తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రతిబంధకాలను అధిగమిస్తేనే వ్యాక్సిన్​ పంపిణీ

నేడు ప్రపంచంలో అతిపెద్ద టీకాల కొనుగోలుదారు యునిసెఫ్‌ సంస్థే. త్వరలో 92 పేద దేశాల్లో ఆబాలగోపాలానికి కొవిడ్‌ 19 టీకాలను వేసే బాధ్యతనూ యునిసెఫ్‌ తన భుజస్కంధాలపైకి తీసుకొంటోంది. క్లినికల్‌ పరీక్షలు పూర్తయ్యి, ముందస్తు కొనుగోలు ఒప్పందాలు కుదిరి, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నిధులు సమకూర్చి, నియంత్రణ సంస్థల అనుమతులు రాగానే ఉత్పత్తి మొదలవుతుంది. టీకాను ఉత్పత్తి చేసిన వెంటనే అన్ని అనుమతులూ పొంది, నిర్దేశిత ఉష్ణోగ్రతలో టీకా డోసులను భద్రపరచి, వేగంగా ప్రపంచం నలుమూలల్లోని గమ్యాలకు చేర్చాలి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా టీకా సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి శీతలీకరణ సౌకర్యాలకు అగ్ర ప్రాధాన్యం ఉంటుంది.

Unicef to supply vaccine to 92 poor countries amid challenges
ప్రతిబంధకాలను అధిగమిస్తేనే వ్యాక్సిన్​ పంపిణీ

By

Published : Sep 17, 2020, 6:58 AM IST

ఐక్యరాజ్య సమితి బాలల సంరక్షణ సంస్థ (యునిసెఫ్‌) ఏటా ప్రపంచంలోని సగం మంది బాలలకు ప్రాణరక్షక టీకాలు వేస్తోంది. ధనుర్వాతం, తట్టు (మీజిల్స్‌), పోలియో, ఎల్లో ఫీవర్‌, కోరింత దగ్గుల నుంచి కోట్లమంది పిల్లలను ఈ టీకాలే రక్షిస్తున్నాయి. ఏటా 200 కోట్ల డోసుల టీకాలను కొనుగోలు చేసి 100 దేశాల్లో బాలబాలికలను కాపాడుతోంది. నేడు ప్రపంచంలో అతిపెద్ద టీకాల కొనుగోలుదారు యునిసెఫ్‌ సంస్థే. త్వరలో 92 పేద దేశాల్లో ఆబాలగోపాలానికి కొవిడ్‌ 19 టీకాలను వేసే బాధ్యతనూ యునిసెఫ్‌ తన భుజస్కంధాలపైకి తీసుకొంటోంది. ప్రపంచమంతటా కొవిడ్‌ టీకాలు వేయడానికి ఉద్దేశించిన కొవాక్స్‌ కార్యక్రమానికి గావి- ది వ్యాక్సిన్‌ అలయెన్స్‌ సంస్థ నాయకత్వం వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద కొవిడ్‌ టీకాలను సేకరించి, అల్పాదాయ దేశాలకు పంపిణీ చేసే బాధ్యతను యునిసెఫ్‌ నెరవేరుస్తుంది. ప్రస్తుతం క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్న పలు కొవిడ్‌ టీకాల్లో విజయవంతమయ్యేవాటిని, రాబోయే రెండేళ్లలో కొన్ని వందల కోట్ల డోసులుగా తయారుచేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. మొత్తం 10 దేశాల్లో 28 టీకా ఉత్పత్తి సంస్థలు కొవిడ్‌ 19 టీకా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి.

కీలక భాగస్వామ్యాలు

ఏడు వందల కోట్ల పైచిలుకుగల ప్రపంచ జనాభాకు టీకాలు వేయడమనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. క్లినికల్‌ పరీక్షలు పూర్తయ్యి, ముందస్తు కొనుగోలు ఒప్పందాలు కుదిరి, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నిధులు సమకూర్చి, నియంత్రణ సంస్థల అనుమతులు రాగానే ఉత్పత్తి మొదలవుతుంది. పాన్‌ అమెరికన్‌ హెల్త్‌ సంస్థ (పాహో)కు చెందిన ఆవృత నిధి సహకారంతో యునిసెఫ్‌ బడుగు దేశాలకు టీకా పంపిణీని చేపడుతుంది. కొవాక్స్‌ కార్యక్రమంలో 80 సంపన్న దేశాలూ భాగస్వాములు కానున్నాయి. ఈ దేశాలు కొవిడ్‌ 19 టీకా కొనుగోలుకు తమ సొంత బడ్జెట్ల నుంచి నిధులు కేటాయిస్తాయి. వాటి తరఫున కూడా టీకా కొనుగోళ్లకు యునిసెఫ్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. సంపన్న దేశాలు తమ ప్రజలకు సొంత నిధులతో టీకాలు వేయదలచాయి కాబట్టి, ఈ దేశాల నిధులు టీకా ఉత్పత్తిని పెంచడానికి ఆరంభ పెట్టుబడులుగా ఉపకరిస్తాయి. ధనిక దేశాలు కొవాక్స్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం కోసం సెప్టెంబరు 18న యునిసెఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ప్రపంచ దేశాలన్నింటికీ కొవిడ్‌ టీకా అందేట్లు చూడటం కొవాక్స్‌ కార్యక్రమ లక్ష్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, గావి-ది వ్యాక్సిన్‌ అలయెన్స్‌, పావో, సెపి, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్లతో కలిసి యునిసెఫ్‌ కొవాక్స్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయనుంది. పై సంస్థల ఆర్థిక సహాయం బడుగు దేశాల ప్రజలకు కొవిడ్‌ టీకాలు వేయడానికి ఎంతో తోడ్పడుతుంది. గావి-ది వ్యాక్సిన్‌ అలయెన్స్‌, యునిసెఫ్‌ కలిసి గత 20 ఏళ్లుగా 76 కోట్ల పిల్లలకు ప్రాణ రక్షక టీకాలు అందించి, 1.3 కోట్ల మరణాలను నివారించాయి. ఆ అనుభవం కొవిడ్‌ 19 టీకా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడానికి తోడ్పడనుంది.

బృహత్తర కార్యక్రమం

ఇప్పుడు క్లినికల్‌ పరీక్షలు జరుపుకొంటున్న కొవిడ్‌ టీకాలలో విజయవంతమైన టీకాను ప్రపంచం కోసం వందల కోట్ల డోసుల్లో ఉత్పత్తి చేయడమే ఒక బృహత్తర కార్యక్రమమైతే- దేశదేశాలకు వాటిని రవాణా చేసి, ప్రజలందరికీ పంపిణీ చేయడం మరింత పెద్ద సవాలు. ప్రభుత్వాలు, పరిశ్రమలు దానికోసం ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టాలని అంతర్జాతీయ విమాన రవాణాదారుల సంఘం (ఐఏటీఏ) అప్రమత్తం చేసింది. ముఖ్యంగా విమానాల ద్వారా టీకాల రవాణా ఆషామాషీ కాదని గుర్తుచేసింది. భద్రంగా వేగంగా కొవిడ్‌ టీకాను రవాణా చేయడమనేది ఈ శతాబ్దిలోనే కనీవినీ ఎరుగని బృహత్కార్యంగా రికార్డుల్లో నిలిచిపోతుంది.

ప్రస్తుతం కొవిడ్‌ వల్ల ప్రపంచమంతటా విమాన ప్రయాణాలు రద్దవడమో లేక ప్రయాణాల సంఖ్య తగ్గిపోవడమో జరుగుతోంది. దీంతో తగినన్ని విమానాలు అందుబాటులో లేకుండాపోయాయి. వందలాది విమానాలు గిడ్డంగులకు వెళ్లిపోయాయి. రేపు కొవిడ్‌ టీకాను శీఘ్రంగా గమ్యాలకు చేర్చడానికి ఇది సమస్యాత్మకం కావచ్చని యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావి ఆందోళన చెందుతున్నాయి. 780 కోట్ల ప్రపంచ జనాభాకు తలా ఒక టీకా డోసు అందించడానికే 8,000 బోయింగ్‌ 747 జంబో రవాణా విమానాలు అవసరపడతాయి. రెండు డోసులు వేయాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్థానిక టీకా ఉత్పత్తి కేంద్రాలున్న సంపన్న దేశాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శీతలీకరణ వాహనాల్లో టీకాలను రవాణా చేయవచ్చు కాని, అంతర్జాతీయ రవాణాకు మాత్రం విమానాలు కావలసిందే. కానీ, పేద దేశాల్లో విమానాలు దిగిన తరవాత, స్థానిక ప్రజలకు రహదారుల ద్వారా టీకా పంపిణీ చేయడం పెద్ద సవాలు. ఈ దేశాల్లో శీతలీకరణ సౌకర్యాలు, పూర్తిస్థాయిలో రహదారి వ్యవస్థ లేకపోవడం దీనికి కారణం. ఈ చిక్కులన్నీ అధిగమించి విజయవంతంగా కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని పూర్తిచేయడానికి ప్రభుత్వాలతో, ఉత్పత్తి, సేకరణ, రవాణా, బట్వాడా సంస్థలతో కలిసి యునిసెఫ్‌ పనిచేస్తోంది.

రవాణాకు భారీ బందోబస్తు

టీకాను ఉత్పత్తి చేసిన వెంటనే అన్ని అనుమతులూ పొంది, నిర్దేశిత ఉష్ణోగ్రతలో టీకా డోసులను భద్రపరచి, వేగంగా ప్రపంచం నలుమూలల్లోని గమ్యాలకు చేర్చాలి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా టీకా సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి శీతలీకరణ సౌకర్యాలకు అగ్ర ప్రాధాన్యం ఉంటుంది. కొత్త కోల్డ్‌ స్టోరేజీలను నిర్మించడం, పాత శీతలీకరణ గిడ్డంగులకు తగు మార్పుచేర్పులు చేయడం వంటి పనులు ఇప్పటి నుంచే ప్రారంభించాలి. టీకాను ఎంత సమయం, ఎంత ఉష్ణోగ్రతలో భద్రపరచాలో తెలిసిన సుశిక్షిత సిబ్బంది పెద్ద సంఖ్యలో అవసరపడతారు. నిలవ చేయడంలో పొరపాట్లు జరిగి టీకా చెడిపోకుండా చూడటానికి నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అందుకు సునిశిత పరికరాలను ఏర్పరచాలి. విమానాల్లో రవాణా చేసేటప్పుడు టీకాలు చౌర్యానికి గురికాకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలి. టీకాలను తీసుకెళ్తున్న విమానాలు, ఆయా దేశాల సరిహద్దులను దాటేటప్పుడు ఆరోగ్య, కస్టమ్స్‌ అధికారులు ఆలస్యం చేయకుండా చప్పున నియంత్రణ సంబంధ అనుమతులు మంజూరు చేయాలి. విమానాశ్రయాల్లో టీకా విమానాలు దిగడానికి, లేక దిగకుండానే ఆకాశ మార్గంలో కొనసాగడానికి వీలుండాలి. ఒకవేళ దిగితే విమాన సిబ్బందిని క్వారంటైన్‌ నుంచి, కర్ఫ్యూల నుంచి మినహాయించాలి. ఒక దేశంలో టీకాల బట్వాడాకు విమానం దిగిన వెంటనే ప్రాధాన్య ప్రాతిపదికపై అనుమతులు ఇవ్వాలి. ఉష్ణోగ్రతలో తేడా వల్ల టీకా చెడిపోకుండా చూడాలంటే ఇది చాలా అవసరం.

- ఆర్య

ABOUT THE AUTHOR

...view details