'చైనాతో భారీ సరిహద్దు ఘర్షణకు దారి తీసే అవకాశం లేకపోలేదు' అని మహాదళాధిపతి బిపిన్ రావత్ ఇటీవల వ్యాఖ్యానించారు. అదే క్రమంలో ఆయన ఆయుధ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలకు సంబంధం ఉంది. చైనా వంటి దేశాలను స్వల్పకాల యుద్ధాల్లో బలంగా ఎదుర్కోవచ్చు. కానీ, అది దీర్ఘకాలిక యుద్ధంగా మారితే మాత్రం కష్టం. ఎందుకంటే చైనాలో ఆయుధాలు చాలా వరకు దేశీయ కర్మాగారాల్లో తయారవుతాయి. భారత్‌లో ఆ పరిస్థితి ఉందా? అప్పటికప్పుడు ఆయుధాల కొనుగోలు అనగానే విక్రేతలు ధరలను పెంచేయరా అనే సందేహాలు తలెత్తక మానవు.
వ్యూహాత్మక ఒప్పందాలు అవసరం
'కార్గిల్ యుద్ధ సమయంలో భారత్‌ను ఆయుధ సరఫరాదారులు దోచుకున్నారు. ముందు చెప్పిన ఆయుధాలు కాకుండా, పాతవి సరఫరా చేశారు. కొన్ని దేశాలైతే వియత్నాం యుద్ధసమయం నాటి మందుగుండును అంటగట్టాయి' అని నాటి ఆర్మీ చీఫ్ వేద్‌ప్రకాశ్ మాలిక్ గత ఏడాది చండీగఢ్‌లో జరిగిన డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్‌లో వ్యాఖ్యానించారు! ఇది రక్షణ ఉత్పత్తుల్లో దేశ బలహీనతలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయుధ తయారీ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా గట్టి ప్రయత్నాలే మొదలయ్యాయి. ఆగస్టులో రక్షణ శాఖ 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై అయిదు దశల్లో నిషేధం విధించింది. అందులో 2020తో ముగిసే తొలి దశలో తేలికపాటి యుద్ధ విమానాలు ఉండగా, 2025తో ముగిసే తుదివిడతలో ఉపరితలంపై దాడి చేసే క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. శతఘ్నులు, క్షిపణి విధ్వంసక నౌకలు, నౌకలపై నుంచి ప్రయోగించే క్షిపణులు, తేలికపాటి రవాణా విమానాలు, సమాచార ఉపగ్రహాలు, శిక్షణ విమానాలు, బహుళ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, రాడార్లు, రైఫిళ్లు, చిన్నపాటి డ్రోన్లు సైతం ఉన్నాయి.
మరోవైపు, భారత రక్షణ రంగ ఎఫ్‌డీఐలను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది. రక్షణ ఆయుధ సేకరణ విధివిధానాలు-2020 గత నెల నుంచే అమలులోకి వచ్చింది. ఎఫ్‌డీఐల పరిమితి పెంచితే మనదేశంలో చౌకగా కార్మికశక్తి అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడే కర్మాగారాలు పెడతారని భావిస్తున్నారు. కానీ, చాలా దేశాల్లో రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమలు ఉన్నా- వాటిపై కఠిన నియంత్రణ ఉంటుంది. ఆయా దేశాలతో భారత్ వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకొంటేనే అక్కడి కంపెనీలు పరిమిత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి తరలించే అవకాశం ఉంది. వాటిని భవిష్యత్తు సాంకేతికత అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా మాత్రమే భారత్ వాడుకోవాలి. ఈ క్రమంలో సాంకేతికతను అర్థం చేసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మరోవైపు, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ బోర్డుపై విమర్శలు పెరిగాయి. ఈ సంస్థ సరఫరా చేసిన మందుగుండు వల్ల 2014 నుంచి 2020 వరకు 403 ప్రమాదాలు జరిగి 27 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ఆ సంస్థ పనితీరులో నాణ్యత, జవాబుదారీతనం, పోటీతత్వం పెంచే దిశగా యోచిస్తోంది. అదేవిధంగా రక్షణ రంగ పరిశోధన సంస్థ ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించేందుకు వివిధ విభాగాలతో సంయుక్త ప్రాజెక్టు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
విదేశీ రక్షణ సంస్థలు భారత్‌లోనే తయారీ, పరిశోధనశాలలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధంగా ప్రభుత్వం ఇప్పటికే ఎఫ్‌డీఐల పరిమితిని పెంచింది. దీనికి ముందుజాగ్రత్తగా 'జాతీయ భద్రత తనిఖీ' నిబంధనను జోడించింది. రష్యా వంటి వ్యూహాత్మక భాగస్వామితో కలిసి బ్రహ్మోస్ ప్రాజెక్టులో చేసిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇచ్చాయి. కానీ, వాటి ఎగుమతులకు సంబంధించిన అనుమతులు రష్యా నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొంటూ దేశీయ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.