖ్యమంత్రి నేరసామ్రాజ్యంపై విరుచుకుపడటంతోపాటు- సరికొత్త రహదారులు, ఎక్స్‌ప్రెస్‌దారుల నిర్మాణాన్ని విస్తృతంగా చేపడుతూ, నయా ఉత్తర్ ప్రదేశ్‌ను సాకారం చేస్తానని చెబుతున్నారు. తూర్పు యూపీని లఖ్‌నవూతో అనుసంధానిస్తూ 341 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని నిర్మించారు. లఖ్‌నవూను దక్షిణాన ఉన్న ఝాన్సీతో కలిపే బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రహదారి త్వరలో పూర్తికానుంది. రైతులకు మెరుగైన ధరలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన 27 ఆధునిక మండీల నిర్మాణం పూర్తి కావస్తోంది. 220 సరికొత్త మార్కెట్ యార్డులను నిర్మించారు. చిన్న, మధ్యతరహా రైతులకు లక్ష రూపాయల దాకా రుణమాఫీ ప్రకటించారు. రాష్ట్రంలోని 2.53 కోట్లమంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రూ.6,000 చొప్పున అందించారు. పేదలకు 52 లక్షల ఇళ్లు నిర్మించి, 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.56 కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించారు. విద్యార్థులకు ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తామని యూపీ సర్కారు ప్రకటించింది. మరోవైపు ప్రధాని మోదీ 16 లక్షలమంది స్వయంసహాయక బృందాల మహిళల ఖాతాల్లోకి వెయ్యికోట్ల రూపాయలు బదిలీ చేశారు. ఇలా- హిందుత్వ, సంక్షేమం వంటి జోడుగుర్రాల రథంపై పయనించి విజయాన్ని అందుకోగలనని భాజపా ఆశలు పెట్టుకొంది.
ఆసక్తికర పరిణామాలు
మరోవైపు, యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్‌ప్రదేశ్‌ను 20 ఏళ్లు వెనక్కుతీసుకెళ్లారని, ఎన్‌కౌంటర్లను నిత్యకృత్యం చేశారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెగనాడుతున్నాయి. 19.26 శాతం ముస్లిం ఓట్లు, 10 శాతం యాదవ ఓట్లపై ఆశలు పెట్టుకొన్న ఎస్పీ- యూపీ జనాభాలో సగభాగమున్న ఓబీసీలను ఆకట్టుకోవడానికి గట్టిగా యత్నిస్తోంది. ముఖ్యంగా తూర్పు, మధ్య యూపీలోని 156 నియోజక వర్గాల్లో 12 నుంచి 22 శాతం ఓట్లున్న రాజ్‌భర్‌ల ఓట్లను ఆకర్షించేందుకు ఎస్పీ నేత అఖిలేష్ కృషి చేస్తున్నారు. రాజ్‌భర్, మరికొన్ని ఓబీసీ కులాలలో పట్టు ఉన్న సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో(ఎస్బీఎస్పీ) పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు తూర్పు యూపీలో భాజపాకు నష్టం కలిగించవచ్చు. 2017 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎస్బీఎస్పీతో పొత్తుతో భాజపా 72 సీట్లు గెలుచుకుంది. పశ్చిమ యూపీలో జాట్లకు చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్‌తో (ఆర్‌ఎల్డీ) ఎస్పీ పొత్తు కుదుర్చుకుంది. పశ్చిమ యూపీ జనాభాలో సగంవాటా జాట్లు, ముస్లిములదే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం మూలంగా ఆర్‌ఎల్‌డీ- ఎస్పీతో చేతులు కలిపిన క్రమంలో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
వర్గాల సమీకరణ