రెండు విడతల కొవిడ్ విజృంభణ, లాక్‌డౌన్లు, ఆంక్షలు, మూసివేతల ధాటికి అన్ని రంగాలూ ఛిన్నాభిన్నమయ్యాయి. అన్నింటికీ మించి పెద్ద దెబ్బ పర్యాటక రంగంపై పడింది. ప్రపంచ ప్రధాన ఆర్థిక రంగాల్లో ఇదొకటి. కొవిడ్ దెబ్బకు తొలిగా మూతపడి, చివరిగా తెరుచుకొనేది ఈ రంగమే. భారత ప్రయాణ, పర్యాటక రంగం వాటా జీడీపీలో 2.5 శాతంగా ఉంది. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య తొమ్మిది నెలల కాలంలో 2.15 కోట్ల మంది ఈ రంగంలో ఉద్యోగం, ఉపాధి కోల్పోయినట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించడం నష్ట తీవ్రతను స్పష్టంచేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో టూరిజం రంగంలో గణనీయ సంఖ్యలో ఉద్యోగాల నష్టం వాటిల్లినట్లు పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి రాజ్యసభకు తెలిపారు. కొవిడ్ మహమ్మారి ముందస్తు దశలో 2019-20లో సైతం 3.48 కోట్ల ఉద్యోగాల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పర్యటక రంగానికి తలెత్తిన నష్టాలపై ఎన్‌సీఏఈఆర్ అంచనాల్ని రూపొందించింది. 2020-21లో స్థూలంగా ఆర్థిక మందగమనం కారణంగా, పర్యాటక ఆర్థిక వ్యవస్థ 2020 ఏప్రిల్-జూన్‌లో 42.8 శాతం క్షీణించినట్లు తేలింది. మరోవైపు, 2019తో పోలిస్తే, 2020లో విదేశ మారక ద్రవ్య ఆర్జన (ఎఫ్‌ఈఈ) 76.3 శాతం తగ్గిపోయింది.
అపార నష్టం..
రెండో విడత కొవిడ్ ఉద్ధృతితో విధించిన లాక్‌డౌన్ కారణంగా పలు పర్యాటక ప్రదేశాల్ని మూసి ఉంచడంతో ఈ పరిశ్రమపై ఆధారపడే వారందరికీ తీవ్ర నష్టం వాటిల్లింది. ఆటోరిక్షా డ్రైవర్లు, బస్సులు, వాహనాలు, హోటళ్ల నిర్వాహకులు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్‌గైడ్లు, చిరు వ్యాపారులు వంటి వారందరికీ జీవనోపాధి కరవైంది. వరసగా రెండేళ్లు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమేనని, తమ బతుకులు మరింత భారంగా మారాయని వాపోతున్నారు. కనీస అవసరాల్ని తీర్చుకోవడానికి సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు. రుణాలు భారీగా పెరిగి, పెనుభారంగా పరిణమించినట్లు ఆవేదన చెందుతున్నారు. పర్యాటక కేంద్రాల్ని తిరిగి తెరిచేవరకు తమను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటూ ప్రభుత్వాలపై ఆశలు పెట్టుకొన్నారు. పర్యాటక పరిశ్రమకు భారీ ఆర్జన సాధించిపెట్టే సీజన్లు లాక్‌డౌన్లతో నష్టాల్లోనే ముగిశాయి. అయినప్పటికీ చాలా సంస్థలు తమ ఉద్యోగులకు భారంగానైనా వేతనాలు చెల్లిస్తూ, కరెంటు ఇతరత్రా రుసుములు భరిస్తున్నాయి.
పర్యటక సీజన్ ప్రారంభమైన తరవాత మరోసారి వైరస్ వ్యాప్తి చెంది, మొత్తంగా మూసివేయకుండా ఉండేందుకు- టీకా వేసుకున్నట్లు, లేదా కరోనా నెగెటివ్ ధ్రువపత్రం ఉంటేనే అనుమతించాలని, లేనివారికి ప్రవేశమార్గాల వద్దే అవసరమైన ఏర్పాట్లు చేయాలని పర్యాటక సంస్థలు సూచిస్తున్నాయి.
మినహాయింపులు ఇస్తే మేలు..