తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బొమ్మలతో దిమ్మతిరిగే అవకాశాలు! - toys made in india

బొమ్మల రంగంపై దేశీయ అంకుర సంస్థలు దృష్టిపెట్టాలని కోరారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఏర్పాట్లు జరిగితే.. భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించే విధంగా బొమ్మలు తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తే.. ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం రండి..

toy industry in india after pm's call to develop domestic toys industry
బొమ్మలతో దిమ్మతిరిగే అవకాశాలు!

By

Published : Sep 15, 2020, 10:00 AM IST

చైనా దూకుడును కట్టడి చేసేందుకు కొన్ని యాప్‌లు, పబ్‌జీ లాంటి ఆటలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కళ్లెం వేసింది. చైనాను ఆర్థికంగా కట్టడి చేయాలన్నదే ఇందులో వ్యూహం. 'ఓకల్‌ ఫర్‌ లోకల్‌' పేరిట సాధ్యమైనంత మేర దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తులను పెంచుకోవాలనే లక్ష్యం కూడా ఇందులో ఇమిడి ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల నిర్వహించిన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పిల్లల బొమ్మల విషయం ప్రస్తావించారు. ఈ రంగంపై దేశీయ అంకుర సంస్థలు దృష్టిపెట్టాలని కోరారు. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఏర్పాట్లు జరగాలన్నారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించే విధంగా బొమ్మలు తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు. బొమ్మల తయారీలో దేశానికి 200 ఏళ్లకు పైగానే చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏటికొప్పాక, కొండపల్లి, కర్ణాటకలో చెన్నపట్నం సహా పలు ఇతర రాష్ట్రాల్లోనూ బొమ్మలు తయారు చేస్తూనే ఉన్నా- మార్కెట్‌లో వీటి వాటా చాలా పరిమితమే. వేగంగా మారుతున్న పిల్లల అభిరుచులకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని దేశీయ బొమ్మల పరిశ్రమ విస్తరించలేకపోయింది.

80శాతం చైనాలోనే...

ఇతర ఉత్పత్తుల్లాగానే బొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా తన ఆధిక్యాన్ని చాటుకుంది. చౌక ధరలకు రకరకాల బొమ్మలను తయారు చేసి పిల్లల ప్రపంచంలోకి చొచ్చుకుపోయింది. దుకాణాల్లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త బొమ్మలు ప్రత్యక్షమవుతుండటంతోపాటు చౌకగానూ లభిస్తుండటంతో వాటికి పోటీ లేకుండాపోయింది. అందుకే భారత్‌లోనే కాక ప్రపంచంలోని అనేక దేశాల మార్కెట్లలో సింహ భాగం చైనా బొమ్మలే కనిపిస్తుంటాయి. ప్రమాదకర రంగులు వినియోగిస్తున్నారని ప్రచారం జరిగినా తక్కువ ధరకే బొమ్మలు లభిస్తుండటంతో మధ్య అల్పాదాయ వర్గాలకు చెందిన వారు తమ పిల్లల చేతులకు ఈ బొమ్మలు ఇచ్చి వారి ముఖంలో కనిపించే ఆనందం చూసి సంతోషపడుతుంటారు.

చైనా బొమ్మలకు చెక్..

ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ఏటా సుమారుగా రూ.6.6లక్షల కోట్ల నుంచి రూ.7లక్షల కోట్ల విలువగల బొమ్మలు ఉత్పతి అవుతాయి. ఇందులో దాదాపు 80శాతం చైనాలో తయారయ్యేవే. భారత్‌ వాటా ఇందులో 0.5శాతం మాత్రమే. కార్పొరేట్‌ సంస్థలు ఈ రంగంపై అంతగా దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఈ రంగం ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. పార్లమెంటరీ స్థాయీసంఘం వాణిజ్యంపై సమర్పించిన తన 145వ నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. దేశంలో అమ్ముడయ్యే బొమ్మల్లో దాదాపు 75నుంచి 80శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నవేనని పేర్కొంది. చైనా ఇదంతా కేవలం రాత్రికి రాత్రే చేసిందనుకుంటే పొరపాటే. సుమారు 25ఏళ్లుగా ఈ రంగాన్ని అది ప్రోత్సహించింది. పరిశ్రమలకు కావాల్సిన చేయూతనందించింది. యువతకు బొమ్మల తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలుకొని పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించింది.

భారత్‌లో 130కోట్లకుపైగా జనాభా ఉంటే, ఇందులో సుమారు 27శాతందాకా 14ఏళ్లలోపు వారే. అంటే బొమ్మలకు ఎంత పెద్ద మార్కెట్‌ ఉందో ఊహించుకోవచ్ఛు పైగా ప్రజల ఆదాయాలు కొద్ది సంవత్సరాలుగా గణనీయంగానే పెరుగుతున్నాయి. మార్కెట్‌లో విక్రయించే బొమ్మలకు బీఐఎస్‌ ధ్రువీకరణ ఉండాలంటూ ఆదేశాలు రావడం ఈ రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి శుభసూచకమే. అలాగే కొన్ని రాష్ట్రాలు ఈ రంగంలో పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌లో 200 పరిశ్రమలను నెలకొల్పేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చెన్నై, పుణెల్లోనూ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బొమ్మల పరిశ్రమ కోసం 100 ఎకరాలు కేటాయించారు. రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. జాతీయ విద్యావిధానం-2020 అమలులో భాగంగానూ ఈ పరిశ్రమకు ఊతం లభిస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ అవకాశాలన్నీ సక్రమంగా వినియోగించుకుంటే దేశీయ మార్కెట్‌లోనే కాక ఇతర దేశాలకూ ఎగుమతి చేసి భారీగా విదేశ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. పిల్లల అభిరుచులు అత్యంత వేగంగా మారిపోతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త యంత్రాలు సమకూర్చుకొని బొమ్మలను రూపొందించాల్సిందే. భారీగా పెట్టుబడులు పెట్టే సంస్థలకే ఇది సాధ్యం. అలాగే నాణ్యత పేరుతో అధికంగా ధరలు నిర్ణయించినా మధ్యతరగతి కుటుంబాలు వీటిని కొనేందుకు వెనకంజ వేస్తాయి. ఈ రంగం రానున్న రోజుల్లో భారత్‌లో ఎలా విస్తరిస్తుందన్నది పరిశీలించాల్సిందే.

- కె.శివరామ్‌

ఇదీ చదవండి:'దుర్వినియోగమవుతున్న దేశద్రోహ చట్టం'

ABOUT THE AUTHOR

...view details