దేశంలో ఈ ఏడాది ఒక్క ఆగస్టులోనే 19 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక రంగంలోనే 10 లక్షలమంది ఉపాధి కోల్పోయారు. జులైలో ఇదే రంగంలో ఎనిమిది లక్షలమంది ఉద్యోగాలు పోగొట్టుకొన్నారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత (Unemployment) 8.3శాతానికి చేరుకుంది. పారిశ్రామిక రంగ దుస్థితికి కొవిడ్ తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభం మాత్రమే కారణం కాదు. మహమ్మారి కంటే ముందే ఈ రంగంలో ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా ఉండటం- విధానకర్తలను తరచూ ఆందోళనకు గురిచేసేది. 2017-18లో మొత్తం ఉద్యోగాల్లో పారిశ్రామిక రంగం వాటా పది శాతమైతే, 2020-21 కల్లా అది 7.5శాతానికి తగ్గిపోయింది. కొవిడ్ విరుచుకుపడ్డాక అనేక భారత పారిశ్రామిక యూనిట్లు మూతపడిపోయాయి. ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు పట్టణాలు వదలి పల్లెబాట పట్టి వ్యవసాయ పనులు వెతుక్కున్నారు. దీంతో సాగు రంగంలో గిరాకీ కన్నా కూలీల సరఫరా ఎక్కువై, వారి వేతనాలు పడిపోయాయి. ఇలా ఉద్యోగ కల్పనలో పారిశ్రామిక రంగ వైఫల్యం వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావాన్ని కనబరచింది.
భిన్నమైన ప్రస్థానం
మొదటి నుంచీ భారత పారిశ్రామిక రంగ (industrial sector) ప్రస్థానం మిగతా ప్రపంచంకన్నా భిన్నంగా సాగింది. ఇంతవరకు ప్రధాన దేశాలన్నింటిలో వ్యవసాయంలోని మిగులు కార్మికులను పారిశ్రామిక రంగం ఇముడ్చుకుంటూ వస్తోంది. పల్లెల నుంచి పట్టణాలకు కార్మిక వలసలు క్రమంగా పెరగడం, ఆ తరవాత సేవారంగం విజృంభించి, అత్యధికులకు ఉపాధి కల్పించడం రివాజు. అదే సహజ ఆర్థిక పరిణామ క్రమం కూడా. కానీ, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం వ్యవసాయ రంగం నుంచి నేరుగా సేవారంగానికి లంఘించి, పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 1995లో భారత జీడీపీకి 18శాతం వాటా సమకూర్చిన పారిశ్రామిక రంగం- నేడు 13శాతమే అందించగలుగుతోందని ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది.
ఇతర దేశాల్లో ఇలాంటి తలకిందుల పరిస్థితి లేదు. ఉదాహరణకు చైనా, పొలాల నుంచి కర్మాగారాలకు అత్యధిక శ్రామికులను తరలించి ప్రపంచానికే ఉత్పత్తికేంద్రంగా ఎదిగింది. ఇండియాలో పరిస్థితి దీనికి పూర్తి వ్యతిరేకం. ఇక్కడ 2017-18లో మొత్తం ఉపాధి కల్పనలో 35శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2020-21కల్లా 39.5శాతానికి పెరిగిందని సీఎంఐఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్ వల్ల పరిశ్రమలు మూతపడి వ్యవసాయంపై ఒత్తిడి ఎక్కువైంది. ఫలితంగా గ్రామాల్లో ఆదాయాలు పడిపోయి కొనుగోలు శక్తి సన్నగిల్లుతోంది. దీనివల్ల భారత ఆర్థికాభివృద్ధి రేటు కోసుకుపోతోంది. శ్రామికులకు అల్ప ఆదాయాలు సమకూర్చే వ్యవసాయం నుంచి అధిక వేతనాలిచ్చే పారిశ్రామిక రంగానికి పెద్దయెత్తున మళ్ళించడానికి సంస్కరణలు తీసుకురావాలి. పారిశ్రామిక రంగంలో రెండంకెల వృద్ధి రేటును సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 'భారత్‌లో తయారీ'(మేకిన్ ఇండియా) విధానాన్ని చేపట్టింది. దీంతోపాటు దేశీయంగా సులువుగా వ్యాపారాలు ప్రారంభించి, వృద్ధి చేయడానికి అనుకూల వాతావరణం కల్పించాలి. కొత్త పెట్టుబడులకు ద్వారాలు తెరవాలి. దేశంలో భౌతిక, సామాజిక మౌలిక వసతులను విస్తరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేసినప్పుడే పారిశ్రామిక రంగం వృద్ధి పథంలో పరుగులు తీస్తుంది.
నాణ్యతకు పట్టం కట్టాలి...