Ukraine war impact on China: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు ప్రతిష్ఠాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌కు (బీఆర్‌ఐ) ఉక్రెయిన్ సంక్షోభం గొడ్డలిపెట్టుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకపక్షంగా యుద్ధం ఆరంభించిన రష్యాకు డ్రాగన్ పరోక్షంగా మద్దతు పలుకుతుండటమే అందుకు కారణం. అంతర్జాతీయ శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం పాటుపడే అగ్రరాజ్యంగా తనను తాను ప్రచారం చేసుకుంటున్న చైనా.. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో వ్యవహరిస్తున్న తీరు ఐరోపా దేశాలకు అసంతృప్తి కలిగిస్తోంది. జిన్‌పింగ్ మాటలు ఎంతమాత్రమూ విశ్వసనీయం కాదని తాజా పరిణామాలతో స్పష్టమైందని అవి భావిస్తున్నాయి. బీఆర్‌ఐలో భాగంగా బీజింగ్‌తో వాణిజ్య, సాంకేతిక, రవాణా సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై అవి పునరాలోచనలో పడుతున్నాయి.
సరఫరా గొలుసులో కీలకం
భూతల, జల మార్గాల ద్వారా ఆఫ్రికా, ఐరోపాలతో ఆసియాను అనుసంధానించి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా అవతరించాలన్న ధ్యేయంతో బీఆర్‌ఐను డ్రాగన్ తలపెట్టింది. ఆధునిక సిల్క్ రోడ్డుగా దాన్ని వ్యవహరిస్తున్నారు. చైనాలోని లియాన్‌యూన్‌గాంగ్ నుంచి నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యాం వరకు ఏర్పాటుచేసిన ‘న్యూ యూరేసియన్ ల్యాండ్ బ్రిడ్జ్’ (ఎన్‌ఈఎల్‌బీ)- బీఆర్‌ఐలోని కీలక ప్రాజెక్టుల్లో ఒకటి. పోలాండ్, బెలారస్, రష్యాల గుండా సాగే ఈ మార్గం పొడవు 10 వేల కిలోమీటర్ల పైమాటే. 2017లో ఐరోపా, చైనాలను అనుసంధానిస్తూ 40 సరకు రవాణా మార్గాలు ఉండేవి. బీఆర్‌ఐతో ప్రస్తుతం ఆ సంఖ్య 78కి పెరిగింది. 23 ఐరోపా దేశాల్లోని 180 నగరాలను చైనాతో అవి అనుసంధానిస్తున్నాయి. 2017లో భూతల మార్గాల్లో చైనా నుంచి 800 కోట్ల డాలర్ల విలువైన సరకు రవాణా జరిగింది. 2021లో అది ఏకంగా దాదాపు 7500 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఆ రవాణా మార్గాలు కీలకంగా ఎదిగాయని చెప్పేందుకు అది నిదర్శనం. ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యా పక్షాన నిలవడం చైనాకు ఇబ్బందులు కొనితెచ్చే అవకాశముంది.
ముఖ్యంగా బీఆర్‌ఐ రైల్వే ప్రాజెక్టుల్లో కీలకంగా ఉన్న పోలాండ్... అమెరికా, చైనాల మధ్య సంబంధాలను సమతుల్యం చేసుకోలేక కొన్నేళ్లుగా తంటాలు పడుతోంది. రష్యా ఆధిపత్య ధోరణిని ఆ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి శరణార్థులు పోటెత్తుతుండటం పోలాండ్‌కు కొత్త తలనొప్పిగా మారింది. డ్రాగన్ మద్దతు వల్లే పుతిన్ తాజా యుద్ధానికి తెగబడ్డారని అత్యధికులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలాండ్ పూర్తిగా అమెరికా వైపు మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, పుతిన్ వైఖరిని ఖండిస్తూ పలు ఈయూ దేశాలు తమ గగనతలంలో రష్యా విమానాల ప్రవేశాన్ని ఇప్పటికే నిషేధించాయి. మున్ముందు అవి రష్యా గుండా రైళ్ల రాకపోకలపైనా ఆంక్షలు ప్రకటించడం లాంఛనమేనని అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఎన్‌ఈఎల్‌బీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే. నాణ్యత లేని ప్రాజెక్టులు, భారీ వడ్డీతో కూడిన రుణాల కారణంగా బీఆర్‌ఐపై చాలా దేశాలు ఇప్పటికే పెదవి విరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐరోపా దేశాల ఆంక్షల సెగ తగిలితే బీఆర్‌ఐ ప్రతిష్ఠ మరింత దిగజారే అవకాశముంది.