Chhattisgarh Elections Paatan Seat :ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొత్తం 90 శాసనసభ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతలో 20స్థానాల్లో ఈనెల 7న పోలింగ్ జరగనుంది. మిగతా సీట్లతో పోలిస్తే దుర్గ్ జిల్లాలోని పాటన్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘేల్, బీజేపీ నుంచి ఆయన అల్లుడు, దుర్గ్ ఎంపీ విజయ్ బఘేల్ మరోసారి పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో ఎప్పటి మాదిరిగా మామ-అల్లుళ్ల మధ్యే పోరు ఉంటుందని అంతా భావిస్తున్నప్పటికీ.. జనతా కాంగ్రెస్ నుంచి వారికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఓబీసీకి చెందిన రెండువర్గాల ఓట్ల ప్రభావం ఉన్న ఈ స్థానంలో జనతా కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మొదటి సీఎం అజిత్ జోగి తనయుడు అమిత్ జోగి బరిలో ఉన్నారు. విజేతను నిర్ణయించడంలో ఆయన కీలకంగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
'వారిపై ఈడీ విచారణ ఎందుకు జరపట్లేదు..'
పాటన్ నియోజకవర్గం నుంచి సీఎం భుపేశ్ బఘేల్ ఇప్పటివరకు ఒక్క 2008లో మినహా 5సార్లు విజయం సాధించారు. మరోసారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఈడీ చేసిన ఆరోపణలను బఘేల్ తోసిపుచ్చారు. ఈడీని పక్షపాత సంస్థగా పేర్కొన్న ఆయన మాజీ సీఎం రమణ్ సింగ్ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ నేత రమణ్ సింగ్, ఆయన సతీమణి, కుమారుడిపై ఓ చిట్ ఫండ్ సహా పలు కేసుల్లో అవినీతి ఆరోపణలున్నాయని ఆరోపించారు. వారిపై ఈడీ ఎందుకు విచారణ చేయట్లేదని బఘేల్ ప్రశ్నించారు.
'బఘేల్ ఒక ప్రీపెయిడ్ సీఎం..'
అధికార కాంగ్రెస్‌పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బఘేల్‌ను ప్రీపెయిడ్ సీఎంగా అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు సమస్య ఉందని, అధికార యంత్రాంగంతో పేద గిరిజనుల మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపుతామని అమిత్ షా హెచ్చరించారు. ఇక పాటన్ సీటులో ఈసారి విజయ్ బఘేల్ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.