తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సంక్షోభంలో టాలీవుడ్​.. పరిష్కారం దొరుకుతుందా?

Tollywood shootings problems: ఇతర పరిశ్రమలతో పోలిస్తే కొవిడ్‌ దెబ్బ నుంచి త్వరగానే కోలుకొని సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా కనిపించిన టాలీవుడ్‌- ప్రస్తుతం కొన్ని స్వీయ తప్పిదాల వల్ల సంక్షోభ స్థితిని కొనితెచ్చుకొంది. టికెట్​ రేట్లు, నిర్మాణ వ్యయాలు, ప్రేక్షకుల థియేటర్లకు రాకపోవడం, ఓటీటీలో సినిమాల విడుదల ఇలా పలు సమస్యలు తెలుగు చిత్రసీమను చుట్టుముట్టి షూటింగ్​లు ఆపేస్థితికి చేర్చాయి. మరి దీని పరిష్కారం ఎలా?

tollywood shootings band
సంక్షోభంలో టాలీవుడ్​.. పరిష్కారం దొరుకుతుందా?

By

Published : Aug 8, 2022, 9:47 AM IST

Tollywood shootings problems: తెలుగు సినీ పరిశ్రమలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి చిత్రీకరణలు నిలిచిపోయాయి. కార్మికుల సమ్మె, ఇతర కారణాల వల్ల గతంలోనూ షూటింగులను ఆపివేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, సినిమాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయి, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారి నిర్మాతలే చిత్రీకరణలను నిలుపుదల చేయడం తొలిసారి చూస్తున్నాం. బాహుబలి, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌ పరిశ్రమ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. అలాంటి ఇండస్ట్రీలో ప్రస్తుతం విజయాల శాతం, వసూళ్లు బాగా తగ్గిపోతూ థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇతర పరిశ్రమలతో పోలిస్తే కొవిడ్‌ దెబ్బ నుంచి త్వరగానే కోలుకొని సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా కనిపించిన టాలీవుడ్‌- కొన్ని స్వీయ తప్పిదాల వల్ల సంక్షోభ స్థితిని కొనితెచ్చుకొంది.

ఓటీటీల హవా..సినిమాలకు శత దినోత్సవాల రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు కొత్త చిత్రాల జోరు వారాంతానికే పరిమితం. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేసి తొలి వారాంతంలో సాధ్యమైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవడంపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం తొలి వారాంతంలోనూ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుండటం పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తోంది. వారాంతం వస్తే కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్ళి సినిమా చూడటం తెలుగు వారిలో చాలామందికి అలవాటు. కరోనా వల్ల కొన్ని నెలల పాటు సినిమాహాళ్లు మూతపడటంతో ఓటీటీలకు అలవాటుపడినవారు మళ్ళీ థియేటర్ల వైపు వెళ్ళడంలేదు. భారీ బడ్జెట్‌ సినిమాలను మినహాయిస్తే వేరే వాటి కోసం వెండితెరల వైపు వారి చూపు మళ్లడం లేదు. మరోవైపు పెరిగిన టికెట్ల ధరలు సైతం కొన్ని నెలలుగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ఓ ముఖ్య కారణం. కరోనా నష్టాలను పూడ్చుకోవడానికి, పెరిగిన నిర్మాణ వ్యయానికి తగినట్లు ఆదాయం రాబట్టుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలను కలిసి సినీ నిర్మాతలు టికెట్ల ధరలు పెంచుకున్నారు. ఒక్కసారిగా 50 నుంచి 100 శాతానికి పైగా ధరలు పెంచేయడం, పైగా పెద్ద సినిమాలకు తొలి వారంలో అదనంగా రేట్లు వడ్డించడం ప్రేక్షకుడికి ఏమాత్రం రుచించలేదు. తెలంగాణలో ఒక పెద్ద సినిమా చూడాలంటే సింగిల్‌ స్క్రీన్‌లో రూ.250, మల్టీప్లెక్సులో రూ.450 దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుడు టికెట్ల ధరలను మరీ తగ్గించేసింది. సినీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దలను కలిసి పలుమార్లు విన్నవించాక రేట్లు పెంచారు. టికెట్ల ధరలకు తోడు సినిమాహాళ్లలో తినుబండారాల రేట్లూ బాగా పెరిగి కుటుంబాలు క్రమంగా థియేటర్లకు దూరం అయిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కినా కొనక తప్పదు. సినిమా వినోదమే తప్ప అవసరం కాదు. పైగా థియేటర్‌కు ప్రత్యామ్నాయంగా ఓటీటీ వచ్చేసింది. వాటిలో వినోదం చౌకగా దొరుకుతోంది. బోలెడన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులో ఉంటున్నాయి. కరోనా సమయంలో స్మార్ట్‌ టీవీ ఉన్న ప్రతి ఇంటికీ ఓటీటీ వచ్చేసింది. రిలీజైన మూడు నాలుగు వారాలకే కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వస్తుండటంతో సినిమాహాళ్ల పట్ల విముఖత క్రమంగా పెరిగిపోతోంది. కొద్ది రోజులు ఆగితే హాయిగా ఇంట్లో కూర్చొని సినిమా చూడవచ్చు అనే భావనలోకి ప్రేక్షకులు వెళ్ళిపోతున్నారు.

పరిష్కారం దొరుకుతుందా?..ప్రస్తుతం సినీ పరిశ్రమ సంక్షోభానికి నిర్మాతలు కూడా బాధ్యత వహించాల్సిందే! ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా అని హేతుబద్ధత లేకుండా టికెట్ల ధరలు పెంచుకున్నారు. అదిప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఓటీటీల నుంచి వచ్చే ఆదాయానికి ఆశపడి థియేటర్లలో రిలీజైన మూడు నాలుగు వారాలకే వాటిలో ప్రదర్శితమయ్యేలా హక్కులు కట్టబెట్టడమూ చేటు చేసింది. ఓటీటీలు పరోక్షంగా థియేటర్ల ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, శాటిలైట్‌ హక్కుల ధరలు పడిపోవడానికీ కారణమయ్యాయి. మరోవైపు నిర్మాణ వ్యయం, థియేటర్ల అద్దెలు, ప్రదర్శన ఖర్చు పెరిగిపోవడమూ పెద్ద సమస్యగా మారింది. స్టార్‌ హీరోలు, దర్శకులకు చెల్లిస్తున్న భారీ పారితోషికాలకు కోత వేస్తే కార్మికులు సంతృప్తి చెందేలా వేతనాలు ఇవ్వడం, నిర్మాణ వ్యయం అదుపులో ఉంచడం కష్టమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్ల అద్దె తక్కువగా ఉండేలా చూడటమూ తప్పనిసరి. సినిమాహాళ్లలో విడుదలకు, ఓటీటీల్లో ప్రసారానికి మధ్య వ్యవధి పెంచడం, టికెట్ల ధరలను అందుబాటులోకి తేవడమూ ముఖ్యమే. అన్నింటికీ మించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా నాణ్యమైన సినిమాలు తీయడం, వాటిని వెండితెరపైనే చూడాలనే భావన కలిగించడం కీలకం.

ఇదీ చూడండి: పిలుస్తున్న బాలీవుడ్.. హిందీ చిత్రసీమలో తెలుగు దర్శకుల హవా!

ABOUT THE AUTHOR

...view details