ప్రపంచ ప్రభుత్వాన్ని ఎవరూ కోరుకోకపోయినా ప్రపంచవ్యాప్తంగా పాలన మెరుగుదలకు అందరూ కూడి రావాలంటున్న ఐక్యరాజ్యసమితి- 1945లో మాదిరిగానే ప్రస్తుతం అత్యంత సంక్లిష్ట సంధి దశను ఎదుర్కొంటోంది.
'నేడు లెక్కకు మిక్కిలి బహుపాక్షిక సవాళ్లు ఎదురవుతున్నా వాటికి దీటైన పరిష్కారాలే కొరవడుతున్నాయి'- యూఎన్ డెబ్భై అయిదో వార్షికోత్సవ వేళ సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ వ్యక్తీకరించిన నిర్వేదం ఇది.
ఐక్యరాజ్య సమితి అవతరణ :
1919నాటి నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని నిలువరించలేక కాలగర్భంలో కలిసిపోయింది. మరో ప్రపంచ యుద్ధ మహా ముప్పునుంచి మానవాళిని రక్షించడమే పరమలక్ష్యంగా- అంతర్జాతీయ శాంతి భద్రత, దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల అభివృద్ధి, అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి తోడ్పాటు కూడగట్టడం, ఉమ్మడి ప్రయోజనాల సాధనకు ఆయా దేశాల కృషిని సమన్వయీకరించడం వంటి ఉదాత్త ఆశయాలతో ఐక్యరాజ్య సమితి పురుడుపోసుకొంది. 51 దేశాల ఆమోదంతో 1945 అక్టోబరు 24న ఆవిర్భవించింది లగాయతు మానవ హక్కులు మొదలు పర్యావరణ పరిరక్షణ దాకా సమితి బహుముఖంగా విస్తరించిందన్నది వాస్తవం.
ఎన్నెన్నో ఘటనలు :
అదే సమయంలో దశాబ్దాల తరబడి ప్రపంచాన్ని కూటములుగా విభజించిన ప్రచ్ఛన్న యుద్ధం నుంచి అమానుష నరమేధాల వరకు ఎన్నెన్నో ఘటనలు సమితి పరిమితుల్ని కళ్లకు కట్టాయన్నది నిష్ఠుర సత్యం. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్‌లను ‘వీటో’ అధికారాలతో శాశ్వత సభ్య దేశాలుగా ప్రకటించి, 1946నాటి మొట్టమొదటి భేటీలోనే అణు నిరాయుధీకరణకు తీర్మానించిన సమితి- ప్రపంచాన్ని వందలసార్లు భస్మీపటలం చేయగల స్థాయిలో అణుభూతం జడలు విరబోసుకొన్నా ఏమీ చేయలేకపోయింది. ‘ఆచరణకు రాని ఆదర్శాల వల్లెవేతకా సమితి?’ అన్న ప్రశ్నకు ఎవరు జవాబుదారీ?స్తబ్ధుగా ఉన్న సమితిని పునరుత్తేజితం చేసి ప్రపంచ శాంతికి, ప్రగతికి, ప్రజాస్వామ్యానికి పరస్పర సహకారానికి నూతన గవాక్షాలు తెరిచేలా, పీడిత జనావళికి ఇతోధిక సేవలందించేలా సమితికి దిశానిర్దేశం చేస్తూ 1995లో స్వర్ణోత్సవ వేళ ప్రపంచ దేశాలన్నీ డిక్లరేషన్ వెలువరించాయి. సమితిని సరిదిద్దకుంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఉల్లంఘనా పెరుగుతుందని 1996లో ఇండియా సహా 16 దేశాలు చేసిన హెచ్చరిక అక్షరాలా బధిరశంఖారావమైంది. ఇరాక్‌పై దాడి సమితి ఛార్టరు ఉల్లంఘనేనని యూఎన్ ప్రధాన కార్యదర్శిగా అన్నన్ స్పష్టీకరించినా, దక్షిణ చైనా సముద్రంపై ట్రైబ్యునల్ తీర్పును ఇప్పుడు బీజింగ్ కాలదన్నుతున్నా- ప్రపంచ పార్లమెంటు ఏమీ చెయ్యలేకపోయింది.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు :
పేదరికం ఆకలి అసమానతలు పెరగడంతోపాటు సాయుధ ఘర్షణలు, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కొవిడ్‌లాంటి మహమ్మారులు ప్రపంచాన్ని చెండుకుతింటున్నాయని నెలరోజుల నాడు నివేదించిన సమితి- 2030నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలే కీలకమని ఉద్ఘోషిస్తోంది. సమితి క్రోడీకరించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 'సుస్థిర ప్రగతి కోసం శాంతియుత సమ్మిళిత సమాజాల అభివృద్ధి, అందరికీ న్యాయం, అన్ని స్థాయుల్లో సమర్థ జవాబుదారీ, సమ్మిళిత వ్యవస్థల నిర్మాణం' అన్నది ఒకటి.
'కాలం చెల్లిన వ్యవస్థ' :
విశ్వ మానవాళి శ్రేయానికి జవాబుదారీ కాగలిగే పటిష్ఠ వ్యవస్థగా, నేటి అవసరాలకు దీటుగా ఐక్యరాజ్య సమితి ఎదగాలన్న ఇండియా సహా ఎన్నెన్నో వర్ధమాన దేశాల ఆకాంక్షను సమితి తీర్మానం కేవలం చర్చలకే పరిమితం చేసింది. కాలం చెల్లిన వ్యవస్థలతో నేటి సవాళ్లను ఎదుర్కోలేమంటూ ఐరాస సంస్కరణల ఆవశ్యకతపై ప్రధాని మోదీ గట్టిగా గళమెత్తారు. అణు నిరాయుధీకరణ, వాతావరణ మార్పులపై అగ్రరాజ్యాల ఇష్టారాజ్యం ప్రపంచాన్నే పెను ప్రమాదంలోకి నెడుతున్న వేళ- అందరి సంస్థగా సమితి దిశానిర్దేశం చెయ్యగలగాలి. మెజారిటీ దేశాల వాక్కుకు మన్నన దక్కేలా పని పోకడలు మారితేనే సమితి ఐక్యరాజ్య వేదికగా చిరంజీవి కాగలుగుతుంది!