జల వనరులు దురాక్రమణకు గురవుతుండటం పెను విపత్తులకు దారితీస్తోంది. నిరుడు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలకు దురాక్రమణలే ప్రధాన కారణమని ఇటీవల విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడైంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తలెత్తుతున్న నిర్వహణ, ప్రణాళిక లోపాలకు ఈ నివేదిక అద్దంపట్టింది. వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను నిర్మాణాత్మకంగా వినియోగించుకోవడంలోని వైఫల్యాన్ని ఈ నివేదిక ఎండగట్టింది.
ప్రణాళికల్లేని నగరీకరణతోనే...
ఉద్యోగ, ఉపాధి అవకాశాల అన్వేషణలో భాగంగా నగరాలు, పట్టణాలకు వలసలు పెరుగుతుండటంతో పెద్దయెత్తున పట్టణీకరణ అనివార్యమైంది. విస్తరిస్తున్న జనాభా అవసరాలకు అనుగుణంగా భూవినియోగం, లభ్యతను దృష్టిలో ఉంచుకుని స్థిరాస్తి వ్యాపారులు చెరువు గర్భాల్లోని భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మేయడం, అక్రమార్కులకు అధికార యంత్రాంగం అవినీతి సైతం తోడై రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా సులభంగా పూర్తవుతుండటం చూస్తున్నాం.
పర్యవసానంగా భారీయెత్తున చెరువులు, కుంటల్లోనే జనావాసాలు వెలుస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం వల్ల భవన నిర్మాణదారులు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలకు డ్రెయినేజీ లైన్లు వేసి మురుగునీటిని మళ్లించడమో లేక వరదనీటి మార్గాలకు మురుగునీటి పైపులైన్‌లను కలపడమో చేశారు. మురుగునీరు యథేచ్ఛగా చెరువులు, కుంటల్లోకి వచ్చి చేరడంతో పిచ్చిమొక్కలు పుష్కలంగా పెరిగి చెరువుల నీటి నిల్వ సామర్థ్యానికి గండిపడింది. జీవ వైవిధ్యం నాశనమైంది. ఇందుకు నిదర్శనాలు- హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ సరస్సు, నగరం గుండా ప్రవహిస్తున్న మూసీనదే.
వివిధ నగరాల్లో ఇలా...
హైదరాబాద్ నగరంలో, శివారు ప్రాంతాల్లో ఒకప్పుడు లక్ష చెరువులుంటే ప్రస్తుతం హెచ్‌ఎండీ పరిధిలో 3,132; నగర పరిధిలో 185 మాత్రమే మిగిలాయని ప్రభుత్వం నియమించిన 'సరస్సు పరిరక్షణ కమిటీ'యే లెక్కగట్టింది. గడచిన 12ఏళ్లలో హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, సరస్సులు 3,245 హెక్టార్ల విస్తీర్ణంలో భూమిని కోల్పోయాయని సొసైటీ ఫర్ పార్టిసిపేటరీ డెవలప్‌మెంట్ సంస్థ 2017లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్- ఐఐఎస్‌సీ బెంగళూరుకు సమర్పించిన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
2005 గణాంకాల ప్రకారం 12,535 ఎకరాల్లో విస్తరించిన చెరువులు 2016నాటికి 22,833 హెక్టార్ల విస్తీర్ణానికి తగ్గిపోయాయి. విశాఖపట్నం జిల్లాలో ఒక్క గ్రేటర్ విశాఖ పరిధిలోనే 151 సహజసిద్ధమైన చెరువులు ఉన్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 1902 సంవత్సరం నాటి భూ రికార్డులతో పోల్చి చూస్తే ప్రస్తుతం 2000 హెక్టార్ల విస్తీర్ణం మేర చెరువుల భూములు ప్రైవేటు వ్యక్తుల దురాక్రమణకు గురైనట్లు తేలింది.