ఎలా వచ్చిందో అలాగే పోతుందంటూ కొవిడ్ ప్రజ్వలనానికి పుణ్యం కట్టుకొన్న ట్రంప్ మహాశయుడు- మహమ్మారి సాకుతో అధ్యక్ష ఎన్నికల వాయిదాకు సూత్ర రహిత గాలిపటాలెగరేసిన కపట నాటక సూత్రధారి. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెయిల్ ద్వారా ఓటింగుకు పలు రాష్ట్రాలు సిద్ధమైనప్పటినుంచే, తన నుంచి అధికారం గుంజుకొనే కుట్ర జరుగుతోందన్న దుష్ప్రచారం ట్రంప్ ముఖతా మోతెక్కిపోయింది. అమెరికా చరిత్రలోనే అత్యధికంగా ఓట్లు పోలైన నవంబరు నాటి ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో తరాజు డెమోక్రాట్ల వైపు మొగ్గినప్పటినుంచే ట్రంప్ నాలుక బిరుసెక్కింది. అధికార బదలాయింపు సక్రమంగా సాగకుండా అడుగడుగునా అవరోధాలు సృష్టించిన శ్వేత సౌధాధిపతి- ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లను ఉభయసభలు పరిశీలించి తదుపరి అధ్యక్షుణ్ని ఖరారు చేసే వేళ మహా కుహకానికి తానుగా తెరతీశారు.
ఉపాధ్యక్షుడు పెన్స్ సారథ్యంలో జరిగే క్రతువును ప్రభావితం చేసేలా తెరమాటు తతంగం నడిపిన పెద్దమనిషి- కీలక సభా మందిరంపైకి తన అనుయాయుల్ని అక్షరాలా ఉసిగొలిపారు. ప్రాణభీతితో మాన్య సభ్యులు తలో దిక్కున తలదాచుకోగా, రక్షక భటుల కాల్పుల్లో నలుగురు నేలకొరిగిన వైపరీత్యం- ట్రంప్ రాజేసిన విద్వేషానలం ఎంత భయానకమైనదో కళ్లకు కడుతోంది. అమెరికా ప్రజాస్వామ్య మౌలిక విలువలపై ట్రంప్ చేసిన ఉగ్రదాడి ఇది. జాత్యహంకారంతో మితవాద మూకల్ని రెచ్చగొట్టి, తనంతటి వాడు లేడన్న నియంత వైఖరితో శ్వేతసౌధాన్నే చెరబట్టజూసిన ట్రంప్ ధిక్కార ధోరణి- ప్రపంచంలోనే అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశాన్ని నవ్వులపాలు చేసింది. క్యాపిటల్ ముట్టడి దరిమిలా ప్రాప్తకాలజ్ఞత రహించిన రిపబ్లికన్లు తుది ఫలితాలకు ఆమోదం తెలపడంతో ట్రంప్ సైతం దిగివచ్చి సజావుగా అధికార మార్పిడికి సరేనంటున్నారు. ప్రజాస్వామ్యాన్నే అపహసించిన ట్రంప్‌కు మరొక్క క్షణం కూడా అధ్యక్ష పదవిలో ఉండే అర్హత లేదు!