Uniform Civil Code India : దేశంలో 'ఉమ్మడి పౌరస్మృతి'పై చర్చ ఊపందుకుంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతపై మాట్లాడిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. వివిధ పార్టీల రాజకీయ నాయకులు దీనిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్- యూసీసీ) అంటే ఏంటి? రాజ్యాంగం దీని గురించి ఏమని చెబుతోంది? న్యాయ కమిషన్ ప్రతిపాదనలేంటి? దీన్ని తీసుకొస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? వంటి విషయాలు తెలుసుకుందాం.
ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి?
Uniform Civil Code article 44 : ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని చెబుతుంది. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా వ్యక్తిగత అంశాలపై చట్టాలు అమలు చేయాలని సూచిస్తుంది. వివాహాల నుంచి విడాకుల వరకు.. భరణం నుంచి వారసత్వం వరకు వ్యక్తిగత చట్టాల స్థానంలో ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు చేయాలని చెబుతుంది.
వ్యక్తిగత చట్టాలు అంటే?
Uniform Civil Code UPSC : మన దేశంలో ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి. వాటిని స్థూలంగా పబ్లిక్, పర్సనల్ (వ్యక్తిగత) చట్టాలుగా విభజించవచ్చు. పబ్లిక్ చట్టాలంటే.. సమాజం అంతటికీ ఒకే విధంగా అమలయ్యే చట్టాలు. ఉదాహరణకు.. క్రిమినల్ చట్టాలు దేశంలోని ప్రజలందరికీ ఒకేలా వర్తిస్తాయి. హత్య, దోపిడీ, అత్యాచారం వంటి నేరాలు ఎవరు చేసినా ఒకే విధమైన శిక్ష ఉంటుంది. కుల, మత, లింగ వివక్షలకు ఇందులో తావు లేదు. నేరాలు, నేర దర్యాప్తునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలు, భవిష్యత్‌లో రాబోయే చట్టాలకూ ఈ నిబంధన వర్తిస్తుంది.
కానీ, వ్యక్తిగత చట్టాల విషయానికి వచ్చేసరికి అంతా మారిపోతుంది. వ్యక్తిగత అంశాలైన వివాహం, వారసత్వం, విడాకులు- వేరుపడటం వంటి వ్యక్తిగత అంశాలపై దేశంలో ఉమ్మడి చట్టం లేదు. వీటిపై మతాలకు అనుగుణంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు వేర్వేరు చట్టాలు ఉన్నాయి. అంటే పైన పేర్కొన్న వ్యక్తిగత విషయాల్లో తలెత్తే వివాదం.. వారు ఏ మతానికి చెందినవారనే అంశాన్ని ఆధారంగా చేసుకొని పరిష్కరిస్తారు. ఉదాహరణకు హిందువుల పెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలు, వాటిపై తలెత్తే వివాద పరిష్కారాల కోసం 1955 హిందూ వివాహ చట్టం ఏర్పడింది. విడాకుల విషయంలోనూ ఇదే విధంగా వేర్వేరు చట్టాలు ఉన్నాయి. హిందువులకైతే భారతీయ విడాకుల చట్టం, క్రైస్తవులకు క్రైస్తవ విడాకుల చట్టం, ముస్లింలకు '1939 ముస్లిం వివాహ రద్దు' చట్టం వర్తిస్తాయి.
ఉమ్మడి పౌరస్మృతిపై రాజ్యాంగం ఏం చెబుతోంది?
Uniform Civil Code under article 44 : ఈ విషయంలో రాజ్యాంగంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే బాధ్యత పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలకు ఉంటుందని ఆదేశిక సూత్రాల గురించి వివరించే నాలుగో చాప్టర్లో స్పష్టంగా ఉంది. "భారతదేశ భూభాగం అంతటా పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండేలా రాజ్యం ప్రయత్నించాలి" అని 44వ ఆర్టికల్ పేర్కొంటోంది.
లా కమిషన్ ఏం చెప్పింది?
Law Commission on UCC : ఉమ్మడి పౌరస్మృతి సహా వివిధ అంశాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని 21వ లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. యూసీసీ అమలు చేయాల్సిన ఆవశ్యకత లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని చేపట్టడం మంచిది కాదని సూచించింది. విభేదాలు ఉన్నంత మాత్రాన వివక్ష ఉన్నట్టు కాదని పేర్కొంది. అనేక దేశాలు వైవిధ్యతను గుర్తించి, కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపింది.
21వ లా కమిషన్ తన నివేదికలో ఏం చెప్పిందంటే?
- యూసీసీ:యూసీసీని అమలు చేసే బదులు.. కుటుంబ చట్టాలను లింగ వివక్ష లేకుండా మార్చితే సరిపోతుంది. ఉమ్మడి చట్టాల బదులు హక్కులలో ఏకరూపత తీసుకొస్తే మంచిది.
- విడాకులు:అన్ని వ్యక్తిగత చట్టాలలో 'నో ఫాల్ట్ డివోర్స్' (ఎవరి తప్పు లేకుండానే విడాకులు తీసుకోవడం)ను చేర్చాలి. వివాహం రద్దైన తర్వాత ఆస్తులను ఇద్దరికీ పంచాలి.
- ముస్లింలలో బహుభార్యత్వం:ఇస్లాం ప్రకారం బహుభార్యత్వానికి అనుమతి ఉంది. కానీ, దీన్ని పాటించే భారతీయ ముస్లింలు చాలా తక్కువ. కానీ, కొందరు మాత్రం బహుభార్యత్వం కోసమే ఇస్లాం మతంలోకి మారుతున్నారు.
అయితే, 21వ లా కమిషన్ ప్రతిపాదనలు చేసి ఐదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ కమిషన్.. యూసీసీపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు కోరింది. 22వ లా కమిషన్‌కు కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ నాయకత్వం వహిస్తున్నారు.
యూసీసీ వస్తే ఏమవుతుంది?
UCC implementation in India : ఉమ్మడి పౌరస్మృతి వస్తే వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి. వివాహం, భరణం, విడాకులు వంటి అన్ని వ్యక్తిగత అంశాలకు ఒకే చట్టం ఉంటుంది. మతాలను బట్టి కాకుండా.. ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు అమలవుతాయి.
ఆదేశిక సూత్రాలు X ప్రాథమిక హక్కులు
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి గురించి స్పష్టంగా పేర్కొన్నా.. దేశంలో మాత్రం రాజకీయంగా ఈ విషయం ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతూనే ఉంది. రాజ్యాంగపరంగానూ ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు సంఘర్షణ ఏర్పడుతోంది. రాజ్యాంగం ప్రకారం.. నచ్చిన మతాన్ని ఆచరించడం ప్రాథమిక హక్కుగా ఉంది. ఆర్టికల్ 25, 26 ప్రకారం ఏ మతాన్నైనా ఆచరించడానికి, మతవ్యవహారాలను నిర్వహించుకోవడానికి, మత ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఈ హక్కులకు ప్రభుత్వాలు తప్పనిసరిగా రక్షణ కల్పించాలి. లేదంటే బాధితులు కోర్టును ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకోవచ్చు. మరోవైపు, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు.. ప్రభుత్వానికి చేసే ప్రతిపాదనలు/సూచనలు మాత్రమే. వాటిని అమలు చేయడం/చేయకపోవడం ప్రభుత్వాల ఇష్టం. ఆదేశిక సూత్రాలు అమలు చేయలేదన్న కారణంతో ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించలేరు.
ఇప్పుడు ఎందుకీ చర్చ? మోదీ అసలేమన్నారు?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపై చర్చ ఊపందుకోవడానికి కారణం ప్రధాని మోదీ.. యూసీసీపై కీలక వ్యాఖ్యలు చేయడమే. ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను ప్రస్తావిస్తూ మంగళవారం మధ్యప్రదేశ్‌లో బలమైన ప్రసంగం చేశారు. వ్యక్తిగత విషయాలపై వేర్వేరు చట్టాలు ఉంటే దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తామని ఆయన ప్రశ్నించారు. ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులను వేర్వేరుగా ఎలా పరిగణిస్తామని అన్నారు.
"ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక చట్టం, ఇంకో వ్యక్తికి మరో చట్టం ఉంటుందా? అలాంటి ఇల్లు మనుగడ సాగిస్తుందా? అలాంటప్పుడు.. అలాంటి రెండు వ్యవస్థలతో దేశం ఎలా ముందుకెళ్తుంది? రాజ్యాంగంలోనూ సమాన చట్టాల గురించి పేర్కొన్నారు. యూసీసీ అమలు చేయాలని సుప్రీంకోర్టు సైతం సిఫార్సు చేసింది. విపక్షాలు మాత్రం ముస్లింలను తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టడానికే యూసీసీని ఉపయోగించుకుంటున్నాయి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'దేశంలోని వైవిధ్యం సంగతేంటి?'
మరోవైపు, మోదీ వ్యాఖ్యలకు విపక్షాలు సైతం గట్టి కౌంటర్ ఇస్తున్నాయి. దేశంలోని అసలైన సమస్యలను పక్కనబెట్టి యూసీసీపై మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. 'మోదీ ఏం కావాలంటే అది మాట్లాడుకోవచ్చు. కానీ దేశం ముందు ఉన్న నిజమైన సమస్యలైన నిరుద్యోగం, ధరల పెరుగుదల, మణిపుర్ హింసపై సమాధానాలు చెప్పాలి' అని కాంగ్రెస్ మండిపడింది. మెజారిటీవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం.. ఒక అజెండాతో యూసీసీని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఇలా చేస్తే సమాజంలోని చీలికలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు.
"సుపరిపాలన అందించడంలో విఫలమైన ప్రధాని.. ఇప్పుడు యూసీసీ గురించి మాట్లాడుతున్నారు. కుటుంబాన్ని, దేశాన్ని పోల్చి చూడటానికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవికత వేరు. కుటుంబం ఒక్కటిగా ఉండటానికి రక్త సంబంధం కారణం. దేశాన్ని మాత్రం రాజ్యాంగమే ఐక్యం చేస్తోంది. ప్రతి కుటుంబంలో వైవిధ్యం ఉన్నట్టే.. దేశంలోనూ వైవిధ్యం, బహుళత్వం ఉంది."
-చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
హిందూ అవిభాజ్య కుటుంబ చట్టాన్ని రద్దు చేస్తారా?
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఉమ్మడి పౌరస్మృతిపై తీవ్రంగా స్పందించారు. దేశంలోని వైవిధ్యాన్ని యూసీసీ పేరుతో లాగేసుకుంటారా అని ప్రశ్నించారు. ముందుగా హిందూ అవిభాజ్య కుటుంబ చట్టాన్ని రద్దు చేయాలని సవాల్ విసిరారు. ఆ చట్టం వల్ల దేశం ఏటా రూ.3వేల కోట్లకు పైగా నష్టపోతోందని చెప్పారు.
"ఒకవైపు పాస్మాండా ముస్లింలపై మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మరోవైపు, ఆయన అనుచరులు మసీదులపై దాడులు చేస్తున్నారు. ముస్లింల జీవనోపాధిని లాగేసుకుంటున్నారు. వారి ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. మూకదాడులు చేస్తున్నారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు నిరాకరిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ముస్లింలకు స్కాలర్షిప్లను సైతం రద్దు చేసింది. పాస్మాండా ముస్లింలు దోపిడీకి గురైతే.. మోదీ ఏం చేస్తున్నట్టు? పాస్మాండాల పేరుతో ఓట్లు అడిగే ముందు మా ప్రవక్తను అవమానించినందుకు బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వారిని క్షమాపణ అడగాలి."
-అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఎంపీ
ఆప్ అనుకూలం..
మరోవైపు, దేశంలో జాతీయ పార్టీగా ఎదిగిన ఆమ్ ఆద్మీ.. యూసీసీకి జై కొట్టింది. ఉమ్మడి పౌరస్మృతికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. అయితే, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దీనిపై నిర్ణయానికి రావాలని సూచించింది. 'అన్ని మతాలు, సంఘాలు, రాజకీయ పార్టీల సంప్రదింపులపైనే ఉమ్మడి పౌరస్మృతి నిర్మితం కావాలి. దానికి మా మద్దతు ఉంటుంది' అని ఆప్ నేత సందీప్ పాఠక్ పేర్కొన్నారు.
హిందువుల్లోనూ ఎంతో వైవిధ్యం.. గిరిజనుల మాటేంటి?
మరోవైపు, హిందువులపైనా ఉమ్మడి పౌరస్మృతి తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యూసీసీ అమలైతే గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు ప్రశ్నార్థకమవుతాయని అంటున్నారు. హిందూ-ముస్లిం కోణంలోనే బీజేపీ ఆలోచిస్తుందని, అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
"మీరు ఎందుకు హిందూ-ముస్లిం అని ఆలోచిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో గిరిజనులు ఉన్నారు. గిరిజన సమాజాన్ని సొంత నియమాలు, సంప్రదాయాలతో నడిపించుకుంటుంటారు. వారి కట్టుబాట్లకు ఏమవుతుంది? ఇంకొన్ని కులాలకు కూడా సొంతంగా నియమాలు ఉన్నాయి. అన్ని రకాల పూలు ఉండే అందమైన పుష్పగుచ్ఛమే భారతదేశం. భిన్న భాషలు, మతాలు, సంస్కృతులను ఆచరించే ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారిని అలాగే చూడాలి."
-భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
మరోవైపు, ఝార్ఖండ్‌కు చెందిన 31 గిరిజన సంఘాలు యూసీసీపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయ కమిషన్‌కు లేఖ రాయాలని నిర్ణయించాయి. యూసీసీని తీసుకొస్తే తమ గుర్తింపు ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నాయి. దీని వల్ల గిరిజన భూచట్టాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్.. యూసీసీ అనే ఆలోచననే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశాయి.
యూసీసీని అమలు చేస్తే మైనారిటీల మత స్వేచ్ఛ హరించుకుపోతుందని నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ పేర్కొంది. దేశంలో అణగారిన మైనారిటీల ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. నాగాలాండ్ ట్రైబల్ కౌన్సిల్(ఎన్టీసీ) సైతం యూసీసీపై వ్యతిరేక స్వరం వినిపించింది. 'రాజకీయ ఒప్పందంలో భాగంగా నాగాలాండ్‌కు రాష్ట్ర హోదా దక్కింది. 371ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. నాగాలు, నాగా సంస్కృతి, ఆచారాలలో జోక్యం చేసుకునే విధంగా పార్లమెంట్ చేసే చట్టాలు నాగాలాండ్ రాష్ట్రానికి వర్తించవు. ఒకవేళ కేంద్రం యూసీసీపై ముందుకెళ్లాలని భావిస్తే.. నాగాలాండ్‌ను మినహాయించాలి' అని పేర్కొంది.
ముస్లిం సంఘాలు ఏమంటున్నాయి?
దేశంలోని ప్రముఖ ముస్లిం సంఘాలు సైతం యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన మతస్వేచ్ఛకు యూసీసీ విఘాతం కలిగిస్తుందని జమైత్ ఉలేమా ఇ-హింద్ వ్యాఖ్యానించింది. దేశంలో అధికారిక మతం అంటూ లేదని, ప్రతి పౌరుడు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చని గుర్తు చేసింది. 'ఒకవేళ కేంద్రం యూసీసీ తీసుకొచ్చినా.. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసే ఉద్దేశం లేదు. బదులుగా చట్టపరంగా పోరాడతాం' అని స్పష్టం చేసింది.
ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం యూసీసీని వ్యతిరేకించింది. యూసీసీ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని బోర్డు సభ్యుడు ఖలీద్ రషీద్ ఫారంగీ మాహ్లి పేర్కొన్నారు. 'భారత్‌లో ఎన్నో మతాలు, సంస్కృతులు ఉన్నాయి. యూసీసీ వల్ల ముస్లింలు మాత్రమే ప్రభావితం కారు. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, యూదులు, పార్సీలతో పాటు చిన్న చిన్న మతాలపైనా దీని ప్రభావం పడుతుంది' అని ఫారంగీ పేర్కొన్నారు.
టార్గెట్ 2024: బీజేపీ అజెండాలో మిగిలింది ఇదే..!
అయితే, లోక్‌సభ ఎన్నికలకు 10 నెలలు ఉండగా ఈ వ్యవహారం తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మూడు ప్రాథమిక అజెండాలు ఉన్నాయని చెబుతారు. ఆర్టికల్-370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి అంశాలే బీజేపీ ప్రాధాన్యాలని అంటుంటారు. ఇప్పటికే ఆర్టికల్-370ని రద్దు చేసింది బీజేపీ సర్కారు. మరోవైపు, అయోధ్యలో రామ మందిరం సైతం నిర్మితమవుతోంది. ఇక మిగిలిందల్లా.. ఉమ్మడి పౌరస్మృతి ఒక్కటే.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే యూసీసీపై ముందడుగు వేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 22వ లా కమిషన్ ఈ మేరకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, యూసీసీపై 21వ లా కమిషన్ చేసిన సిఫార్సులను ఖండించేలా సూచనలు చేయాలంటే మాత్రం బలమైన కారణాలను తాజా లా కమిషన్ చూపించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే బీజేపీ సర్కారు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో.. ఈసారి సమావేశాలు ఎలా సాగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. ఏదేమైనా 2024 ఎన్నికల వరకు ఈ అంశం దేశంలో సజీవంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.