దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం పోనుపోను పెచ్చుమీరుతోంది. లక్షల ప్రాణాలను క్యాన్సర్ రక్కసి బలిగొంటోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుబంధ సంస్థ జాతీయ వ్యాధి సమాచార విశ్లేషణ, పరిశోధన కేంద్రం(ఎన్‌సీడీఐఆర్) తాజా పరిశీలన ఈ విషయాన్ని మరోమారు నిర్ధారించింది. 2012-19 మధ్య కాలంలో దేశంలో సుమారు పదమూడు లక్షల మంది పలు రకాల క్యాన్సర్ల బారినపడ్డారు. అందులో 33శాతం కేసులకు పొగాకు వినియోగమే కారణమని ఎన్‌సీడీఐఆర్ స్పష్టంచేసింది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ఖైనీ, గుట్కా, పాన్‌మసాలా వంటి రూపాల్లో పిల్లల నుంచి వయోధికుల వరకు పొగాకును విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల పొగాకును నేరుగా నమలడమూ కనిపిస్తోంది. ఫలితంగా నోరు, గొంతు, నాలుక, పంటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ముమ్మరిస్తున్నాయి.
పలురకాల రుగ్మతలు
పొగాకు ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో యాభై శాతానికి పైగా ఈశాన్య రాష్ట్రాల వారే. మొత్తం కేసుల్లో 28 శాతం దక్షిణాది రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొగాకు వల్ల తలెత్తే క్యాన్సర్లలో సింహభాగం వాటా నోటి క్యాన్సర్‌దే. ఇది మహిళలనూ ఎక్కువగానే కబళిస్తున్నట్లు ఎన్‌సీడీఐఆర్ నివేదిక స్పష్టీకరిస్తోంది. నోటి క్యాన్సర్‌కు గుట్కా వాడకం ప్రధాన కారణమవుతోంది. దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలూ గుట్కా తయారీ, అమ్మకాలను నిషేధించాయి. కానీ, అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు తరచూ పెద్దయెత్తున పట్టుబడుతూనే ఉన్నాయి. ధూమపానంతో ఏటా లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. పొగ తాగేటప్పుడు విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హెమోగ్లోబిన్‌లో వేగంగా కలిసిపోయి శరీరంలో ఆక్సిజన్ స్థాయులను తగ్గిస్తుంది. ఫలితంగా రకరకాల రుగ్మతలు చుట్టుముడుతున్నాయి.
పొగాకు వినియోగాన్ని నియంత్రించేందుకు 2003లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికలో సైతం భారత్ పదిహేనేళ్ల క్రితమే భాగస్వామి అయింది. వీటి ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించకూడదు. విద్యాసంస్థలకు సమీపంలో వాటి అమ్మకం జరపకూడదు. పొగాకు ఉత్పత్తుల ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలు, వాటి ప్రోత్సాహమూ నిషేధం. ఆయా ఉత్పత్తుల ప్యాకింగులపై 85శాతం స్థలంలో ఆరోగ్య సంబంధిత హెచ్చరికలు ముద్రించాలి. ఈ నిబంధనల్లో ఎక్కువ శాతం క్షేత్రస్థాయిలో కొల్లబోతున్నాయి. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ఆయా ఉత్పత్తులపై ప్రభుత్వం పన్నులనూ పెంచింది. దీని వల్ల పొగాకు వినియోగం ఏటా ఒక శాతం మేర తగ్గుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం 2007లోనే జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ ప్రజారోగ్య సంక్షోభానికి పొగాకు కారణమవుతూనే ఉంది.